హైదరాబాద్- బెంగళూరు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మాయం
ఇక బెంగళూరు సినీ సంస్కృతిలో భాగమైన లాల్‌బాగ్ మెయిన్ రోడ్డులోని 50 ఏళ్లనాటి పాపులర్ `ఉర్వశి థియేటర్` కూడా త్వరలోనే నేలమట్టం కానుంది.
By: Sivaji Kontham | 25 Aug 2026 9:42 AM ISTదక్షిణాది చిత్ర పరిశ్రమలో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ప్రత్యేకించి హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాల్లో సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. అదొక పండుగ వాతావరణం. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, దిల్ సుఖ్ నగర్, అబిడ్స్, సికింద్రాబాద్ ప్రాంతాల్లోని సుదర్శన్, దేవి, రోజీ, సుధారమా, సంగీత్, ప్లాజా, విమల్ వంటి ఐకానిక్ సింగిల్ స్క్రీన్లు దశాబ్దాల పాటు కోట్లాది మంది సినీ ప్రేక్షకులకు చిరస్మరణీయ జ్ఞాపకాలను అందించాయి. అభిమాన హీరోల కటౌట్లకు పాలభిషేకాలు, పూలదండలు, ఈలలు, గోలలు, మొదటి రోజు మొదటి ఆటకు పొందే మ్యాసివ్ మాసీ అనుభూతి ఈ థియేటర్ల సొంతం. ఒకప్పుడు ఒక సినిమా విజయాన్ని 50 లేదా 100 రోజుల రికార్డులను ఈ థియేటర్ల ముందు ఉండే షీల్డ్‌లు- పోస్టర్లే ఆవిష్కరించేవి.
ఇక బెంగళూరు సినీ సంస్కృతిలో భాగమైన లాల్‌బాగ్ మెయిన్ రోడ్డులోని 50 ఏళ్లనాటి పాపులర్ `ఉర్వశి థియేటర్` కూడా త్వరలోనే నేలమట్టం కానుంది. 1970లో కన్నడ లెజెండ్ డాక్టర్ రాజ్‌కుమార్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ థియేటర్ రజినీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, ప్రభాస్, షారుఖ్ ఖాన్, మోహన్ లాల్ వంటి అగ్ర నటులకు చెందిన 5000కు పైగా బహుభాషా చిత్రాలను ప్రదర్శించింది. తొలినాళ్లలోనే 4కే డిజిటల్ ప్రొజెక్షన్- అధునాతన సౌండ్ టెక్నాలజీతో పాటు 2009లో `అవతార్` 3డి స్క్రీనింగ్‌తో ఈ థియేటర్ టెక్నాలజీలో ముందంజలో నిలిచింది. అయితే 2018తో లీజు గడువు ముగియడంతో పలు ఏళ్ల న్యాయపోరాటం తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం స్థలాన్ని అసలు యజమానులకు అప్పగించాల్సి వచ్చింది. దాంతో ఇక్కడ కన్నడ స్టార్ యాష్ `టాక్సిక్` ప్రత్యేక ప్రదర్శనను ఆశించిన ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.
మారుతున్న ప్రేక్షకుల అభిరుచులు.. ఓటీటీల రాక.. మల్టీప్లెక్స్‌ల విస్తరణ.. నిర్వహణ ఖర్చులు పెరగడంతో హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో సింగిల్ స్క్రీన్లు ఒక్కొక్కటిగా మూతపడటం లేదా కనుమరుగవ్వడం వేగవంతమైంది. సినీ ప్రియుల ఎమోషన్‌తో ముడిపడి ఉన్న అనేక చారిత్రక ల్యాండ్‌మార్క్ థియేటర్ల స్థానంలో నేడు అత్యాధునిక మల్టీప్లెక్స్‌లు.. కమర్షియల్ షాపింగ్ మాల్స్.. రియల్ ఎస్టేట్ కాంప్లెక్స్‌లు వెలుస్తున్నాయి. ఒకే చోట పలు సినిమాలు.. ఫుడ్ కోర్టులు.. గేమ్ జోన్‌లు అందుబాటులోకి రావడంతో థియేటర్ అనుభవం కాస్తా కమర్షియల్ మాల్ కల్చర్‌గా రూపాంతరం చెందింది.
మల్టీప్లెక్స్‌లు వచ్చాక డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్... విలాసవంతమైన పుష్-బ్యాక్ సీటింగ్ వంటి సాంకేతిక విప్లవం వచ్చి సగటు ప్రేక్షకుని వీక్షణ అనుభూతి పెరిగినా సింగిల్ స్క్రీన్‌లలో లభించే ఆ ప్యూర్ మాస్ ఎనర్జీ మాత్రం మిస్ అవుతోందనేది వాస్తవం. జేబుకు చిల్లు పడకుండా సామాన్యుడికి అందుబాటులో ఉండే టికెట్ ధరలు- పాప్‌కార్న్ ఖర్చులు నేడు మల్టీప్లెక్స్‌ల రాకతో విపరీతంగా పెరిగి భారంగా మారాయి. ఎంత సాంకేతికత ముందుకు వెళ్తున్నా.. పాతతరం ప్రేక్షకులకు సింగిల్ స్క్రీన్స్ ఇచ్చిన కిక్ మల్టీప్లెక్స్ స్క్రీన్లలో దొరకదనే భావన ఇప్పటికీ మిగిలే ఉంది.
ఈ మార్పు కేవలం బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలకే పరిమితం కాలేదు. ఇది చెన్నై, పూణే, కలకత్తా సహా భారతదేశమంతటా కొనసాగుతున్న ఒక కొత్త ట్రెండ్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని టూ-టైర్, త్రీ-టైర్ నగరాల్లో కూడా సింగిల్ స్క్రీన్ల స్థానంలో మల్టీప్లెక్సులు వేగంగా నిర్మితమవుతున్నాయి. పివిఆర్ ఐనాక్స్, ఏషియన్ సినిమాస్ వంటి దిగ్గజ ప్రదర్శన సంస్థలు చిన్న నగరాల్లోకి కూడా భారీగా విస్తరిస్తున్నాయి. నెమ్మదిగా సింగిల్ స్క్రీన్ల శకం ముగిసి.. కార్పొరేట్ మల్టీప్లెక్స్ కల్చర్ దేశమంతటా ఆధిపత్యం చెలాయిస్తోంది.
