Begin typing your search above and press return to search.

ఇఫీ-2026 వేడుకల్లో టాలీవుడ్ సౌండే లేదు!

గోవాలో నవంబర్ 20 నుంచి 28 వరకు జరగనున్న 57వ ఇఫీ వేడుకల్లో 86 దేశాల 150కి పైగా అంతర్జాతీయ చిత్రాలతో పాటు 18 భారతీయ భాషల సినిమాలు ప్రదర్శించనున్నారు. అయితే కీలక విభాగాల్లో తెలుగు సినిమాకు చోటు దక్కకపోవడం చర్చనీయాంశమైంది. టాలీవుడ్ మేకర్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌ను పట్టించుకోవడం లేదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

By:  Sivaji Kontham   |   14 Nov 2026 11:15 PM IST
ఇఫీ-2026 వేడుకల్లో టాలీవుడ్ సౌండే లేదు!
X

ప్ర‌తిష్ఠాత్మ‌క ఇఫీ-2026 వేడుక‌ల్లో అన్ని బాష‌ల సినిమాలు క‌నిపిస్తున్నాయి కానీ.. ఒక్క‌టంటే ఒక్క‌టీ తెలుగు సినిమా పేరు వినిపించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఏడాది మొత్తంలో తీసిన తెలుగు సినిమాల నుంచి చ‌ల‌న‌చిత్రోత్స‌వాల‌కు ప‌నికి వ‌చ్చే ఒక్క సినిమా కూడా లేదా? లేక ఫిలింఫెస్టివ‌ల్స్ ని మ‌న‌వాళ్లు లైట్ తీస్కున్నారా! ఏమో కానీ.. అస‌లు టాలీవుడ్ సౌండ్ ఇఫీ ఉత్స‌వాల‌లో క‌నిపించ‌డం లేదు.

గోవా వేదికగా నవంబర్ 20 నుండి 28 వరకు అంగరంగ వైభవంగా జరగనున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ- 2026) పూర్తి షెడ్యూల్‌ను నిర్వాహకులు తాజాగా ప్రకటించారు. `స్టోరీస్ వితౌట్ బోర్డర్స్` అనే థీమ్‌తో సాగనున్న ఈ ప్రతిష్ఠాత్మక వేడుకలో 86 దేశాలకు చెందిన 150కి పైగా అంతర్జాతీయ చిత్రాలతో పాటు 18 భారతీయ భాషలకు చెందిన సినిమాలు సందడి చేయనున్నాయి. అయితే ఇంతటి భారీ అంతర్జాతీయ వేదికపై దేశంలోని దాదాపు అన్ని భాషల చిత్రాలు మెరుస్తుండగా.. పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్న ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా పేరు కూడా ప్రముఖంగా వినిపించకపోవడం సినీ వర్గాలను తీవ్రంగా ఆశ్చర్యపరుస్తోంది. ఏడాది పొడవునా వందల సంఖ్యలో సినిమాలు నిర్మించే టాలీవుడ్ నుంచి.. కనీసం చలనచిత్రోత్సవాలకు పనికివచ్చే ఒక్క చిత్రం కూడా రాలేదా అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మెదులుతోంది.

ఈ వేడుకలో అత్యంత కీలకమైన `ఇండియన్ పనోరమా` ఫీచర్ ఫిల్మ్ విభాగాన్ని రణ్‌వీర్ సింగ్ నటించిన బాలీవుడ్ భారీ చిత్రం `ధురంధర్` ప్రారంభించనుండగా.. మొత్తం 76 చిత్రాలు ప్రదర్శితమయ్యే ఈ విభాగంలో కాంతార: చాప్టర్ 1, హనుమాన్ అన్ష్, ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్, కృష్ణావతారం పార్ట్ 1 వంటి చిత్రాలు చోటు దక్కించుకున్నాయి. మరోవైపు నితీష్ తివారీ దర్శకత్వంలో తెర‌కెక్కిన `రామాయణ: పార్ట్ 1` చిత్రం `బ్రిక్స్` సినిమా విభాగాన్ని ప్రారంభించనుండగా.. `ది కేరళ స్టోరీ 2` ఇంటర్నేషనల్ కాంపిటీషన్ విభాగానికి సైతం ఎంపికైంది. ఇలా బాలీవుడ్, కన్నడ, మలయాళ చిత్రాలు కీలక విభాగాల్లో హవా చూపిస్తుంటే.. టాలీవుడ్ సౌండ్ మాత్రం ఇఫీ ఉత్సవాల్లో ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.

ఇక మొత్తం చలనచిత్రోత్సవానికి ప్రారంభ చిత్రంగా ఫాదర్‌ల్యాండ్, మిడ్-ఫెస్ట్ చిత్రంగా `ఐ మ్యాటర్`.. ముగింపు చిత్రంగా సింగపూర్ సినిమా `వి ఆర్ ఆల్ స్ట్రేంజర్స్` ఎంపికయ్యాయి. స్పెయిన్‌ను `కంట్రీ ఆఫ్ హానర్`గా, రష్యాను `పార్ట్‌నర్ కంట్రీ`గా ప్రకటించిన నిర్వాహకులు.. ఈసారి యానిమేషన్ .. `ఫిల్మ్స్ అబౌట్ ఫిల్మ్స్` అనే రెండు కొత్త విభాగాలను ప్రవేశపెట్టారు. వీటితో పాటు దివంగత నటుడు నానా పటేకర్‌కు నివాళిగా `నటసామ్రాట్` చిత్రాన్ని ఓపెన్ ఎయిర్ స్క్రీనింగ్ ద్వారా ప్రదర్శించనున్నారు. ఇంతటి వైవిధ్యమైన వేదికపైకి మన సినిమాలు ఎందుకు వెళ్లలేకపోయాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

నిజానికి బాక్సాఫీస్ వసూళ్లు.. కమర్షియల్ హంగుల మీదే పూర్తిగా దృష్టి పెడుతున్న తెలుగు దర్శకనిర్మాతలు, ఇలాంటి ప్రతిష్ఠాత్మక ఫిల్మ్ ఫెస్టివల్స్‌ను పూర్తిగా `లైట్` తీసుకుంటున్నారా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. డ‌బ్బు వ‌సూలు చేయ‌డ‌మేనా? అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గ కంటెంట్ బేస్డ్ చిత్రాలను రూపొందించడంలో మనం వెనుకబడిపోతున్నామా అనేది ఆలోచించుకోవాల్సిన స‌న్నివేశం ఉంది.

ప్రపంచ సినిమా దృష్టిని ఆకర్షించే ఇఫీ లాంటి వేదికలపై మన తెలుగు సినిమా ఉనికిని చాటుకోవాలంటే.. ఇకనైనా టాలీవుడ్ మేకర్స్ కమర్షియల్ లెక్కలతో పాటు కళాత్మక విలువలున్న సినిమాలను తెర‌కెక్కించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.