మ్యూజిక్ లెజెండ్ తో తనయుడు తొలిసారి!
తండ్రి వారసత్వంతో ఎంట్రీ ఇచ్చిన యువన్ శంకర్ రాజా సైతం తనదైన బాణీలతో శ్రోతల్ని అలరిస్తున్నారు.
By: Srikanth Kontham | 19 Nov 2025 12:00 AM ISTమ్యూజిక్ లెజెండ్ ఇళయరాజా భారతీయ చిత్ర పరిశ్రమకు అందించిన సేవల గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రముఖంగా దక్షిణాదిన అన్ని భాషల్లో సంగీతమందించిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. వందల పాటలతో శ్రోతల్ని అలరించిన సంగీత శిఖరమాయన. దేశ, విదేశాల్లోనూ ఎన్నో సంగీత కచేరీలతో శ్రోతల్ని అలరించారు. ఇప్పటికీ ఆయన సేవలు కొనసాగుతున్నాయి. అయితే మునుపటంత బిజీగా లేరు. కానీ ఆయన వారసత్వాన్ని చిత్ర పరిశ్రమలో తనయుడు యువన్ శంకర్ రాజా మాత్రం దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు.
తండ్రి వారసత్వంతో ఎంట్రీ ఇచ్చిన యువన్ శంకర్ రాజా సైతం తనదైన బాణీలతో శ్రోతల్ని అలరిస్తున్నారు. తమిళ, తెలుగులో చాలా చిత్రాలకు సంగీతం అందించారు. అయితే తండ్రీ-తనయులు కలిసి పాడింది మాత్రం ఇంత వరకూ చోటు చేసుకోలేదు. ఈ నేపథ్యంలో తొలిసారి సంగీత ప్రపంచంలో అలాంటి అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఇద్దరు కలిసి ఓ సినిమా కోసం కలిసి పాట పాడారు. `కొంబుసివీ` చిత్రం ఆ కలయికకు కారణమైంది. `అమ్మా ఎన్ తంగక్కని నీతానే ఎల్లామ్` అనే పాటను ఇద్దరు కలిసి ఆలపించారు. సాహితివేత్త విజయ్ ఈ పాటను రచించారు.
సినిమాకు ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, ఎంతో భావోద్వేగంతో పాట సాగుతుందని తెలిపారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా యువన్ శంకర్ రాజా వ్యవరించడం మరో విశేషం. ఆయన ట్యూన్ కట్టడం...తండ్రితో కలిసి తనయుడు పాడటంతో సంగీత ప్రియులు ఓ గొప్ప అద్భుతంగా భావిస్తున్నారు. గతంలో ఇళయరాజా పని చేసిన కొన్ని సినిమాలకు యువన్ గాత్రం అందించారు. కానీ యువన్ సంగీతంలో మాత్రం ఇళయరాజా పాటలు పాడలేదు. ఇదే తొలిసారి కావడంతో? ఆ పాట ఎలా ఉంటుందని శ్రోతల్లో ఆసక్తి నెలకొంది.
పొన్రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. ఇందులో సీనియర్ నటుడు శరత్ కుమార్, కెప్టెన్ విజయకాంత్ కుమారుడు షణ్ముగ పాండియన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆ పాత్రల మధ్య వచ్చే ఓ ఎమోషనల్ సాంగ్ గా తెలుస్తోంది. కామెడీ, యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. థేని, ఉసిలంపట్టి ప్రాంతాల నేపథ్యంలో సాగే కథ ఇది. సినిమాకు బడ్జెట్ కూడా భారీగానే ఖర్చు చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా తర్నిక నటిస్తోంది. అన్ని పనులు పూర్తిచేసి డిసెంబర్‌లో సినిమా రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం యువన్ శంకర్ రాజా తమిళ్ తో పాటు తెలుగు సినిమాలకు సంగీతం అందిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా యానన ఎప్పుడూ బిజీనే.
