Begin typing your search above and press return to search.

ఆ 3 కోట్లు ఐబొమ్మ ర‌వి వాడుకునే వెలుసుబాటు ఉందా?

కోర్టు విచారణ జరుగుతున్న సమయంలో లేదా ట్రయల్ పెండింగ్‌లో ఉన్నప్పుడు నిధుల వాడకం అనేది పూర్తిగా న్యాయమూర్తి విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది.

By:  Sivaji Kontham   |   23 Sept 2026 8:00 PM IST
ఆ 3 కోట్లు ఐబొమ్మ ర‌వి వాడుకునే వెలుసుబాటు ఉందా?
X

ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ `ఐబొమ్మ` నిర్వాహకుడు ఇమ్మడి రవికి సంబంధించిన వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. పైరసీ కేసులో భాగంగా పోలీసులు సీజ్ చేసిన తన బ్యాంకు ఖాతాల్లోని సుమారు రూ. 3 కోట్లను విడుదల చేయాలని కోరుతూ ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఖాతాల్లో నిలిచిపోయిన ఆ డబ్బును ఆయన వాడుకునే వెసులుబాటు ఉందా, చట్టపరంగా ఎలాంటి నిబంధనలు వర్తిస్తాయనే అంశంపై సర్వత్రా ఆస‌క్తిక‌ర‌ చర్చ జరుగుతోంది.

చట్టపరమైన నిబంధనల ప్రకారం.. నేర పరిశోధనలో భాగంగా పోలీసులు లేదా దర్యాప్తు సంస్థలు అనుమానాస్పద లావాదేవీలు ఉన్న బ్యాంకు ఖాతాలను సీజ్ చేయడం లేదా ఫ్రీజ్ చేయడం సాధార‌ణం. క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ (సీఆర్‌పీసీ) లేదా తత్సమాన చట్టపరమైన నిబంధనల కింద నేరస్థుల ద్వారా ఆర్జించిన ఆస్తులను, బ్యాంకు ఖాతాలను ముందస్తు చర్యగా స్తంభింపజేస్తారు. దర్యాప్తు పూర్తికాకముందు కోర్టు తుది తీర్పు వెలువడకముందు సీజ్ చేసిన నిధులను నిందితులు నేరుగా డ్రా చేసుకోవడానికి లేదా వాడుకోవడానికి సాధారణంగా చట్టం అంగీకరించదు.

అయితే తన బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేయడం వల్ల కుటుంబ పోషణ భారమైందని... తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నానని పేర్కొంటూ ఐబొమ్మ రవి నాంపల్లిలోని 9వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టులో విచారణ కొనసాగుతోంది. దర్యాప్తు దశలో ఉన్న కేసుల్లో నిందితులు ఇటువంటి అభ్యర్థనలు చేసినప్పుడు కోర్టు ఇరువర్గాల వాదనలను వింటుంది. ఆ సొమ్ము చట్టవిరుద్ధమైన మార్గాల (పైరసీ) ద్వారా ఆర్జించిందా లేదా అనేదానిపై పోలీసులు సమర్పించే ఆధారాలను న్యాయస్థానం పరిశీలిస్తుంది.

కోర్టు విచారణ జరుగుతున్న సమయంలో లేదా ట్రయల్ పెండింగ్‌లో ఉన్నప్పుడు నిధుల వాడకం అనేది పూర్తిగా న్యాయమూర్తి విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆ డబ్బు నేరపూరిత కార్యకలాపాల ద్వారా వచ్చిందని దర్యాప్తు సంస్థలు బలమైన ఆధారాలతో నిరూపిస్తే ఆ ఖాతాలను అన్‌ఫ్రీజ్ చేయడానికి కోర్టు నిరాకరించవచ్చు. అయితే కుటుంబ అవసరాల నిమిత్తం లేదా ఇతర ప్రత్యేక కారణాలరీత్యా పాక్షికంగా వెసులుబాటు కల్పించాలా వద్దా అనేదానిపై కోర్టు సమగ్ర పరిశీలన తర్వాతే నిర్ణయం తీసుకుంటుంది.

మొత్తానికి ఐబొమ్మ రవి దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టు ఇచ్చే తీర్పుపైనే ఆ రూ. 3 కోట్ల నిధుల డ్రా ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. పైరసీ ఆరోపణలు తీవ్రమైనవి కావడంతో పాటు, ఆ సొమ్ము చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా వచ్చిందనే వాదనలు బలంగా ఉన్న నేపథ్యంల కోర్టు నుంచి ఆయనకు అనుకూలమైన తీర్పు వస్తుందా లేదా అనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది.