IMAX స్క్రీన్లు : చైనాలో 800 - భారత్‌లో 45 .. ఎందుకింత వెనకబాటుతనం?
వరల్డ్ సినిమా హిస్టరీలో ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ అనుభూతిని అందించే సాంకేతికత ఐమ్యాక్స్ (IMAX).
By: Sivaji Kontham | 17 Aug 2026 6:00 AM ISTఐమ్యాక్స్ సినిమాలతో ప్రపంచంపై దండయాత్ర చేస్తున్నాడు క్రిస్టోఫర్ నోలాన్. అతడు అధునాతన ఐమ్యాక్స్ కెమెరాలతో సినిమాలను తెరకెక్కిస్తూ, ఐమ్యాక్స్ లలో తన సినిమాలను భారీగా రిలీజ్ చేస్తూ అసాధారణ వసూళ్లను కొల్లగొడుతున్నాడు. దీంతో ఇటీవలి కాలంలో ఐమ్యాక్స్ సినిమాలపై అందరి దృష్టి మళ్లింది. అయితే చైనా, అమెరాకా లాంటి చోట్ల ఉన్నన్ని ఐమ్యాక్స్ థియేటర్లు అభివృద్ధి పథంలో ఉన్న ఇండియాలో లేకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. ఈ దశలో గణాంకాలు విశ్లేషిస్తే.. భారతదేశంలో మొత్తం ఎన్ని ఐమ్యాక్స్ స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయి? కొత్తగా ఎన్ని నిర్మాణంలో ఉన్నాయి? అమెరికాలో మొత్తం ఎన్ని ఐమ్యాక్స్ స్క్రీన్లు ఉన్నాయి? ప్రపంచ దేశాలలో ఏ దేశంలో అత్యధికంగా ఐమ్యాక్స్ స్క్రీన్లు ఉన్నాయి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇక్కడ ఉంది..
వరల్డ్ సినిమా హిస్టరీలో ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ అనుభూతిని అందించే సాంకేతికత ఐమ్యాక్స్ (IMAX). విజువల్స్, సౌండ్ క్వాలిటీతో పాటు అత్యంత పెద్ద స్క్రీన్ పై సినిమాలను చూసే అవకాశం కల్పించడంతో ఈ రకమైన థియేటర్లకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఏర్పడింది. అసాధారణ విజువల్ ఎక్స్ పీరియెన్స్.. వినూత్న టెక్నాలజీతో సినిమా ప్రపంచంలో ప్రత్యేక ముద్ర వేసిన ఐమ్యాక్స్ స్క్రీన్ల విస్తరణ... డిమాండ్ గురించి విశ్లేషిస్తే...
చైనాలో ఐమ్యాక్స్ విస్తరణ
ప్రపంచవ్యాప్తంగా ఐమ్యాక్స్ స్క్రీన్ల విషయంలో చైనా ముందంజలో ఉంది. చైనాలో ప్రస్తుతం దాదాపు 800కు పైగా ఐమ్యాక్స్ స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయి. అక్కడి ప్రేక్షకులకు థియేట్రికల్ అనుభవంపై ఉన్న మక్కువను గుర్తించి IMAX సంస్థ చైనా మార్కెట్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. స్థానిక చైనీస్ సినిమాలతో పాటు హాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రాలను ప్రదర్శించడానికి ఈ ఐమ్యాక్స్ స్క్రీన్లు అత్యంత కీలకంగా మారాయి.
