కాపీ రైట్స్‌లో పంతం నెగ్గిన ఇళయరాజా
కాపీ రైట్ చట్టాలు ఇప్పుడు చాలా బలంగా ఉన్నాయి. సృజనాత్మకత విషయంలో హక్కుల్ని కాపాడుకునేందుకు చాలా ఎక్కువ అవకాశం ఉంది.
By: Sivaji Kontham | 9 Sept 2025 9:48 AM ISTకాపీ రైట్ చట్టాలు ఇప్పుడు చాలా బలంగా ఉన్నాయి. సృజనాత్మకత విషయంలో హక్కుల్ని కాపాడుకునేందుకు చాలా ఎక్కువ అవకాశం ఉంది. ముఖ్యంగా మ్యూజిక్ ఇండస్ట్రీలో క్రియేటివిటీని కొట్టేయడం అంత సులువేమీ కాదని, దాని పర్యవసానాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని సంగీత దిగ్గజం మ్యాస్ట్రో ఇళయరాజా నిరూపిస్తున్నారు.
ఆయన ఇప్పుడు అజిత్ నటించిన `గుడ్ బ్యాడ్ అగ్లీ`పై కేసులో తన పంతం నెగ్గించుకున్నారు. తాను సంగీతం అందించిన మూడు సినిమాల్లోని పాటలను కాపీ చేసి ట్యూన్లు ఇచ్చారని ఇళయరాజా మాద్రాసు హైకోర్టులో పిటిషన్ వేసి నెగ్గారు. నట్టుపుర పట్టు చిత్రంలోని `ఓథ రుబాయుమ్ థారెన్`, `సకలకళా వల్లవన్` చిత్రంలోని `ఇలమై ఇధో ఇదో`, విక్రమ్ చిత్రంలోని `ఎన్ జోడి మాంజా కురువి` నుంచి తన పాటలను `గుడ్ బ్యాడ్ అగ్లీ` కోసం కాపీ చేసారని ఆరోపించారు ఇళయరాజా.
తాజా తీర్పులో హైకోర్టు న్యాయమూర్తి, చట్టబద్ధంగా సినిమా ప్రసారాన్ని తాత్కాలికంగా ఆపేయాలని తీర్పునిచ్చారు. ఇప్పటికే గుడ్ బ్యాడ్ అగ్లీ స్ట్రీమింగ్ లో ఉన్నందున దానిని తక్షణం ఆపేయాల్సి రావడంతో నిర్మాతలు షాక్ లో ఉన్నారని సమాచారం. తన సృజనాత్మకత నుంచి వచ్చిన మూడు పాటలతో పాటు ఈ సినిమాను ప్రదర్శించడం, అమ్మడం, పంపిణీ చేయడం, ప్రచురించడం, ప్రసారం చేయకుండా నిరోధించాలని కోరుతూ పిటిషన్ వేయగా, దీనిపై జడ్జి సెంథిల్ కుమార్ తీర్పును రాజాకు అనుకూలంగా వెలువరించారు. ఇళయరాజా పాటలను చట్టవిరుద్ధంగా అనైతికంగా వేరొక సినిమాలో వినియోగించడం ఉల్లంఘన కిందికి వస్తుందని జడ్జి వ్యాఖ్యానించారు.
ఏదైనా సినిమాలో తన పాటలను ఉపయోగించడం, మార్చడం, వక్రీకరించడం లేదా మార్చడం కోసం ఇళయరాజా అనుమతించలేదని లాయర్ కోర్టులో వాదించారు. 2025 కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 19(9) మరియు సెక్షన్ 19(10) ఆధారంగా, పాటల స్వరకర్తగా, ఏ మాధ్యమంలోనైనా వాటి ఉపయోగం కోసం రాయల్టీలను పొందే హక్కు తనకు ఉందని ఇళయరాజా పేర్కొన్నారు. తన బాణీలను వేరొకరు ఉపయోగించుకుంటే తనకు రాయల్టీ పొందే హక్కు ఉందని ఆయన వాదించారు.
