ఐదు భాషల రిలీజ్ కోసం వాయిదా.. తొలి షోకే డబ్బింగ్ వెర్షన్లు రాలేదు!
రెండు వారాలు అదనంగా తీసుకున్నది కూడా ఈ ఐదు భాషల రిలీజ్ కోసమే. కానీ థియేటర్లలో మొదటి షో పడే సమయానికే అదే డబ్బింగ్ వెర్షన్ల దగ్గర సమస్య వచ్చింది.
By: M Prashanth | 3 Sept 2026 1:28 PM ISTదుల్కర్ సల్మాన్ ‘ఐయామ్ గేమ్’ ఆగస్టు 20నే రావాల్సింది. కానీ సినిమాను మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడలో ఒకేసారి పెద్దగా రిలీజ్ చేయాలనే ప్లాన్‌తో సెప్టెంబర్ 3కి మార్చారు. రెండు వారాలు అదనంగా తీసుకున్నది కూడా ఈ ఐదు భాషల రిలీజ్ కోసమే. కానీ థియేటర్లలో మొదటి షో పడే సమయానికే అదే డబ్బింగ్ వెర్షన్ల దగ్గర సమస్య వచ్చింది.
హైదరాబాద్‌లో ఉదయం పలు షోలు క్యాన్సిల్ అయ్యాయి. కారణం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ వెర్షన్ల డీసీపీలు సమయానికి థియేటర్లకు చేరకపోవడం. డీసీపీ అంటే థియేటర్‌లో సినిమా ప్లే చేయడానికి పంపే డిజిటల్ కాపీ. అది లేకపోతే బుకింగ్స్ ఉన్నా షో వేయలేరు. ఇందులో తెలుగు షోలపై ఎక్కువ ప్రభావం పడినట్టు రిపోర్ట్స్ వచ్చాయి.
ఇక్కడే ‘ఐయామ్ గేమ్’ రిలీజ్ ప్లాన్ కాస్త తేడా కొట్టింది. దుల్కర్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి గుర్తింపు ఉంది. ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ తర్వాత అతని సినిమాకు ఇక్కడ కూడా ఓపెనింగ్ మార్కెట్ ఏర్పడింది. అలాంటి చోట మొదటి రోజు ఉదయం షోలు మిస్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు. ఫస్ట్ డే టాక్ స్పీడ్ గా బయటకు వచ్చే రోజుల్లో కొన్ని గంటల ఆలస్యం కూడా రిలీజ్‌కు ఇబ్బందే.
పైగా సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే రూ.2.76 కోట్లు వచ్చినట్టు రిపోర్ట్స్ వచ్చాయి. అంటే రిలీజ్ ముందు బజ్ లేక సమస్య రాలేదు. ఐదు భాషల్లో ఒకేసారి వెళ్లాలని స్కేల్ పెంచినప్పుడు, చివరి దశలో డెలివరీ కూడా అదే స్థాయిలో ప్లాన్ కావాలి. ఇక్కడ సినిమా సిద్ధంగా ఉన్నా, కొన్ని భాషల కాపీలు థియేటర్లకు చేరే దగ్గరే తేడా వచ్చింది.
మలయాళంలో మాత్రం సినిమా ఉదయం నుంచే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్కడ మొదటి షోల తర్వాత సోషల్ మీడియాలో రెస్పాన్స్ కూడా మొదలైంది. కానీ ఇతర భాషల్లో అదే సమయంలో సినిమా అందుబాటులో లేకపోవడంతో పాన్ ఇండియా రిలీజ్ అనుకున్న ప్లాన్ మొదటి కొన్ని గంటల్లో ఒకేలా సాగలేదు. ఒక భాషలో రివ్యూలు బయటకు వస్తుండగా, మరో మార్కెట్‌లో ప్రేక్షకులు షో కోసం ఎదురుచూడాల్సి వచ్చింది.
‘ఆర్డీఎక్స్’ ఫేమ్ నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దుల్కర్‌తో పాటు కయాదు లోహర్, ఆంటోనీ వర్గీస్, మిస్కిన్ నటించారు. సెప్టెంబర్ 3 డేట్ కోసం ఓనం సీజన్‌ను కూడా వదులుకున్న టీమ్‌కు, తొలి రోజే వచ్చిన ఈ సమస్య ఊహించనిదే. తర్వాతి షోల నుంచి డబ్బింగ్ వెర్షన్లు సవ్యంగా నడిస్తే నష్టం కొంత తగ్గొచ్చు.
