Begin typing your search above and press return to search.

ఇడుపు కాయితం.. ఈసారి పందిట్లో పల్లెటూరి పెళ్లి పాట

ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న ‘ఇడుపు కాయితం’ నుంచి ‘గోగులు గోగులు’ లిరికల్ సాంగ్ విడుదలైంది. తెలంగాణ పల్లెటూరి పెళ్లి సంప్రదాయాలు, ఆహ్లాదకరమైన జానపద బాణీతో పాట ఆకట్టుకుంటోంది. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 11న విడుదల చేయనున్నారు.

By:  M Prashanth   |   21 Nov 2026 3:23 PM IST
ఇడుపు కాయితం.. ఈసారి పందిట్లో పల్లెటూరి పెళ్లి పాట
X

రియాలిటీకి దగ్గరగా ఉండే కథలతో ప్రేక్షకులను మెప్పించే ప్రియదర్శి, ఈసారి ఒక పక్కా తెలంగాణ పల్లెటూరి పెళ్లి కథతో రాబోతున్నారు. నాగదుర్గ హీరోయిన్ గా వంశీ రెడ్డి దొండపాటి రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఇడుపు కాయితం'. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై బన్నీ వాస్, తబిత సుకుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా 'గోగులు గోగులు' లిరికల్ సాంగ్ రిలీజైంది.

పాట మొదలైనప్పటి నుంచి చివరి వరకు అచ్చమైన గ్రామీణ పెళ్లి వాతావరణం కళ్లముందు కదలాడుతుంది. నలుగు వేడుకలు, జీలకర్ర బెల్లం, తాళి కట్టడం, మెట్టెలు తొడగడం లాంటి సంప్రదాయ ఘట్టాలను చాలా సహజంగా చిత్రీకరించారు. పెళ్లి పందిట్లో బంధువులందరూ కలిసి సందడి చేయడం, పెద్దల ఆశీర్వాదాలు, పెళ్లి పీటల మీదే కొత్త జంట సరదాగా సెల్ఫీ దిగడం లాంటి విజువల్స్ ఆకట్టుకుంటాయి.

నార్మల్ గా పెళ్లి పాటలంటే హుషారైన డప్పుల మోత వినిపిస్తుంది, కానీ ఈ పాటను చాలా ఆహ్లాదకరమైన జానపద బాణీలో హైలెట్ చేశారు. "గోగులు గోగులు గోపాలకృష్ణుడు సెలి.. రమ్మనరే నలుగుకు నా ముద్దు సీతమ్మనిప్పుడు" అంటూ కొంగరి కృష్ణ రాసిన సాహిత్యం పెళ్లి వేడుకలోని ఎమోషన్ ను చక్కగా ఎలివేట్ చేసింది. అభిక్య తనికెళ్ల, తరుణి, రచిత రాయప్రోలు, జయశ్రీ పల్లెం, స్నిగ్ధ శర్మ కలిసి పాడిన విధానం పాటకు కొత్త ఫ్రెష్ నెస్ తెచ్చింది.

సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి మరోసారి తన మార్క్ రూటెడ్ మ్యూజిక్ తో మెప్పించారు. ఎక్కడా అతి లేకుండా, సన్నివేశంలోని ఎమోషన్ కు తగ్గట్టుగా వినసొంపైన ట్యూన్ ఇచ్చారు. ఎం ఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ పల్లెటూరి వాతావరణాన్ని, పెళ్లి ఇంటి కళను కలర్ ఫుల్ గా చూపించింది. ప్రియదర్శి, నాగదుర్గ మధ్య కెమిస్ట్రీ కూడా చూడముచ్చటగా కుదిరింది. ఈ సినిమాలో నాగదుర్గలతో పాటు రచ్చ రవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి, మైమ్ మధు, తీన్మార్ సావిత్రి, జోర్దార్ సుజాత, చంద్రవ్వ, మౌనికా రెడ్డి లాంటి ఆర్టిస్టులంతా నటించారు. ఇక పాటలో కూడా వీళ్లందరూ కనిపించడంతో సినిమాలో ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ గట్టిగానే ఉండబోతోందనే ఫీల్ కలుగుతోంది.

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ పాటలకు మంచి రెస్పాన్స్ రాగా, ఇప్పుడు ఈ వెడ్డింగ్ మెలోడీ సినిమాపై మరింత పాజిటివ్ బజ్ పెంచింది. రొటీన్ మాస్ బీట్స్ కు భిన్నంగా మన నేటివిటీని గుర్తుచేసే వినసొంపైన పెళ్లి పాటగా 'గోగులు గోగులు' ఆకట్టుకుంటోంది. సుకుమార్, బన్నీ వాస్ కాంబినేషన్ లో వస్తున్న ఫ్యామిలీ డ్రామా కావడంతో ఆడియన్స్ లోనూ ఆసక్తి నెలకొంది. డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న 'ఇడుపు కాయితం' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.