భారతదేశంలో ఐమ్యాక్స్ పరిస్థితులు
ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 31 కంటే ఎక్కువ ఐమ్యాక్స్ స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయి. భారతీయ ప్రేక్షకులు కూడా ఐమ్యాక్స్ అనుభవాన్ని ఇష్టపడుతుండటంతో పివిఆర్-ఐనాక్స్ వంటి ప్రముఖ మల్టీప్లెక్స్ నెట్‌వర్క్‌లు తమ స్క్రీన్ల సంఖ్యను వేగంగా పెంచుతున్నాయి. ఇందులో భాగంగా మరో 14 కంటే ఎక్కువ కొత్త ఐమ్యాక్స్ స్క్రీన్లు ప్రస్తుతం నిర్మాణంలో లేదా ఒప్పందాల దశలో ఉన్నాయి. మునుముందు కొద్ది సంవత్సరాల్లో భారతదేశంలో ఐమ్యాక్స్ స్క్రీన్ల సంఖ్య 45 దాటే దిశగా అడుగులు వేస్తోంది. ఇక హైదరాబాద్ లోను ఐమ్యాక్స్ తిరిగి ప్రారంభం కావడంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ఐమ్యాక్స్ స్క్రీన్లు రావడానికి ఆస్కారం ఉంది.
అమెరికాలో ఐమ్యాక్స్ నెట్‌వర్క్
హాలీవుడ్‌కు పుట్టినిల్లైన అమెరికా (యునైటెడ్ స్టేట్స్)లో ప్రస్తుతం 350కి పైగా కమర్షియల్ ఐమ్యాక్స్ స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయి. విశేషమేమిటంటే.. అమెరికాలోని పలు నగరాల్లో దాదాపు 30 వరకు క్లాసిక్ 70 ఎంఎం IMAX థియేటర్లు ఉన్నాయి. ఇక్కడ నిరంతరం కొత్త స్క్రీన్ల నిర్మాణం.. డిజిటల్ నుండి అప్‌గ్రేడ్ చేసిన లేజర్ ఐమ్యాక్స్ టెక్నాలజీ వ్యవస్థలను ఏర్పాటు చేసే పనులు విస్తృతంగా జరుగుతున్నాయి.
అత్యధిక స్క్రీన్లు ఉన్న దేశం
ప్రపంచంలో అత్యధికంగా ఐమ్యాక్స్ స్క్రీన్లు ఉన్న దేశంగా చైనా అగ్రస్థానంలో నిలిచింది. చైనా తర్వాత అమెరికా రెండో స్థానంలో ఉంది. అయితే వసూళ్ల విషయంలోనూ ఈ రెండు దేశాలే హాలీవుడ్ ఫ్రాంఛైజీ చిత్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తున్నాయి. భారీ విజువల్ వండర్స్‌గా రూపుదిద్దుకునే మార్వెల్, అవతార్, క్రిస్టోఫర్ నోలన్ చిత్రాలకు చైనా, అమెరికా ఐమ్యాక్స్ థియేటర్ల నుంచి రికార్డు స్థాయి వసూళ్లు లభిస్తున్నాయి. భవిష్యత్ లో ఐమ్యాక్స్ థియేటర్ల పరంగా భారతదేశం మూడో స్థానంలోకి చేరేందుకు అవకాశం ఉందా? అంటే దీనికి ఇంకా సమాధాం రావాల్సి ఉంది.
భారతీయ సినిమాలకు ఐమ్యాక్స్ కీలకం:
నితీష్ తివారీ - రామాయణం, రాజమౌళి వారణాసి ఐమ్యాక్స్ కెమెరాలతో చిత్రీకరించడం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ రెండు భారతీయ సినిమాలు భారీగా ఐమ్యాక్స్ స్క్రీన్లలో విడుదల కాను్నాయి. వారణాసి, రామాయణం చిత్రాలకు చైనా మార్కెట్ అస్సెట్ అవుతుంది. అక్కడ ప్రజలకు ఈ రెండు సినిమాలు కనెక్ట్ అయితే భారతదేశానికి ధీటుగా వసూళ్లను సాధించే అవకాశం ఉంటుంది. అలాగే అమెరికా బాక్సాఫీస్ వద్ద ఐమ్యాక్స్ థియేటర్ల కారణంగా భారీ వసూళ్లకు ఆస్కారం ఉంది.
