ఆగిపోయిన ఇళయరాజా బయోపిక్
‘మహానటి’ సినిమా అద్భుత విజయం సాధించాక సినీ ప్రముఖుల బయోపిక్స్ తీయడం మీద ఫిలిం మేకర్స్ ఫోకస్ పెరిగింది.
By: Garuda Media | 1 Sept 2025 1:00 AM IST‘మహానటి’ సినిమా అద్భుత విజయం సాధించాక సినీ ప్రముఖుల బయోపిక్స్ తీయడం మీద ఫిలిం మేకర్స్ ఫోకస్ పెరిగింది. ఈ క్రమంలో వివిధ భాషల్లో పలు చిత్రాలు అనౌన్స్ అయ్యాయి. కానీ తెలుగులో సంచలనం రేపుతుంది అనుకున్న ఎన్టీఆర్ బయోపిక్ నిరాశపరచడంతో ఈ సినిమాల ఊపు తగ్గింది. అయినా సరే.. తమిళ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా జీవిత కథను తెరపైకి తీసుకురావాలని ఓ నిర్మాణ సంస్థ ముందుకు వచ్చింది. ధనుష్‌ను ఇళయరాజా పాత్ర కోసం ఎంచుకున్నారు. సాని కాయితం, కెప్టెన్ మిల్లర్ చిత్రాలను రూపొందించిన అరుణ్ మాథేశ్వరన్ దర్శకుడిగా ఖరారయ్యాడు. గత ఏడాది ఘనంగా ఈ సినిమాను ప్రకటించారు. కానీ దీని తర్వాత ధనుష్ ఓకే చేసిన సినిమాలు ముందుకు కదులుతున్నాయి కానీ.. ఇళయరాజా బయోపిక్ మాత్రం పట్టాలెక్కడం లేదు. దీంతో ఈ సినిమాపై సందేహాలు నెలకొన్నాయి.
తాజా సమాచారం ప్రకారం ఇళయరాజా బయోపిక్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారట. ఈ సినిమా తీయడానికి అనుకున్న బడ్జెట్‌ను లెక్కగట్టాక.. ఆ మేరకు బిజినెస్ చేసి సినిమాను లాభాల బాట పట్టించడం సాధ్యం కాదని నిర్ణయించుకున్నారట. ఇళయరాాజా సంగీతం అంటే పడిచచ్చేవాళ్లు కోట్లల్లో ఉన్నప్పటికీ.. ఆయన జీవిత కథను తెరపై చూడాలన్న ఆసక్తి అందరిలో ఉందా అన్నది సందేహమే అని.. దీన్ని కమర్షియల్‌గా వర్కవుట్ చేయడం కష్టమని మేకర్స్ భావిస్తున్నారట. అందుకే ధనుష్, అరుణ్ మాథేశ్వరన్ వేరే ప్రాజెక్టుల్లో బిజీ అయిపోయారు. ఇళయరాజా బయోపిక్‌ను పక్కన పెట్టినట్లు అధికారికంగా ప్రకటన రాకపోవచ్చు కానీ.. ఈ సినిమా ముందుకు కదిలే అవకాశాలు మాత్రం లేవని తెలుస్తోంది. ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో ‘ఇడ్లి కడై’ అనే సినిమా చేస్తున్న ధనుష్.. దీని తర్వాత ‘ఆదిపురుష్’ దర్శకుడు ఓం రౌత్‌తో అబ్దుల్ కలాం బయోపిక్ చేయబోతుండడం విశేషం.
