ఐ బొమ్మ రవి భార్య కారణంగానే దొరికాడు?
అయితే ఐబొమ్మ రవి దొరికిపోవడానికి కారణం - భార్యతో అతడి వివాదం అని తెలుస్తోంది. అతడు కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో తదుపరి వాయిదాను అటెండ్ చేయాల్సి ఉంది.
By: Sivaji Kontham | 17 Nov 2025 10:35 AM ISTకంపెనీ సీఈవో నుంచి పైరసీ వరకూ `ఐబొమ్మ` నిర్వాహకుడు రవి ఇమ్మడి రహస్యాలను ఛేధించే పనిలో పడ్డారు కూకట్ పల్లి సీసీఎస్ పోలీసులు. ప్రతియేటా టాలీవుడ్ కి వందల కోట్ల నష్టానికి అతడు నిర్వహిస్తున్న `ఐబొమ్మ` కారణమైందంటూ సినీనిర్మాతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీఎస్ బృందాలు రవి గురించిన వేటను కొనసాగించాయి. అతడు కరీబియన్ దేశం నుంచి పైరసీని ఆపరేట్ చేస్తున్నాడని కనుగొన్నట్టు కథనాలొచ్చాయి. రిలీజైన గంటల వ్యవధిలోనే అతడు హెచ్.డి క్వాలిటీతో సినిమాలను, ఓటీటీ సిరీస్ లను నెటిజనులకు టొరెంట్ లింకుల ద్వారా ఉచితంగా అందించాడు. ఇది పరిశ్రమకు పెద్ద డ్యామేజ్ చేస్తోంది. కేవలం ఐబొమ్మ బప్పం వంటి సైట్ల కారణంగా టాలీవుడ్ 3000 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని ఫిలింఛాంబర్ అంచనా వేసినట్టు కథనాలొచ్చాయి.
సవాల్ విసిరాక నిఘా:
పోలీసులకు ఫిర్యాదు అందిన తర్వాతా ఐబొమ్మ రవి పోలీసులకు సవాల్ విసిరారు. తనను పట్టుకోవడానికి కాపుకాసిన పోలీసులకు `దమ్ముంటే పట్టుకోండి చూద్దాం!` అంటూ సవాల్ చేసిన విషయాన్ని పోలీసులు బహిరంగంగా అంగీకరించారు. అయితే ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న సీసీఎస్ అతడిపై కట్టుదిట్టమైన నిఘాను ఉంచింది. చివరికి అతడు కూకట్ పల్లిలోని ఓ అపార్ట్ మెంట్ లో దొరికిపోవడం ఆశ్చర్యపరిచింది.
ముందస్తు సమాచారంతోనే..
అయితే ఐబొమ్మ రవి దొరికిపోవడానికి కారణం - భార్యతో అతడి వివాదం అని తెలుస్తోంది. అతడు కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో తదుపరి వాయిదాను అటెండ్ చేయాల్సి ఉంది. అందువల్ల అతడు ఫ్రాన్స్ నుంచి నేరుగా హైదరాబాద్ కూకట్ పల్లిలో అడుగుపెట్టినట్టు కథనాలొస్తున్నాయి. భార్య ముందస్తు సమాచారం మేరకు పోలీసులు కాపు కాసి అతడిని పట్టుకున్నారు. ప్రస్తుతం అతడి నుంచి ఇంటరాగేషన్ లో నిజాలు నిగ్గు తేలుస్తున్నారని సమాచారం. ఐబొమ్మ రవికి చెందిన 3కోట్ల నిధిని బ్యాంక్ ఖాతాల నుంచి సీజ్ చేసారని కథనాలొచ్చాయి. అలాగే అతడి వద్ద ఉన్న పైరసీ డంప్ ని పోలీసులు ఛేజిక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఐబొమ్మ సహా బప్పం అనే పైరసీ సైట్లను పోలీసులు బ్లాక్ చేసారు.
కష్టాల్లో కుటుంబం:
తాజాగా విడాకుల కేసు కారణంగానే తన కుమారుడు పట్టుబడ్డారని రవి తండ్రి కూడా ధృవీకరించినట్టు కథనాలొస్తున్నాయి.విశాఖపట్నంలో నివసించే రవి తండ్రి అప్పారావు కొడుకు నేర ప్రవృత్తిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన కొడుకు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు తనకు తెలియదని ఆయన వాపోయారు. పైగా పోలీసులకు సవాల్ విసరడం పెద్ద తప్పు అని అంగీకరించారు. తమ కుటుంబం చాలా కష్టాల్లో ఉందని, భార్య నుంచి అతడు విడిపోయాడని కూడా అప్పారావు వెల్లడించారు.
రేపు విచారణ:
హైదరాబాద్ పోలీసులు రేపు రవిని కోర్టులో హాజరుపరిచి తదుపరి దర్యాప్తు కోసం కస్టడీ కోరనున్నారు. కేవలం భార్యతో కోర్టు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు అతడు హైదరాబాద్ లో అడుగుపెట్టడంతో అతడు దొరికిపోయినట్టు పోలీసులు చెబుతున్నారు.
తప్పుడు దారి వైపు...
ఐబొమ్మ రవి మొదట టెకీ. అతడు సొంతంగా ఒక కంపెనీని నిర్వహించాడు. కానీ కొద్దికాలంలోనే అతడు పైరసీ వైపు మొగ్గు చూపి కంపెనీని మూసేసాడు. ఆ తర్వాత విదేశాల నుంచి తనకార్యకలాపాలను కొనసాగించాడని పోలీసులు కనుగొన్నారు. అతడికి సర్వర్లను హ్యాక్ చేసే నైపుణ్యం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారని కూడా కథనాలొస్తున్నాయి.
