ఐబొమ్మ రవి.. సినిమాలను పైరసీ ఎలా చేసేవాడంటే?
సినిమా ఇండస్ట్రీని గత కొన్నేళ్లుగా ముప్పుతిప్పలు పెడుతున్న ఐబొమ్మ వెబ్ సైట్ వ్యవస్థాపకుడు ఇమ్మడి రవి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
By: M Prashanth | 20 Nov 2025 7:24 PM ISTసినిమా ఇండస్ట్రీని గత కొన్నేళ్లుగా ముప్పుతిప్పలు పెడుతున్న ఐబొమ్మ వెబ్ సైట్ వ్యవస్థాపకుడు ఇమ్మడి రవి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అయితే, అసలు రవి సినిమా రిలీజ్ అయిన వెంటనే, కొన్నిసార్లు రిలీజ్ కు ముందే అంత క్వాలిటీ ప్రింట్స్ ను ఎలా సంపాదించేవాడు? అనేది అందరినీ వేధిస్తున్న ప్రశ్న. దీనిపై సైబర్ క్రైమ్ నిపుణులు, టెక్ విశ్లేషకులు సంచలన విషయాలు బయటపెడుతున్నారు.
సాధారణంగా సినిమా నిర్మాణం పూర్తయ్యాక, ఆ డిజిటల్ ఫైల్స్ ను ప్రొడక్షన్ హౌస్ సర్వర్లలో లేదా డిజిటల్ ల్యాబ్స్ లో స్టోర్ చేస్తారు. అయితే ఇక్కడే అసలు సమస్య ఉంది. రవి అండ్ టీమ్ ఈ సర్వర్ల సెక్యూరిటీలో ఉన్న చిన్న చిన్న లోపాలను లూప్ హోల్స్ ని గుర్తించి, వాటి ద్వారా సిస్టమ్ ని హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సినిమా ఫైల్స్ ను ఎన్‌క్రిప్ట్ చేసి దాచినప్పటికీ, ఆ సిస్టమ్స్ కు సంబంధించిన ఎంప్లాయ్ ఐడీలు, పాస్వర్డ్ లు సంపాదించి లాగిన్ అయ్యేవాళ్లని టెక్ నిపుణులు చెబుతున్నారు.
రవి కేవలం హ్యాకింగ్ మీద మాత్రమే ఆధారపడలేదు. అతను ఒక పెద్ద నెట్‌వర్క్ నే మెయింటైన్ చేశాడు. సినిమా థియేటర్లలో సీటింగ్ అరేంజ్మెంట్ ని బట్టి, కరెక్ట్ యాంగిల్ లో రికార్డ్ చేయడానికి కూడా మనుషులను పెట్టుకున్నాడు. కార్నర్స్ నుంచి తీస్తే యాంగిల్ సరిగ్గా రాదని, మధ్యలో సీటు బుక్ చేసుకుని మరీ రికార్డ్ చేసేవాళ్లట. ఇందుకోసం కొన్ని స్పై యాప్స్ వాడేవారు. ఫోన్ స్క్రీన్ ఆఫ్ లో ఉన్నా సరే, బ్యాక్ గ్రౌండ్ లో కెమెరా ఆన్ అయ్యి సినిమా రికార్డ్ అయ్యేలా ఈ యాప్స్ పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇక ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ నుంచి కంటెంట్ తీయడానికి రవి మరో పద్ధతి వాడాడు. మనం ఓటీటీలో సినిమా చూస్తున్నప్పుడు అది ఎన్‌క్రిప్టెడ్ స్ట్రీమ్ గా వస్తుంది. కానీ దాన్ని డీ క్రిప్ట్ చేసి, హై క్వాలిటీ ఫైల్ గా మార్చే సాఫ్ట్‌వేర్లను రవి టీమ్ ఉపయోగించిందని సమాచారం. ఐబొమ్మ సైట్ అంత పాపులర్ అవ్వడానికి కారణం.. అక్కడ ఉండే యూజర్ ఇంటర్ఫేస్. ఎలాంటి గందరగోళం లేకుండా, క్లియర్ గా, ఈజీగా సినిమా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉండటంతో జనం దానికి అలవాటు పడ్డారు.
అయితే రవి చేసింది కేవలం పైరసీ మాత్రమే కాదు, డేటా చోరీ కూడా. ఫ్రీగా సినిమా చూపిస్తున్నాం కదా అని జనం ఎగబడి చూస్తుంటే, ఆ వెబ్ సైట్ ద్వారా యూజర్ల పర్సనల్ డేటాను, బ్యాంకింగ్ వివరాలను సేకరించి సైబర్ నేరగాళ్లకు అమ్మేవాడని అనుమానాలు ఉన్నాయి. ఏదో ఒక లింక్ క్లిక్ చేయగానే మనకు తెలియకుండానే మన ఫోన్ లోని సమాచారం వారి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఐబొమ్మ రవి అరెస్ట్ తో ఒక పెద్ద నెట్‌వర్క్ గుట్టు రట్టయింది. కానీ టెక్నాలజీ ఉన్నంత కాలం ఇలాంటి లూప్ హోల్స్ ఉంటూనే ఉంటాయి. వాటిని అరికట్టాలంటే సినిమా ఇండస్ట్రీ తమ డిజిటల్ సెక్యూరిటీని మరింత పటిష్టం చేసుకోవాలని టెక్ నిపుణులు చెబుతున్నారు.
