ఐబొమ్మ రవిపై ఎదురు లేని బ్రహ్మాస్త్రం ఈ సెక్షన్
డిజిటల్ పైరసీకి పాల్పడడం, కాపీరైట్ ఉల్లంఘన, అనుమతి లేకుండా ఇతరుల వ్యక్తిగత డేటాను ఉపయోగించడం, అక్రమ ఆస్తి తస్కరణ వంటి ఆరోపణలతో ఐబొమ్మ రవిపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 19 Nov 2025 6:53 PM ISTపైరసీ కేసులో ఐబొమ్మ రవి ఇమ్మడి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. డిజిటల్ పైరసీకి పాల్పడడం, కాపీరైట్ ఉల్లంఘన, అనుమతి లేకుండా ఇతరుల వ్యక్తిగత డేటాను ఉపయోగించడం, అక్రమ ఆస్తి తస్కరణ వంటి ఆరోపణలతో ఐబొమ్మ రవిపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేరాలు రుజువైతే అతడికి గరిష్టంగా 3 ఏళ్ల నుంచి 7ఏళ్ల పాటు జైలు శిక్ష పడుతుందని న్యాయనిపుణులు చెబుతున్నారు.
అతడి నేరాల ఆధారంగా పోలీసులు ఐటి- చట్టంలోని 66C, 66E సెక్షన్లను నమోదు చేశారు. ఇతరుల గుర్తింపు- ఫోటోలు, వ్యక్తిగత సమాచారం అనుమతి లేకుండా ఉపయోగిస్తే ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఈ సెక్షన్లు రుజువైతే 3ఏళ్ల జైలు, 2లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది.
దీంతో పాటు భారతీయ న్యాయ సంహిత BNS 318(4) / 3(5) - అక్రమ ఆస్తి తస్కరణ గురించి తెలుసుకుని తీరాలి.
ఇతరుల డేటా లేదా ఆస్తిని అక్రమంగా స్వాధీనం చేసుకోవడం తీవ్రమైన నేరం. దీని ఆధారంగా అతడిపై 318(4) సెక్షన్ నమోదు చేశారు. ఇది రుజువైతే అతనికి అత్యధికంగా 7 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. డిజిటల్ పైరసీలో ఇది ఎదురు లేని బ్రహ్మాస్త్రం.
కాపీరైట్ చట్టం లోని సెక్షన్లు 63 & 65 గురించి తెలుసుకుంటే, సినిమాలు, వెబ్ సిరీస్ లు, సంగీతం వంటి వాటిని కాపీ చేస్తే ప్రయోగించే సెక్షన్లు ఇవి. వీటిని కూడా రవిపై పెట్టారు. ఇవి రుజువైతే 6నెలల నుంచి 3ఏళ్ల పాటు జైలు శిక్షతో పాటు జరిమానా అమల్లో ఉంటుంది. ఐబొమ్మ రవిపై ఐదారు రకాల సెక్షన్లను మోపారు కాబట్టి వీటిలో మూడు నాలుగు రుజువైనా అతడికి కనీసం గా 3 నుంచి ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
