Begin typing your search above and press return to search.

'ఇడుపు కాయితం' టీజర్.. సీతా కళ్యాణంతో మొదలై విడాకుల దాకా..

ప్రియదర్శి, నాగ దుర్గ జంటగా నటిస్తున్న ‘ఇడుపు కాయితం’ టీజర్ విడుదలైంది. తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమకథలో పెళ్లి సందడి మధ్య విడాకుల కాగితం తెరపైకి రావడం ఆసక్తి రేపుతోంది. వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వంలో బన్నీ వాస్, సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

By:  M Prashanth   |   12 Nov 2026 12:27 PM IST
ఇడుపు కాయితం టీజర్.. సీతా కళ్యాణంతో మొదలై విడాకుల దాకా..
X

కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి, మరోసారి పక్కా తెలంగాణ పల్లెటూరి నేపథ్యంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నాగ దుర్గ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇడుపు కాయితం. ఇప్పటికే విడుదలైన శ్రీలత, బారాత్ బీట్ పాటలకు డీసెంట్ రెస్పాన్స్ రాగా, ఇప్పుడు ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.





చాగంటి కోటేశ్వరరావు గారి రామాయణ ప్రవచనంతో టీజర్ చాలా విభిన్నంగా మొదలైంది. రామాయణం ఆగిపోతుందనుకున్న చోట ఒక స్త్రీ ప్రవేశించడం వల్లే కథ ముందుకు సాగుతుందనే మాటలతో హీరో ప్రేమకథను లింక్ చేసిన తీరు బాగుంది. ఇందులో శ్రీనివాస్ పాత్రలో ప్రియదర్శి, శ్రీలత పాత్రలో నాగ దుర్గ కనిపించారు. రంగు తక్కువైనా తనకు ఆ అమ్మాయే నచ్చిందని, ఆమెనే పెళ్లి చేసుకుంటానని హీరో పట్టుబట్టడం, పెద్దలతో రాయబారం నడపడం లాంటి సీన్లు సహజంగా కుదిరాయి.

ప్రియదర్శి, నాగ దుర్గ మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు, పెళ్లి చూపుల హడావుడి కొత్త జంటల అనుభూతులను గుర్తుచేసేలా ఉన్నాయి. ముఖ్యంగా ఏడుస్తున్న హీరోయిన్ ను ఉద్దేశించి మేకప్ పోతుందని, ముక్కు కారుతుందని హీరో వేసే సరదా కౌంటర్లు నవ్విస్తాయి. అయితే అంతా సాఫీగా సాగిపోతుందనుకున్న సమయంలో అనుకోకుండా విడాకుల కాగితం తెరపైకి రావడంతో కథ మలుపు తిరుగుతుంది. పెళ్లి సందడి కాస్తా ఒక్కసారిగా ఇడుపు కాయితం చుట్టూ తిరగడం అసలైన ట్విస్ట్ అని క్లారిటీ ఇచ్చారు.

ఇరు కుటుంబాల మధ్య సాంప్రదాయాల విషయంలో వచ్చే వాదనలు కథలో అసలైన పాయింట్స్ ను హైలెట్ చేశారు. మా దాంట్లో ఆ పద్ధతి లేదని ఒకరు, మా దగ్గర ఉంది కాబట్టే అడిగామని మరొకరు వాదించుకునే తీరులో ఎమోషన్ తో పాటు కామెడీ కూడా కనిపించింది. రచ్చ రవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి, తీన్మార్ సావిత్రి శివజ్యోతి, జోర్దార్ సుజాత, చంద్రవ్వ, మౌనిక రెడ్డి, మైమ్ మధు తమ లోకల్ టైమింగ్ తో సినిమాకు బలంగా నిలిచారు.

సురేష్ బొబ్బిలి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాల్లోని సహజత్వాన్ని మరింత ఎలివేట్ చేసింది. యువ దర్శకుడు వంశీ రెడ్డి దొండపాటి ఎక్కడా హడావుడి లేకుండా చుట్టూ జరిగే కుటుంబ కథలా దీన్ని మలిచినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాస్, సుకుమార్ నిర్మాణ విలువలు కథకు తగినట్లుగా ఉన్నాయి.

ప్రేమ, పెళ్లి, కుటుంబ బంధాల్లో వచ్చే చిన్నచిన్న అపార్థాల నేపథ్యంలో సాగే ఒక క్లీన్ ఎంటర్‌టైనర్‌గా ఇడుపు కాయితం కనిపిస్తోంది. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఆలోచింపజేసే అంశాలు కూడా ఉన్నట్లు టీజర్ ద్వారా అర్థమవుతుంది. డీసెంట్ బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. మరి ఈ పల్లెటూరి ప్రేమకథ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.