IMAX ఎత్తేయడానికి అసలు కారణం ఇదేనా?
కొన్నేళ్ల క్రితం ప్రసాద్స్ ఐమ్యాక్స్ కి ఎలాంటి పేరు ఉండేదో తెలిసినదే. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఐమ్యాక్స్ స్క్రీన్ హైదరాబాద్ ప్రసాద్స్ లో మాత్రమే అందుబాటులో ఉండేది.
By: Sivaji Kontham | 4 Jan 2026 2:51 PM ISTకొన్నేళ్ల క్రితం ప్రసాద్స్ ఐమ్యాక్స్ కి ఎలాంటి పేరు ఉండేదో తెలిసినదే. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఐమ్యాక్స్ స్క్రీన్ హైదరాబాద్ ప్రసాద్స్ లో మాత్రమే అందుబాటులో ఉండేది. 2009లో `అవతార్ 3డి` చిత్రాన్ని ఐమ్యాక్స్ లార్జ్ స్క్రీన్ లో వీక్షించిన వారంతా పండోరా గ్రహంపై సంచరించామా? అంటూ ట్రాన్స్ లోకి వెళ్లేవారు.
ఆ తర్వాత చాలా హాలీవుడ్ సినిమాలను ఐమ్యాక్స్ లార్జ్ స్క్రీన్ లో వినోదప్రియులు ఆదరించారు. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో మారుమూల ప్రాంతాల నుంచి హైదరాబాద్ కి వెళ్లి మరీ ఐమ్యాక్స్ లో సినిమాలు చూసినవారు ఉన్నారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చే టూరిస్టులు ఐమ్యాక్స్ ని సందర్శించేవారు. అంత గొప్ప ప్రాముఖ్యత ఉన్న ఐమ్యాక్స్ స్క్రీన్ లైసెన్సింగ్ పునరుద్ధరించకపోవడంతో అభిమానులంతా తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.
కొన్నేళ్లుగా ఐమ్యాక్స్ అభిమానులు ఏదో ఒకరోజు ప్రసాద్స్ ఐమ్యాక్స్ మళ్లీ లైసెన్స్ ని రెన్యువల్ చేస్తుందని ఆశించారు. కానీ కుదరలేదు. అయితే ఐమ్యాక్స్ సినిమాల మేకింగ్ పెరిగిన ఈ రోజుల్లో హైదరాబాద్ లాంటి చోట ఐమ్యాక్స్ లేకపోవడం నిజంగా నిరాశపరుస్తోంది.
ఇదే విషయంపై సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత, యువనిర్మాత నాగవంశీ తన అభిప్రాయాన్ని తెలిపారు. ఇటీవలి కాలంలో ఐమ్యాక్స్ కంటెంట్ ఎక్కువగా తెరకెక్కుతోంది. ప్రపంచవ్యాప్తంగా వీటి వెల్లువ కొనసాగుతోంది. అందువల్ల రాబోవు రెండేళ్లలో ఒకట్రెండు ఐమ్యాక్స్ స్క్రీన్లు హైదరాబాద్ లో ప్రారంభమయ్యే ఛాన్సుందని అన్నారు. అయితే ఏషియన్ సినిమాస్ లాంటి దిగ్గజ సంస్థలను ఐమ్యాక్స్ స్క్రీన్ల ఏర్పాటు గురించి ప్రశ్నించాలని కూడా అన్నారు. కనీసం దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తున్న వారణాసి రిలీజ్ సమయానికి అయినా ఐమ్యాక్స్ స్క్రీన్ వస్తే బావుంటుందని నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు.
అంత సులువు కాదు:
అయితే ఐమ్యాక్స్ స్క్రీన్ల లైసెన్సింగ్ చాలా ఖరీదైన వ్యవహారం. మాల్స్ లో వీటిని ఏర్పాటు చేయడానికి స్పేస్ చాలా ఎక్కువ అవసరం. అదే సమయంలో లార్జ్ స్క్రీన్ల నిర్వహణా భారం అంతా ఇంతా కాదు. టికెట్ ధరలు పెంచితే తెలుగు రాష్ట్రాలలో ఆడియెన్ ని థియేటర్లకు రప్పించడం అంత సులువు కాదు. ఐమ్యాక్స్ స్క్రీన్లకు టికెట్ ధరలు దాదాపు రెట్టింపు ఉండాలనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది.
పెద్ద స్టార్లు దృష్టి సారించాలి:
ఏషియన్ సినిమాస్‌తో కలిసి స్టార్ హీరోలు అల్లు అర్జున్, మహేష్, విజయ్ దేవరకొండ ఇప్పటికే భారీ మల్టీప్లెక్సులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మన స్టార్లు మల్టీప్లెక్స్ వ్యాపారంలో దూసుకెళుతున్నారు. ఇప్పుడు బెంగళూరులో మహేష్ ఏఎంబి సినిమాస్ ని ప్రారంభిస్తుండగా, హైదరాబాద్ కోకాపేట్ ఏరియాలో అల్లు అర్జున్ తన తదుపరి మల్టీప్లెక్స్ ని ప్రారంభించేందుకు సిద్దమయ్యారని కథనాలొచ్చాయి. ఇండస్ట్రీన ఏల్తున్న ఇలాంటి పెద్ద స్టార్లతో కలిసి ఏషియన్ సినిమాస్ ఐమ్యాక్స్ స్క్రీన్లను ఏర్పాటు చేస్తుందేమో వేచి చూడాలి.
