టికెట్ రీసేల్ ధర రూ.90,000 .. నోలాన్ మూవీ IMAX వెర్షన్ క్రేజ్!
ఈ సినిమాపై గత నెల రోజులుగా సాగుతున్న నెగెటివ్ క్యాంపెయిన్‌ను ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని తాజా టికెట్ బుకింగ్స్ నిరూపిస్తున్నాయి.
By: Sivaji Kontham | 5 Jun 2026 1:35 PM ISTప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'ది ఒడిస్సీ' బాక్సాఫీస్ వద్ద ఇప్పుడే ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సినిమాపై గత నెల రోజులుగా సాగుతున్న నెగెటివ్ క్యాంపెయిన్‌ను ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని తాజా టికెట్ బుకింగ్స్ నిరూపిస్తున్నాయి. ఐమాక్స్ టికెట్ల కోసం గురువారం ఉదయం ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో ప్రముఖ థియేటర్ చైన్ AMC మొబైల్ అప్లికేషన్ కొద్దిసేపు నిలిచిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. ఫాండాంగో వంటి సైట్లలో కూడా అభిమానులు గంటల తరబడి వేచి చూసి టికెట్లు కొనుగోలు చేయడం సినిమాపై ఉన్న అంచనాలను ప్రతిబింబిస్తోంది.
గ్రీకు ఇతిహాసం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మ్యాట్ డామన్, అన్నే హాత్వే, చార్లీజ్ థెరాన్, రాబర్ట్ ప్యాటిన్సన్ వంటి దిగ్గజ నటులతో పాటు జెండయా, టామ్ హాలండ్ వంటి యువ తారలు నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో లూపిటా న్యోంగో - ఇలియట్ పేజ్‌లను ఎంపిక చేయడంపై అమెరికాలోని కన్జర్వేటివ్ వర్గాలు...ఎలాన్ మస్క్ తీవ్ర విమర్శలు గుప్పించారు. `హెలెన్ ఆఫ్ ట్రాయ్` పాత్రలో నల్లజాతి నటిని, అలాగే అకిలెస్ పాత్రలో ట్రాన్స్‌జెండర్ నటుడిని ఎంపిక చేయడం ద్వారా నోలన్ చరిత్రను వక్రీకరిస్తున్నారని మస్క్ ఆరోపించారు.
ముఖ్యంగా ఎక్స్ (X) వేదికగా ఎలాన్ మస్క్ ఈ సినిమాపై వరుస పోస్టులతో దాడికి దిగారు. అకాడమీ అవార్డుల (ఆస్కార్) నిబంధనల కోసమే నోలన్ ఇలాంటి వైవిధ్యమైన తారాగణాన్ని ఎంచుకున్నారని... ఇది కేవలం అవార్డుల వేటలో భాగమేనని మస్క్ విమర్శించారు. రైట్ వింగ్ వ్యాఖ్యాతలు కూడా హెలెన్ ఆఫ్ ట్రాయ్ శ్వేతజాతీయురాలు అని... ఆమె పాత్రను లూపిటా పోషించడం చరిత్రను తిరగరాయడమేనని వాదించారు. అయితే గత ఏడాదే ప్రీ-సేల్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవ్వడం గమనార్హం.
ఈ విమర్శలపై నటి లూపిటా న్యోంగో ఎంతో హుందాగా స్పందించారు. విమర్శలను ఎదుర్కోవడానికి నేను సమయాన్ని వృథా చేయను. విమర్శలు అనేవి ఎప్పుడూ ఉంటాయి.. కానీ నోలన్ ఈ కథను చెప్పాలనుకుంటున్న విధానానికి నేను పూర్తి మద్దతు ఇస్తున్నాను. మా తారాగణం నేటి ప్రపంచానికి ప్రతిబింబం! అని వ్యాఖ్యానించారు. నోలన్ గతంలో `ఓపెన్‌హైమర్` సినిమాతో ఆస్కార్ నిబంధనలను పాటిస్తూనే విజయం సాధించారని... ఇప్పుడు కూడా తనదైన విజన్ తో ముందుకు వెళ్తున్నారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు.
మొత్తానికి `యాంటీ-వోక్` పేరుతో ఈ సినిమాపై జరుగుతున్న ప్రచారం ఏమాత్రం ప్రభావం చూపడం లేదని తాజా పరిణామాలు స్పష్ఠం చేస్తున్నాయి. రాజకీయ విమర్శలు ఎన్ని ఉన్నా నోలన్ మేకింగ్ పై ఉన్న నమ్మకంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. సినిమా విడుదల ఇంకా సమయం ఉన్నా.. ఐమాక్స్ టికెట్ల కోసం ఎగబడుతున్న జనాన్ని చూస్తుంటే `ది ఒడిస్సీ` హాలీవుడ్ లో మరో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆసక్తికరంగా ది ఒడిస్సీ టికెట్లను మొదటిసారి బుకింగులు ఓపెన్ అవ్వగానే బల్క్ గా కొనుక్కుని కొందరు వాటిని ఈబే వంటి థర్డ్ పార్టీ వెబ్ సైట్లలో రీసేల్ చేస్తుండడం సంచలనంగా మారింది. ఐమ్యాక్స్ 70ఎంఎం ఫార్మాట్ లో ది ఒడస్సీ సినిమాని చూడటం కోసం ఏకంగా ఒక్కో టికెట్ కు రూ.40,000 (500 డాలర్లు) నుంచి 90,000 (1000 డాలర్లు) చెల్లించేందుకు వెనకాడకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. (ఒరిజినల్ టికెట్ ధర కేవలం 20డాలర్ల నుంచి 30డాలర్ల లోపు మాత్రమే)
హైదరాబాద్ ఐమ్యాక్స్- ఇండియాలోను భారీ క్రేజ్:
నోలాన్ మూవీ ఊపు చూస్తుంటే త్వరలో ప్రారంభం కాబోతున్న హైదరాబాద్ ఐమ్యాక్స్ (ఏఎంబి ప్రాపర్టీ)లో నోలాన్ సినిమా ది ఒడిస్సీ సంచలనాలు సృష్టిస్తుందని అంచనా వేయొచ్చు. భారతదేశంలో క్రిస్టోఫర్ నోలాన్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా కూడా అవతార్ ఫ్రాంఛైజీ తరహాలో వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. `దురంధర్ 2` తర్వాత ఇండియాలో మరో ప్రభంజనం చూడబోతున్నామా? అంటూ నోలాన్ ఇండియన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాల్లో వ్యాఖ్యానించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
