Begin typing your search above and press return to search.

ఆస్ట్రేలియా పార్ల‌మెంటులో స‌త్కారం.. ఇళ‌య‌రాజా ఎమోష‌న‌ల్!

భారతీయ సినీ సంగీత రంగంలో చెరగని ముద్ర వేసిన లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఆస్ట్రేలియాలోని విక్టోరియా ప్రభుత్వం నుండి అరుదైన గౌరవం లభించింది.

By:  Sivaji Kontham   |   23 Sept 2026 7:44 PM IST
ఆస్ట్రేలియా పార్ల‌మెంటులో స‌త్కారం.. ఇళ‌య‌రాజా ఎమోష‌న‌ల్!
X

భారతీయ సినీ సంగీత రంగంలో చెరగని ముద్ర వేసిన లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఆస్ట్రేలియాలోని విక్టోరియా ప్రభుత్వం నుండి అరుదైన గౌరవం లభించింది. సినిమా రంగంలో ఆయన విజయవంతంగా 50 ఏళ్ల చారిత్రాత్మక సంగీత ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా విక్టోరియా పార్లమెంట్‌లో ఒక ప్రత్యేక వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో ఆయన గౌరవార్థం ఒక ప్రత్యేక పోస్టేజ్ స్టాంప్‌ను కూడా విడుదల చేశారు.

మెల్‌బోర్న్‌లోని పలైస్ థియేటర్‌లో అత్యంత వైభవంగా జరిగిన `ఇళయరాజా 50` కన్సర్ట్ విజయవంతమైన తర్వాత ఈ అధికారిక సత్కార కార్యక్రమం జరిగింది. తమిళనాడులోని ఒక మారుమూల చిన్న గ్రామంలో జన్మించిన తనకు, ఒక విదేశీ గడ్డపై ఉన్న ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ఈ స్థాయిలో ఘనమైన సన్మానం లభించడం తన హృదయాన్ని తాకిందని ఇళయరాజా భావోద్వేగంతో తెలిపారు. ఈ సందర్భంగా విక్టోరియా ప్రభుత్వానికి, ఫైనాన్స్ మినిస్టర్ ఎన్వర్ ఎర్డోగన్, పార్లమెంట్ సభ్యులకు ఆయన తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఆస్ట్రేలియాలో ఇళయరాజా వేడుకలు ఇక్కడితో ఆగిపోలేదు. సెప్టెంబర్ 26న సిడ్నీలో జరగనున్న‌ భారీ సంగీత కచేరీలో కూడా ఆయన పాల్గొననున్నారు. ఐదు దశాబ్దాల తన కెరీర్‌లో భాగంగా ఆయన వరుస కాన్సర్ట్‌లు.. వేడుకలతో ఈ మైలురాయిని ఘనంగా జరుపుకుంటున్నారు. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో వేలాది పాటలను అందించిన ఆయన సంగీతం దశాబ్దాలు గడిచినా ప్రేక్షకుల మదిలో అజ‌రామ‌రంగా నిలిచి ఉంది.

దక్షిణాది సినీ పరిశ్రమకు రాజా అందించిన అసమాన సేవలకు గుర్తింపుగా ఆస్ట్రేలియా పార్లమెంట్ అందించిన ఈ ఘనత.. ఆయన 50 ఏళ్ల స్వర్ణోత్సవ వేడుకల్లో మరో అద్భుతమైన మైలురాయిగా నిలిచింది. విక్టోరియా పార్లమెంట్ సత్కారం తర్వాత సిడ్నీలో జరగనున్న కన్సర్ట్‌తో ఇళయరాజా ఈ ఆస్ట్రేలియా పర్యటనను మరింత ముందుకు తీసుకెళ్లనున్నారు.