Begin typing your search above and press return to search.

ఆకట్టుకుంటున్న ఐస్ రింక్ స్పోర్ట్స్ రొమాన్స్ ట్రెండ్!

ఇంకా ఫిగర్ స్కేటింగ్ నేపథ్యంలో కూడా ఈ రకమైన ప్రేమకథలు పుట్టుకొస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో ప్రసారమైన `ఫైండింగ్ హర్ ఎడ్జ్` సిరీస్ దీనికి చక్కని ఉదాహరణ.

By:  Srikanth Kontham   |   30 May 2026 6:00 AM IST
ఆకట్టుకుంటున్న ఐస్ రింక్ స్పోర్ట్స్ రొమాన్స్ ట్రెండ్!
X

వెండితెరపై క్రీడలు .. ప్రేమకథల కలయిక ఎప్పుడూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూనే ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో పాశ్చాత్య చలనచిత్ర రంగాన్ని ముఖ్యంగా హాలీవుడ్‌ను సరికొత్త శీతల ప్రేమ కథలు అమితంగా ఆకర్షిస్తున్నాయి. సాధారణ మైదానాలకు భిన్నంగా మంచుతో కూడిన ఐస్ రింక్ వేదికగా సాగే ప్రేమకథలు.. వెబ్ సిరీస్‌లు చిత్రాల రూపంలో సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఈ రకమైన క్రీడా నేపథ్య కథలు శారీరక శ్రమను మాత్రమే కాకుండా భావోద్వేగాల తీవ్రతను కూడా అద్భుతంగా ఆవిష్కరిస్తూ నేటి తరం ప్రేక్షకులను.. సోషల్ మీడియా ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఇటీవల డిజిటల్ ప్రపంచంలో మంచి ఆదరణ పొందుతున్న తాజా స్పోర్ట్స్ రొమాన్స్ డ్రామా `ఆఫ్ క్యాంపస్`. ప్రముఖ రచయిత్రి ఎల్ కెన్నెడీ రాసిన నవలా శ్రేణిలోని `ది డీల్` ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ ఐస్ హాకీ క్రీడాకారుల జీవితాల చుట్టూ తిరుగుతుంది. ఇందులో నాయకానాయికలు హన్నా వెల్స్, గారెట్ గ్రాహంల మధ్య మొదట నకిలీగా ప్రారంభమైన ప్రేమ బంధం, కాలక్రమేణా నిజమైన అనురాగంగా ఎలా మారిందనేది చూపించారు. ఈ నెలలోనే విడుదలైన సిరీస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అప్పుడే రెండో సీజన్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ అందుకోవడంతో ఎంత క్రేజ్ ఉందో చెప్పొచ్చు.

ఐస్ హాకీ నేపథ్యంలో వచ్చిన మరో సంచలనాత్మక కెనడియన్ సిరీస్ `హీటెడ్ రైవల్రీ` . గతేడాది నవంబర్‌లో విడుదలైన ఈ డ్రామా మంచు మైదానంలో ఇద్దరు బద్ధ శత్రువులైన ఇల్యా, షేన్ అనే క్రీడాకారుల మధ్య సాగే విలక్షణమైన ప్రేమ ప్రయాణాన్ని ఆవిష్కరించింది. సాధారణ ఆకర్షణతో ప్రారంభమై, సంవత్సరాల తరబడి లోతైన శృంగార బంధంగా మారే కథ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది. ఈ సిరీస్ సాధించిన ఘన విజయం .. నటీనటుల మధ్య ఉన్న అద్భుతమైన కెమిస్ట్రీ వారిని గోల్డెన్ గ్లోబ్స్, మెట్ గాలా వంటి ప్రతిష్టాత్మ‌క‌ అంతర్జాతీయ వేదికల వరకు తీసుకెళ్లింది.

ఇంకా ఫిగర్ స్కేటింగ్ నేపథ్యంలో కూడా ఈ రకమైన ప్రేమకథలు పుట్టుకొస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో ప్రసారమైన `ఫైండింగ్ హర్ ఎడ్జ్` సిరీస్ దీనికి చక్కని ఉదాహరణ. జెన్నిఫర్ ఇయాకోపెల్లి రాసిన నవల ఆధారంగా రూపొందిన ఈ కథలో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒక ఐస్ రింక్‌ను కాపాడుకునేందుకు ప్రయత్నించే 17 ఏళ్ల స్కేటర్ అడ్రియానా రుస్సో జీవితాన్ని చూపించారు. తన కొత్త పార్ట్‌నర్‌తో ఆమెకు ఏర్పడే ప్రేమ, పాత ప్రియుడి ఎంట్రీతో ఎలాంటి మలుపులు తిరిగిందనే ఆసక్తికరమైన అంశాలతో సిరీస్ యువతను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ ట్రెండ్‌ను మరింత ముందుకు తీసుకెళ్తూ ప్రముఖ నటి మిషెల్ మోనాఘన్ ప్రధాన పాత్రలో సరికొత్త హైస్కూల్ హాకీ డ్రామా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. విషాదకరమైన బస్సు ప్రమాదంలో తమ జట్టు కోచ్‌తో పాటు కొంతమంది క్రీడాకారులను కోల్పోయిన మిన్నెసోటాలోని ఒక చిన్న పట్టణం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఆ కోచ్ భార్య హార్పర్ సుల్లివన్ బాధ్యతలు స్వీకరించి.. కుంగిపోయిన ఆ జట్టును ఎలా ముందుకు నడిపించింది? ఆ క్రమంలో వారు ప్రేమ? జీవితం , నష్టాలను ఎలా? ఎదుర్కొన్నారనే భావోద్వేగభరిత అంశాలతో చిత్రం రూపొందుతోంది.

మంచు మైదానంపై నడిచే స్పోర్ట్స్ రొమాన్స్ కథలు కేవలం ఆటలకు మాత్రమే పరిమితం కాలేదు. మానవుల్లో సున్నితత్వాన్ని ..సవాళ్లను ప్రతిబింబిస్తున్నాయి. మంచు లాంటి చల్లని వాతావరణంలో పుట్టే వెచ్చని ప్రేమ భావనలు ప్రేక్షకులకు విజువల్గా ..ఎమోషనల్గా సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి. ప్రస్తుతం హాలీవుడ్ అనుసరిస్తున్న సరికొత్త ట్రెండ్ సాంప్రదాయ రొమాంటిక్ జానర్‌కు కొత్త ఊపిరి పొస్తుంది. మున్ముందు మరిన్ని వినూత్న కథలకు మార్గం సుగమం చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.