ఇక్కీస్.. ధర్మేంద్రకు దక్కిన గొప్ప నివాళి
బాలీవుడ్ లెజండరీ నటుడు, ఫ్యాన్స్ ముద్దుగా హీమ్యాన్ అని పిలుచుకునే ధర్మేంద్ర రీసెంట్ గానే కన్ను మూసిన విషయం తెలిసిందే.
By: Sravani Lakshmi Srungarapu | 3 Jan 2026 4:00 AM ISTబాలీవుడ్ లెజండరీ నటుడు, ఫ్యాన్స్ ముద్దుగా హీమ్యాన్ అని పిలుచుకునే ధర్మేంద్ర రీసెంట్ గానే కన్ను మూసిన విషయం తెలిసిందే. అతను నటించిన ఆఖరి సినిమాగా ఇక్కీస్ గురువారం రిలీజైంది. మంచి బజ్ తో రిలీజైన ఈ సినిమా హిందీ ఆడియన్స్ కు కాస్త ఊరటనిచ్చింది. దానికి కారణం బాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా దురంధర్ తర్వాత మరో మంచి సినిమా వచ్చింది లేదు.
కథ నచ్చడంతో ఆరోగ్యం బాలేకపోయినా..
ఈ నేపథ్యంలోనే ఇక్కీస్ పై అందరికీ స్పెషల్ ఫోకస్ ఉంది. వాస్తవానికి ఇక్కీస్ క్రిస్మస్‌కే రిలీజవాల్సింది కానీ కుదరలేదు. అయితే ఈ మూవీ చేస్తున్నప్పుడు కూడా ధర్మేంద్రకు ఆరోగ్యం సహకరించలేదట. కానీ కథ బాగా నచ్చడంతో ఈ సినిమా ఎలాగైనా చేయాల్సిందేనని ఇక్కీస్ మూవీ చేశారయన. అయితే ఈ సినిమాను డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది.
ఇక్కీస్ లో ఎమోషన్స్ కు పెద్ద పీట
1970 కాలి నాటి యుద్ధ వాతవరణం, యుద్ధ ట్యాంకులు, శత్రువులు ఎన్ని ఎదురొచ్చినా మన సోల్జర్స్ వాటిని ఎదుర్కొన్న విధానాన్ని డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశారని సినిమా చూసిన అందరూ చెప్పుకుంటున్నారు. అయితే వార్ డ్రామాగా తెరకెక్కిన ఇక్కీస్ లో యాక్షన్, ఎలివేషన్ సీన్స్ మాత్రం తక్కువగా ఉన్నాయని, సినిమాలో ఎమోషన్ కు పెద్ద పీట వేశారని అంటున్నారు.
ఒక్క రోజే 90 వేలకు పైగా టికెట్స్ అమ్మకం
మూవీ చూసిన వాళ్లందరూ ఇక్కీస్ ధర్మేంద్ర కు చాలా మంచి నివాళి అని, ఆయన చివరి సినిమాగా ఇలాంటి సబ్జెక్టును ఎంచుకోవడం కరెక్ట్ అని అందరూ అంటున్నారు. సినిమాలో ధర్మేంద్రతో పాటూ మిగిలిన ఆర్టిస్టుల యాక్టింగ్ కూడా చాలా బావుందని ప్రశంసలొస్తున్నాయి. కాగా ఇక్కీస్ మూవీకి జనవరి 1నాడు బుక్ మై షో లో 90వేలకు పైగా టికెట్స్ అమ్ముడవడం చూస్తుంటే మూవీ లాంగ్ రన్ లో మంచి కలెక్షన్లే అందుకునేట్టుంది.
