నిర్మాతలు ఇకనైనా మారాలి
బాలీవుడ్ లో గత పదేళ్ల కాలంలో భారీ ప్రశంసలు పొందిన సినిమాలకు సీక్వెల్స్ చేయడం బాగా పెరిగింది.
By: Sravani Lakshmi Srungarapu | 10 Jan 2026 8:30 AM ISTబాలీవుడ్ లో గత పదేళ్ల కాలంలో భారీ ప్రశంసలు పొందిన సినిమాలకు సీక్వెల్స్ చేయడం బాగా పెరిగింది. కానీ ఈ సీక్వెల్స్ లో చాలా తక్కువ సినిమాలు మాత్రమే వాటి ఒరిజినల్ సినిమాల్లాగా సక్సెస్ అవగలిగాయి. బాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో అసలు నిర్మాతలు ఎందుకు కొన్ని సినిమాలకు బలవంతపు సీక్వెల్స్ చేయడానికి ఇష్టపడుతున్నారని ఆడియన్స్ ప్రశ్నిస్తున్నారు.
సీక్వెల్స్ పైనే ఆధారపడ్డ బాలీవుడ్
గతంలో మాదిరిగా కొత్త కథలు, క్రియేటివ్ స్టోరీలను బాలీవుడ్ నిర్మాతలు ఎందుకు పక్కన పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. బాలీవుడ్ లో క్రియేటివ్ గా కష్టపడటం, కొత్త కథలపై రిస్క్ తీసుకోవడానికి నిర్మాతలు ఇష్టపడకపోవడం వల్లే ఎక్కువగా సీక్వెల్స్ పై ఆధారపడుతున్నారని ట్రేడ్ ఎనలిస్టులు చెప్తున్నారు. బాలీవుడ్ విమర్శకుల ప్రకారం, రీసెంట్ గా వచ్చిన ఎన్నో సీక్వెల్స్ కేవలం డబ్బు కోసమే తీశారు తప్పించి, అందులో ఎలాంటి స్టోరీ, స్క్రీన్ ప్లే లేవని, ఆ సీక్వెల్స్ అన్నీ పాత సినిమాలోని జ్ఞాపకాలపైనే ఆధారపడుతున్నాయని అంటున్నారు.
చాలా వరకు ఫెయిలైన సీక్వెల్స్
బాలీవుడ్ లో సీక్వెల్స్ కొత్తేమీ కాదు, కానీ ఒకప్పుడు సీక్వెల్స్ అంటే కథకు నిజంగా కొనసాగింపుగా ఉండేవి, కానీ ఇప్పుడది బ్రాండ్ నేమ్ పైనే ఆధారపడి ఉంది. ఆ టైటిల్స్ ను వాడి కమర్షియల్ సేఫ్టీ కోసమే వాడుతున్నారని అంటున్నారు. వెల్‌కమ్ బ్యాక్, యమ్లా పగ్లా దీవానా2, జిస్మ్ 2 లాంటి సినిమాలు కూడా ఇలాంటి ఉద్దేశంతోనే తీశారని, కానీ ఆ సినిమాల్లో ఎక్స్‌ట్రా ఎట్రాక్షన్ లేకపోవడంతో అందులో చాలా వరకు ఫెయిల్ అయ్యాయని చెప్తున్నారు.
రిస్క్ చేయకూడదని డిసైడైన నిర్మాతలు
కొత్త ఆలోచనలకు, ప్రయోగాలకు సపోర్ట్ చేయడంలో ఎక్కువ రిస్క్ ఉందని భావించిన బాలీవుడ్, ఆ రిస్క్ తీసుకోవడానికి ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదని, అందుకే సీక్వెల్స్ పైనే నిర్మాతలు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని అంటున్నారు. అయితే ఇలా చేయడం వల్ల ఎన్నో నష్టాలున్నాయి. ఈ సీక్వెల్స్ లో తెలిసిన నటీనటులు, డైరెక్టర్ల నుంచే సినిమాలొస్తాయి తప్పించి కొత్త వారికి అవకాశాలు రావు. అయితే ఎవరెన్ని చెప్పినా ఇలాంటి సీక్వెల్ సినిమాలు ఎక్కువగా రావడానికి కారణం మాత్రం ఆడియన్స్ ఈ తరహా సినిమాలను చూడ్డానికి ఆసక్తి చూపించడమే. కానీ ఇప్పటికైనా బాలీవుడ్ నిర్మాతలు రిస్క్ చేసి డిఫరెంట్ కథలను ఎంపిక చేసుకోకపోతే బాలీవుడ్ స్థాయి మరింత తగ్గడం ఖాయం.
