Begin typing your search above and press return to search.

జేమ్స్ బాండ్ 007 పుకార్లపై న‌ల్ల జాతీయుడు క్లారిటీ!

హాలీవుడ్ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన `జేమ్స్ బాండ్ 007` సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులున్నారు.

By:  Srikanth Kontham   |   25 May 2026 5:00 PM IST
జేమ్స్ బాండ్ 007 పుకార్లపై న‌ల్ల జాతీయుడు క్లారిటీ!
X

హాలీవుడ్ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన `జేమ్స్ బాండ్ 007` సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులున్నారు. డేనియల్ క్రేగ్ `నో టైమ్ టు డై` చిత్రంతో ప్రతిష్టాత్మక పాత్రకు గుడ్ బై చెప్పినప్పటి నుండి తదుపరి బాండ్ ఎవరనే. దానిపై సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చలు జ‌రుగుతున్నాయి. ఈ రేసులో గత కొన్నేళ్లుగా బ్రిటీష్ నటుడు ఇడ్రిస్ ఎల్బా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఒక నల్లజాతీయుడు ఐకానిక్ పాత్రను పోషిస్తే బాగుంటుందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది అభిమానులు ఆశించారు.

అయితే ఈ క‌థ‌నాల‌పై తాజాగా ఇడ్రిస్ ఎల్బా ఓ అంతర్జాతీయ వేదికపై పూర్తి క్లారిటీనిచ్చారు. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన తన తాజా చిత్రం `మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్` ప్రీమియర్ వేడుకలో పాల్గొన్న ఆయన మీడియా మీట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తానేమీ జేమ్స్ బాండ్ రేసులో లేనని, ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పారు. ఈ వివరణతో గత పదేళ్లుగా నెట్టింట సాగుతున్న ఊహాగానాలకు ఒక్కసారిగా తెరపడినట్లయింది.`నా పేరు ఈ పాత్ర కోసం పరిశీలనలో లేదు. అందులో ఏమాత్రం నిజం లేదు. జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీ నిర్వాహకులు ఈ పాత్ర కోసం వయసులో చాలా చిన్నవాడైన నటుడిని వెతుకుతున్నారు.

కాబట్టి నేను ఈ రేసులో ఎప్పుడూ లేను. అసలు మొదటి నుండి నేను ఆ జాబితాలోనే లేనని స్పష్టం చేశారు. అలాగే కొత్తగా రాబోయే నటుడికి - ఆ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం 53 ఏళ్ల వయసున్న ఎల్బా, బాండ్ పాత్రకు తానేమీ సరిపోనని పరోక్షంగా అంగీకరించారు. గతంలో కూడా బాండ్ పుకార్లపై స్పందించి కొన్ని చేదు విష‌యాల‌ను పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది తనను బాండ్‌గా చూడాలనుకోవడం గొప్ప గౌరవంగా భావించినా? కొంతమంది దీనిని జాతి పరమైన వివాదంగా మార్చడం తనకు తీవ్ర అసంతృప్తిని కలిగించిందన్నారు.

ఆ చర్చలు అసహ్యకరంగా మారడం వల్లే తాను ఈ పాత్రకు సంబంధించిన వార్తలకు వీలైనంత దూరంగా ఉండటానికి ప్రయత్నించానని గతంలోనే పేర్కొన్నారు. ఏది ఏమైనా ఇడ్రిస్ ఎల్బా ఇచ్చిన క్లారిటీతో సుదీర్ఘమైన ఫ్యాన్-మేడ్ ఊహ‌ల‌కు ముగింపు ప‌లికిన‌ట్లు అయింది. ప్రస్తుతం ఇడ్రిస్ `మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్` వంటి ప్రతిష్టాత్మక చిత్రాలతో పాటు పలు యాక్షన్ సినిమాల‌తో బిజీగా గడుపుతున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రియులు సరికొత్త తరం జేమ్స్ బాండ్‌ను వెండితెరపై చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం అమెజాన్ ఎమ్‌జిఎమ్ స్టూడియోస్ సరికొత్త జేమ్స్ బాండ్ కోసం అన్వేషణను అధికారికంగా ప్రారంబ భించింది. హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు డెనిస్ విల్నెయువ్ దర్శకత్వంలో రాబోయే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం 25 లేదా 30 ఏళ్ల వయసున్న కొత్త నటుడిని ఎంపిక చేసే పనిలో కాస్టింగ్ డైరెక్టర్లు బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే ఆరోన్ టేలర్-జాన్సన్, జాకబ్ ఎలోర్డి వంటి యువ నటుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు హాలీవుడ్ సమాచారం.