Begin typing your search above and press return to search.

ఇళయరాజాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

ఒక నిర్మాణ సంస్థ ఇళయరాజాతో లైసెన్స్ ఒప్పందం చేసుకుని `ఎన్ ఇనియ పొన్ నిలవే` పాటను తమ సినిమాలో రీక్రియేట్ చేయడానికి ప్రయత్నించడంతో మొదలైంది.

By:  Srikanth Kontham   |   2 Oct 2026 3:04 PM IST
ఇళయరాజాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
X

దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తమిళ చిత్రం `మూడు ప‌ని` లోని ఎవర్ గ్రీన్ పాట `ఎన్ ఇనియ పొన్ నిలవే` పాట కాపీరైట్స్ వివాదంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ పాట సాహిత్యం -సౌండ్ రికార్డింగ్‌పై ఇళయరాజాకు ఎలాంటి కాపీరైట్ హక్కులు లేవని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.

జస్టిస్ జే.బి. పార్డీవాలా - జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌‌లతో కూడిన ధర్మాసనం ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఇళయరాజా దాఖలు చేసిన అప్పీల్‌ను తోసిపుచ్చిన ధర్మాసనం, మ్యూజిక్ లేబుల్ `సరిగమ`కు అనుకూలంగా వచ్చిన తీర్పులో ఎలాంటి జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో ఈ పాట సౌండ్ రికార్డింగ్, లిరిక్స్ విషయంలో ఇళయరాజాకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఓసారి వివాదంలోకి వెళ్తే..

ఒక నిర్మాణ సంస్థ ఇళయరాజాతో లైసెన్స్ ఒప్పందం చేసుకుని `ఎన్ ఇనియ పొన్ నిలవే` పాటను తమ సినిమాలో రీక్రియేట్ చేయడానికి ప్రయత్నించడంతో మొదలైంది. అయితే దీనిపై `సరిగమ` తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. `మూడు ప‌ని` సినిమా అసలు నిర్మాత నుంచి తాము చట్టబద్ధంగా కాపీరైట్ హక్కులను పొందామని, కాబట్టి ఇళయరాజాకు ఈ పాటను వేరొకరికి రీక్రియేట్ చేసేందుకు లైసెన్స్ ఇచ్చే హక్కు లేదని సరిగమ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

కేసు విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు, భారత కాపీరైట్ చట్టం ప్రకారం సంగీత దర్శకుడిగా ఇళయరాజాకు కేవలం ఆ పాట ట్యూన్ లేదా మ్యూజికల్ కంపోజిషన్‌పై మాత్రమే హక్కులు ఉంటాయని వెల్లడించింది. అంతే తప్ప ఆ పాట సాహిత్యంపై కానీ ..రికార్డ్ చేసిన సౌండ్ రికార్డింగ్‌పై కానీ ఎలాంటి ప్రత్యేక కాపీరైట్ ఉండదని స్పష్టం చేసింది. హైకోర్టు సింగిల్ బెంచ్ - డివిజన్ బెంచ్ రెండూ కూడా సరిగమ వాదనతో ఏకీభవించాయి.

మే 26న రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసిన ఉత్తర్వులపై ఇళయరాజా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఇళయరాజా తరఫున సీనియర్ అడ్వకేట్లు సుందరం, స్వాతి సుకుమార్ వాదనలు వినిపించగా సరిగమ తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పు సరైనదేనని అభిప్రాయపడి ఇళయరాజా స్పెషల్ లీవ్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.

ఈ తీర్పు సినీ -సంగీత పరిశ్రమలో కాపీరైట్ హక్కులపై పెద్ద చర్చకే దారితీసింది. ఒక సినిమాలో పాట కంపోజ్ చేసిన తర్వాత దాని ట్యూన్‌పై మాత్రమే కంపోజర్‌కు హక్కులు ఉంటాయని, సౌండ్ రికార్డింగ్ , సాహిత్యం హక్కులు నిర్మాత , దాన్ని కొనుగోలు చేసిన మ్యూజిక్ కంపెనీకే చెందుతాయని ఈ తీర్పు ద్వారా మరోసారి స్పష్టమైంది. ఇళయరాజా ఇప్పటికే పలువురు నిర్మాతలు కంపెనీలతో కాపీరైట్ పోరాటాలు చేస్తున్న నేపథ్యంలో ఈ తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది.