స్టార్ హీరో ఫ్లాప్ సినిమా ఓటీటీలో నం.1
అయినా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా సక్సెస్ సాధిండంలో విఫలమైంది. థియేట్రికల్ గా ఫ్లాపైన ఈ చిత్రానికి ఓటీటీలో గొప్ప ఆదరణ దక్కడం కొసమెరుపు.
By: Sivaji Kontham | 14 Nov 2025 2:00 AM ISTధనుష్ నటించిన `ఇడ్లీ కడై` థియేట్రికల్ గా ఆశించిన విజయాన్ని సాధించకపోవడానికి కారణాలు తెలిసినదే. ఇటీవల ప్రజలు ఎక్కువగా భారీతనం నిండిన యాక్షన్ ఎంటర్ టైనర్లను ఆస్వాధిస్తున్నారు. ఒక సాధారణ ఇడ్లీ అమ్ముకునేవాడి కథలో ఏం ఉంటుందో వారికి అర్థం కాలేదు. అయితే ఇడ్లీ కడై థియేట్రికల్ గా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైనా కానీ, ఓటీటీలో అద్భుతంగా రాణిస్తోంది. ఇది నెట్ ఫ్లిక్స్ - ఇండియా గణాంకాల ప్రకారం.. ఇప్పటికే భారతదేశంలో అత్యధిక వీక్షణలతో నంబర్ వన్ స్థానంలో ఉంది.
దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ కారణంగా కేవలం 71 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. కుటుంబ విలువలు, భావోద్వేగాలతో ముడిపడిన అందమైన కథకు ధనుష్ స్వయంగా దర్శకత్వం వహించి నిర్మించాడు. అతడు ఇడ్లీ హోటల్ నడిపేవాడిగా ప్రధాన పాత్రలో నటించాడు. ఇలాంటి సినిమాల్లో ధనుష్ తప్ప ఇంకెవరూ నటించరన్న పేరు వచ్చింది.
అయినా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా సక్సెస్ సాధిండంలో విఫలమైంది. థియేట్రికల్ గా ఫ్లాపైన ఈ చిత్రానికి ఓటీటీలో గొప్ప ఆదరణ దక్కడం కొసమెరుపు. ఇడ్లీ కడై 29 అక్టోబర్ 2025 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. గడిచిన రెండు వారాలుగా టాప్10లో కొనసాగుతోంది. అంతేకాదు భారతదేశంలో నంబర్ వన్ స్థానంలో ఉంది. భాతదేశం సహా బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, మాల్దీవులలోను మొదటి స్థానాన్ని సంపాదించుకుంది. ఈ చిత్రం ఆస్ట్రేలియా, ఖతార్, సింగపూర్, మారిషస్, మలేషియా, నైజీరియా, యుఏఈ సహా 15 దేశాలలో టాప్ 10 జాబితాలో నిలిచింది.
ఒక సాధారణ ఇడ్లీ కొట్టు అబ్బాయి ఒక బడా ఎంటర్ ప్రెన్యూర్‌గా ఎదిగి విదేశాల్లో సెటిలయ్యాక, తిరిగి అదంతా అవసరం లేదనుకుని, తన మూలాల్ని వెతుక్కుంటూ వచ్చి మళ్లీ సాధారణ జీవితం గడపడానికి ప్రయత్నించే హీరో జీవితంలో ఎమోషన్స్ కి సంబంధించిన సినిమా ఇది. ఒక సాధారణ యువకుడు ఇడ్లీ కొట్టు నుండి ఎంటర్ ప్రెన్యూర్ గా ఎదగడం అంటే ఆషామాషీనా? పెద్ద కలలను సాకారం చేసుకుని, ఆ తర్వాత అన్నిటినీ వదిలేసి తిరిగి ఒక సాధారణ వ్యక్తిగా మారడం అంటే అంత సులువైన పనేనా? కానీ ఈ చిత్రంలో చేసి చూపించారు.
ఒక పెద్ద బిజినెస్ మేన్ గా ఎదిగిన తర్వాత తిరిగి విలేజ్ లో ఇడ్లీలు అమ్ముకోవాలనే ఆలోచన రావడం నిజానికి బిగ్ సర్ ప్రైజ్. చిన్నప్పటి కష్టాన్ని గుర్తు చేసే అదే పాత గుడిసెలో ఇడ్లీలు అమ్ముకోవడానికి వచ్చిన తర్వాత అతడి జీవితంలో ఎదురయ్యే సంఘర్షణల సమాహారం ఏమిటన్నది తెరపైనే చూడాలి. అతడు ప్రతి మలుపులోనూ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడో ఎగ్జయిట్ మెంట్ ని పెంచుతుంది. నిజం చెప్పాలంటే, ఇందులో ఇడ్లీ అమ్మే కుర్రాడి కథకు ప్రేక్షకులు కనెక్టయ్యారు. అందుకే ఈ సినిమాని ఓటీటీలో ప్రపంచ దేశాలలోని ప్రజలు ఆదరిస్తున్నారు.
