ఇడుపు కాయితం.. కొత్త వివాదం మొదలైంది
సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికి ముందు ‘ఇడుపు కాయితం’ డిజిటల్ డీల్ పూర్తయిందంటే.. అప్పటి ఆ వివాదమే కారణమంటే అతిశయోక్తి కాదు.
By: Garuda Media | 24 Oct 2026 3:45 PM ISTఇడుపు కాయితం అనే సినిమాను ప్రకటించినపుడు సోషల్ మీడియా ఎంత చర్చ నడిచిందో తెలిసిందే. ఈ టైటిల్ అర్థం కాలేదంటూ కొందరు ఆంధ్రా వాళ్లు వ్యాఖ్యానించగా.. అది తెలంగాణ వారికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలో రెండు ప్రాంతాల వాళ్లు కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాలో గొడవ పడ్డారు. ఆ టైంలో ‘ఇడుపు కాయితం’ టీంకు తెలంగాణ వారి నుంచి గట్టి మద్దతే లభించింది. ప్రమోషన్ పరంగా అది సినిమాకు బాగానే కలిసొచ్చింది.
సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికి ముందు ‘ఇడుపు కాయితం’ డిజిటల్ డీల్ పూర్తయిందంటే.. అప్పటి ఆ వివాదమే కారణమంటే అతిశయోక్తి కాదు. ఐతే అప్పుడు ‘ఇడుపు కాయితం’కు మద్దతుగా నిలిచిన వాళ్లే ఇప్పుడు ఈ సినిమాపై వ్యతిరేకత చూపిస్తుండడం గమనార్హం. అందుక్కారణం.. నిన్న రిలీజ్ చేసిన గడప పాటలో చూపించిన ఒక షాట్, అలాగే ఈ చిత్ర నిర్మాత బన్నీ వాసు చేసిన కామెంట్.
తెలంగాణలో అతిథులకు పెళ్లి రోజు మందు, విందు ఏర్పాట్లు ఎలా ఉంటాయో ఈ పాటలో చూపించారు. ఒక క్యాన్లో మద్యం పోసి దానికి కుళాయి ఏర్పాటు చేసి.. దాన్నుంచి గ్లాసుల్లో పట్టి అతిథులకు ఇస్తారని, అలాగే పెద్ద ఎత్తున నాన్ వెజ్ స్టఫ్ ఏర్పాట్లు ఉంటాయని ఇందులో చూపించారు. నిన్నటి ప్రెస్ మీట్లో దీని గురించి అడిగితే టీం సమర్థించుకుంది. తెలంగాణలో ఈ కల్చర్ ఉంటుందన్నట్లుగా ప్రియదర్శి మాట్లాడాడు. ఐతే మొత్తం తెలంగాణ అంతటా ఇలాగే ఉంటుందని, ఈ ప్రాంతంలో అందరూ మందు పిచ్చోళ్ళు అన్నట్లు జనరలైజ్ చేసి చూపిస్తున్నారంటూ సోషల్ మీడియాలో తెలంగాణ వాళ్లు తప్పుబడుతున్నారు. ఈ సంప్రదాయం కొన్ని చోట్ల మాత్రమే ఉంటుందని.. అది కూడా పెళ్లి రోజు ఇలా చేయ్యరని.. తెలంగాణ అంటే ఇంతే అన్నట్లు నార్మలైజ్ చేస్తున్నారని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు తెలంగాణలో పచ్చదనాన్ని చూసి తాను షాకైనట్లు నిర్మాత బన్నీ వాసు చెప్పడం మీదా మిశ్రమ స్పందన వస్తోంది. పచ్చదనం అంటే కోస్తా ప్రాంతమే అనే భ్రమల్లో అక్కడి వాళ్లు ఉంటారని, ఈ ఆలోచనతోనే తెలంగాణ వాళ్లను తక్కువగా చూస్తారని.. ఇక్కడ పరిస్థితులు ఎప్పుడో మారాయని, ఈ ప్రాంతంలో కూడా గోదావరి ప్రవహిస్తుందనే వాస్తవాన్ని గుర్తించరని తెలంగాణ వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా నిన్న ‘ఇడుపు కాయితం’ ఈవెంట్ మొదలైన దగ్గర్నుంచి ఈ సినిమా మీద సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. కానీ ఈ నెగెటివిటీ కూడా పబ్లిసిటీ పరంగా టీంకు కలిసొస్తుందా.. లేక ఏమైనా డ్యామేజ్ జరుగుతుందా అన్నది చూడాలి.
