అమ్మవారికి వజ్రాల ఆభరణాలను సమర్పించిన మ్యూజిక్ డైరెక్టర్
గత కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో తన మ్యూజిక్ తో పెద్దగా మార్క్ వేయలేకపోయినప్పటికీ ఆయన నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 11 Sept 2025 10:55 PM ISTప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గత కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో తన మ్యూజిక్ తో పెద్దగా మార్క్ వేయలేకపోయినప్పటికీ ఆయన నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తన కూతురు విషయంలోనో లేదా మ్యూజిక్ కాన్సర్ట్‌ల విషయంలోనో లేదంటే తన సాంగ్స్ ను ఇతరులు వాడుకున్నారని నోటీసులు పంపడం ద్వారానో నిత్యం వార్తల్లోనే ఉంటున్నారు.
మూకాంబిక అమ్మ వారికి వజ్రాల ఆభరణాలు
కాగా తాజాగా ఆయన ఉడుపిలోని కొల్లూరు మూకాంబిక అమ్మ వారికి రూ.4 కోట్ల వజ్రాల హారం, బంగారు ఖడ్గాన్ని సమర్పించారు. కొల్లూరు మూకాంబిక దేవికి, వీరభద్ర స్వామికి భారీ విలువ చేసే వజ్రాలతో చేసిన బంగారు ముఖరూపం, ఖడ్గాన్ని ఇళయరాజా సమర్పించారు. ముందుగా ఇళయరాజా అమ్మవారి దర్శనం చేసుకుని ఆ తర్వాత సుబ్రహ్మణ్య అడిగ సమక్షంలో ఆభరణాలను గుడికి సమర్పించారు.
జగన్నాత ఆశీస్సులతోనే..
ఈ కార్యక్రమంలో ఇళయరాజా పక్కన అతని కొడుకు కార్తీక్ రాజ్ తో పాటూ మనవడు యతీష్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. పూజలు పూర్తయ్యాక ఆలయ ప్రధాన అర్చకులు ఇళయరాజాకు తీర్థప్రసాదాలతో పాటూ అమ్మవారి ఫోటోను కూడా అందచేశారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ, జగన్మాత మూకాంబిక ఆశీస్సులతోనే ప్రతీదీ సాధ్యమైందని, ఇందులో తాను చేసిందేమీ లేదని అన్నారు. కాగా ఇళయరాజా ఈ గుడికి రెగ్యులర్ గా వస్తూనే ఉంటారు. 2006 లో కూడా ఆయన అమ్మవారికి ఓ కిరీటాన్ని ఇచ్చారని ఆలయ మేనేజింగ్ కమిటీ తెలిపింది.
శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ అర్థమండపంలోకి రానీయకుండా..
కాగా గతేడాది ఇళయరాజాను శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయంలోని గర్భగుడి ముందున్న అర్థ మండపంలోకి వెళ్లకుండా ఆలయ అధికారులు ఆపిన విషయం తెలిసిందే. దైవ ప్రార్థన కోసం ఇళయరాజా అర్థ మండపంలోకి వెళ్లబోతుంటే ఆలయ అధికారులు, భక్తులు అతన్ని ఆపివేశారు. ఈ క్రమంలో ఆయన ఇప్పుడు కొల్లూరులోని మూకాంబిక అమ్మవారికి భారీ విలువైన కానుకలివ్వడం హాట్ టాపిక్ గా మారింది.
