ఐ బొమ్మ రవి అరెస్ట్..ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకున్నట్టేనా?
ఇండస్ట్రీ వర్గాలకు ఒక్క మాటలో చెప్పాలంటే ఐ బొమ్మ ఓ నైట్‌మేర్‌గా మారింది. దీని నుంచి ఇండస్ట్రీని రక్షించుకోవాలనే పట్టుదలతో ప్రత్యేక సైబల్ సెల్‌ని ఏర్పాటు చేశారు.
By: Tupaki Entertainment Desk | 19 Nov 2025 1:26 PM ISTగత కొన్నేళ్లు ఫిల్మ్ ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న భూతం పైరసీ. దీని భారీన పడని సినిమా లేదు, ఇబ్బందులు పడని దర్శకుడు, నిర్మాత లేడు. అంతలా ఇండస్ట్రీని ఓ అంతు చిక్కని భూతంలా గత కొన్నేళ్లుగా వెంటాడుతూ వస్తోంది. ఇందులో ప్రధాన పాత్ర పోషించి ఇండస్ట్రీని వేల కోట్లు నష్టపోయేలా చేసింది ఐ బొమ్మ. సినిమా రిలీజ్ అయిన గంటల్లోనే ప్రింట్ ని సైట్‌లో పెట్టేస్తూ దర్శకుడు, నిర్మాత, హీరోలకు ఎన్నో నిద్రలేని రాత్రుల్ని మిగిల్చింది.
ఇండస్ట్రీ వర్గాలకు ఒక్క మాటలో చెప్పాలంటే ఐ బొమ్మ ఓ నైట్‌మేర్ గా మారింది. దీని నుంచి ఇండస్ట్రీని రక్షించుకోవాలనే పట్టుదలతో ప్రత్యేక సైబర్ సెల్‌ని ఏర్పాటు చేశారు. దీంతో ఐ బోమ్మ, పైరసీ సైట్‌ల ఆటలు ఇక సాగవని అనుకున్నారు ఇండస్ట్రీ వర్గాలు. కానీ అది జరగలేదు సరికదా యధేచ్ఛగా సినిమాల పైరసీ ఐ బొమ్మ నిర్వాహకుడు చేయడం మొదలు పెట్టాడు. అంతేనా తన గురించి ఆరా తీసి, తనని పట్టుకునే ప్రయత్నం చేస్తే పెట్రేగిపోతానని, తనని అంత ఈజీగా పట్టుకోలేరని ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఏకంగా పోలీసులకే సవాల్ విసిరాడు ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి.
డబ్బు సంపాదనే లక్ష్యంగా సినిమాలని పైరసీ చేస్తూ నెలకు రూ.11 లక్షలు సంపాదిస్తూ తన వెబ్ సైట్ ద్వారా చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్‌లని ప్రమోట్ చేస్తూ ఎంతో మంది అమాయకుల చావులకు కారణమయ్యాడు. దేశ విదేశాల్లో ఆస్తులు కూడబెట్టి పౌరసత్వాన్ని కూడా వదులుకుని వేరే దేశంలో స్థిరపడి తన పైరసీ దందాని యధేచ్ఛగా సాగించాలని ప్లాన్‌లు వేశాడు. పోలీసులకే సవాల్ విసరడంతో ఐ బొమ్మ రవిని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు అతడి ఆట కట్టించి కటకటాల వెనక్కి నెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది.
అయితే ఐ బొమ్మ రవి అరెస్ట్‌లో ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకున్నట్టేనా?..ఇకపై పైరసీ జరిగే అవకాశం లేదా? అంటే నో ఆన్సర్. కారణం కొత్త సినిమాల పైరసీకి కేరాఫ్ అడ్రస్ ఐ బొమ్మ కానీ దానికి మించి కూడా కొత్త సినిమాల పైరసీ వివిద సైట్‌లలో జరుగుతోందని తెలుస్తోంది. మరి వాటి కట్టడి ఏంటీ? ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? ఐ బొమ్మ రవి అరెస్ట్‌తో ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకున్నాట్టేనా? లేక కథ ఇంకా ఉందా? .. ఐ బొమ్మ రవి ఆట కట్టించినట్టే మిగతా వారి ఆటని కట్టించి ఇండస్ట్రీని కాపాడతారా? అనే చర్చ ప్రస్తుతం నెట్టింట జరుగుతోంది.
