Begin typing your search above and press return to search.

ఐబొమ్మ రవి.. అసలు మాఫియా వేరే ఉంది!

ఐబొమ్మ రవి అరెస్ట్ వార్తతో ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది. కానీ పోలీసులు మాత్రం ఇది ఆరంభం మాత్రమే అంటున్నారు.

By:  M Prashanth   |   20 Nov 2025 1:23 PM IST
ఐబొమ్మ రవి.. అసలు మాఫియా వేరే ఉంది!
X

ఐబొమ్మ రవి అరెస్ట్ వార్తతో ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది. కానీ పోలీసులు మాత్రం ఇది ఆరంభం మాత్రమే అంటున్నారు. రవి కేవలం ఒక ముఖం మాత్రమే, దీని వెనుక ఉన్న నెట్‌వర్క్ చాలా పెద్దది. ఒక్క రవిని జైల్లో పెడితే పైరసీ ఆగిపోతుందనుకోవడం భ్రమే. ఎందుకంటే టెక్నాలజీని వాడుకుని, సినిమాలను దొంగిలించే 'డిజిటల్ దొంగలు' దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నారు. తమిళనాడు నుంచి బీహార్ వరకు విస్తరించిన ఈ నెట్‌వర్క్ లింకులు కదిలిస్తుంటే పోలీసులకే మైండ్ బ్లాక్ అవుతోంది.

పోలీసుల విచారణలో బయటపడిన పేర్లు, వారి పద్ధతులు చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. హైదరాబాద్ కు చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి మల్టీప్లెక్స్ లో పాప్ కార్న్ ప్యాకెట్ లో ఫోన్ దాచి సినిమా షూట్ చేసేవాడట. తమిళనాడుకు చెందిన రాజ్ అమలదాస్ ఏకంగా నిరుద్యోగులకు 'ట్రైనింగ్' ఇచ్చి మరీ పైరసీ చేయించేవాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా రికార్డ్ అయ్యే స్పై యాప్స్ వాడుతున్నారంటే, వీరి టెక్నిక్ ఎంత అడ్వాన్స్డ్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. బీహార్ కు చెందిన అశ్విన్ కుమార్ అనే కుర్రాడు తన గదిలో కూర్చుని సినిమా సర్వర్లనే హ్యాక్ చేసేవాడు. సినిమా రిలీజ్ కు ముందే హెచ్‌డీ ప్రింట్ బయటకు రావడానికి ఇలాంటి 'టెక్నికల్ హ్యాకర్లే' ప్రధాన కారణం. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, ప్రొడక్షన్ హౌస్ సర్వర్లలో ఉండే లోపలే వీరికి పెట్టుబడి. ఆ లోపాలను సరిదిద్దుకోనంత కాలం పైరసీని ఆపడం అసాధ్యమని పోలీసులే చేతులెత్తేస్తున్నారు.

అయితే, ఈ పైరసీ వెనుక కేవలం సినిమా పిచ్చి మాత్రమే లేదు, అంతకుమించిన 'బెట్టింగ్ మాఫియా' ఉంది. ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు కేవలం మధ్యవర్తులు మాత్రమే. అసలు సూత్రధారులు చైనా, మలేషియా, కంబోడియా వంటి దేశాల్లో ఉన్న గేమింగ్ మరియు బెట్టింగ్ యాప్ నిర్వాహకులు. ఉచితంగా సినిమాలు చూపిస్తాం అని ఆశచూపి, జనం డేటాను సేకరించి, దాన్ని సైబర్ నేరగాళ్లకు అమ్ముకుంటున్నారు.

మనం ఫ్రీగా సినిమా చూస్తున్నాం అనుకుంటున్నాం కానీ, మన పర్సనల్ డేటాను, ప్రైవసీని వాళ్లకు అమ్మేస్తున్నాం అనే విషయం చాలామందికి తెలియదు. టెలిగ్రామ్ లాంటి యాప్స్ ఈ చీకటి సామ్రాజ్యానికి కేరాఫ్ అడ్రస్ గా మారాయి. ఏటా దాదాపు 20 వేల కోట్ల రూపాయల నష్టం దేశానికి వాటిల్లుతోందంటే ఈ నెట్‌వర్క్ ఎంత బలంగా ఉందో ఊహించుకోవచ్చు.

రవి అరెస్ట్ అనేది ఒక హెచ్చరిక మాత్రమే. టెక్నాలజీ మారుతున్న కొద్దీ దొంగలు కూడా అప్డేట్ అవుతున్నారు. కేవలం ఒక్కరిని అరెస్ట్ చేస్తే సరిపోదు, డిజిటల్ సెక్యూరిటీని పెంచుకోవడం, విదేశీ బెట్టింగ్ యాప్స్ పై ఉక్కుపాదం మోపడం ద్వారానే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. లేదంటే ఐబొమ్మ పోతే మరో బొమ్మ పుట్టుకొస్తూనే ఉంటుంది.