సవాలుగా మారిన ఐబొమ్మ.. పట్టుకోవడం అంత సులభం కాదా?
పోలీసులు కొత్త టెక్నాలజీని ఉపయోగించి వాటిని క్లోజ్ చేసినా.. మరో కొత్త డొమైన్ తో మళ్ళీ ప్రారంభం అవుతున్నాయి.
By: Madhu Reddy | 2 Oct 2025 9:00 PM ISTదేశంలో అతిపెద్ద పైరసీ భూతం అంటే.. వెంటనే ఐబొమ్మ గుర్తొస్తుంది. అంతా తెలిసినా.. ఈ ఐబొమ్మను పట్టుకోవడానికి పోలీసులకు సవాలుగా మారింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఏకంగా రెండు కోట్లు ఖర్చుపెట్టి అత్యాధునిక పరికరాలతో అతిపెద్ద పైరసీ ముఠాను ఇటీవల పట్టుకున్నారు. అందులో నలుగురిని అరెస్టు చేశారు కూడా.. త్వరలోనే ఐబొమ్మ హెడ్ ని కూడా పట్టుకుంటామని ప్రకటించారు. అయితే ఇలాంటి సమయంలో కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి.
తెలుగు సినీ పరిశ్రమకు అడ్డంకిగా మారిన ఈ పైరసీ భూతం ఐబొమ్మను పట్టుకోవడంలో ఎందుకింత ఆలస్యం అవుతోంది? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే ప్రత్యేకించి ఇక్కడ ఐబొమ్మనే ఎందుకు ప్రస్తావించాల్సి వస్తోంది అంటే.. చిన్న సినిమాను మొదలుకొని.. పెద్ద సినిమా వరకు నటీనటుల కష్టాన్ని, నిర్మాతల లాభాలను నిట్ట నిలువునా దోచుకుంటున్న ఏకైక పైరసీ యాప్ అనడంలో సందేహం లేదు. సినిమా థియేటర్లలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే ఐబొమ్మాలో ప్రీ హెచ్డి తో అందుబాటులోకి రావడంతో.. అటు ప్రజలు కూడా ఈ పైరసీ యాప్ లో సినిమా చూడడానికి కాస్త ఆసక్తి కనబరుస్తున్నారు. దీని వల్ల నిర్మాతలు నష్టపోతున్నారు. సంవత్సరాల తరబడి.. సినిమాల కోసమే జీవితాన్ని కేటాయించిన నటీనటులకు , దర్శకులకు ఏ రేంజ్ లో నష్టం వాటిల్లుతోందో చెప్పాల్సిన పనిలేదు. ఇంత తెలిసినా కూడా దీనిని పట్టుకోవడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు అనే అనుమానాలు ప్రధానంగా వ్యక్తం అవ్వగా.. ఇప్పుడు ఆశ్చర్యపోయే పలు అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వాస్తవానికి తెలుగు సినీ పరిశ్రమకు అతిపెద్ద ముప్పుగా నిలిచిన ఐబొమ్మను పట్టుకోవడానికి పోలీసులు, సైబర్ క్రైమ్ విభాగం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా .. ఇప్పటికీ ఐబొమ్మ వెనుక ఉన్న ప్రధాన వ్యక్తులను పట్టుకోవడంలో విఫలం అవుతున్నారు. అయితే ఈ ఐబొమ్మను పట్టుకోవడంలో పోలీసులు విఫలం కావడానికి ప్రధాన కారణాల విషయానికి వస్తే.. నిజానికి గతంలో అనేక పైరసీ వెబ్సైట్ లపై పోలీసులు దాడులు జరిపారు. తమిళ్ రాకర్స్, మూవీస్ డా, జాలీ మూవీ వంటి సైట్లపై కొరడా ఝళిపించి మూసివేసినా.. కొద్ది రోజుల్లోనే వేరే పేర్లతో అవి తిరిగి వచ్చేసాయి. అదే పరిస్థితి ఇప్పుడు ఐబొమ్మలో కూడా కనిపిస్తోంది.
పోలీసులు కొత్త టెక్నాలజీని ఉపయోగించి వాటిని క్లోజ్ చేసినా.. మరో కొత్త డొమైన్ తో మళ్ళీ ప్రారంభం అవుతున్నాయి. పైగా వందలాది డొమైన్లు నెట్టింట అందుబాటులో ఉండడం, సర్వర్లు విదేశాలలో కూడా ఉండడం వల్లే.. ఇప్పుడు పోలీసులకు ఇది పెద్ద సవాలుగా మారింది అని చెప్పవచ్చు. సైబర్ నిపుణులు తెలుపుతున్న ప్రకారం.. ఇలాంటి సైట్లు ఎక్కువగా అనామక సర్వర్లను ఉపయోగిస్తున్నాయని, వీటి ఆపరేటర్లు వీపీఎన్ లు, ప్రాక్సీ లు ఉపయోగించి తమ ఐపీలను దాచేస్తారు అని, మరొకవైపు బిట్ కాయిన్ వంటి డిజిటల్ చెల్లింపుల ద్వారా ప్రకటనల ఆదాయం కూడా పొందుతున్నారు అని..అందుకే వీటిని ట్రాక్ చేయడం కష్టంగా మారింది అని సమాచారం.
అంతేకాదు వీరి ప్రధాన కేంద్రాలు భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా ఉండడం వల్లే ఇప్పుడు చట్టపరమైన అడ్డంకులు కూడా ఏర్పడినట్లు తెలుస్తోంది. అటు ప్రత్యేక బృందాలు, ఐటీ చట్టాలు ఈ రాకెట్ ను చేధించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఇక్కడ ప్రధాన సమస్య ఏమిటంటే ఒక వెబ్సైట్ మూసివేసినా మరో కొత్త వెబ్సైట్ తెరుచుకోవడంతో పైరసీని పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకొచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.. మరి ఐబొమ్మ లాంటి పైరసీ సైట్లను మూసివేయడం ఒక పోలీసులతోనే సాధ్యం కాదు.. ప్రభుత్వాల మధ్య సహకారం.. కఠిన చట్టాలు.. టెక్నాలజీ సహాయం ఎంతైనా అవసరం పడుతుంది. ముఖ్యంగా ప్రజలు కూడా ఇలాంటి సైట్ల ద్వారా సినిమాలు చూడకుండా నిరాకరిస్తేనే.. ఈ పైరసీ.భూతానికి అడ్డుకట్ట వేయవచ్చు.
ఏదిఏమైనా ఈ భూతాన్ని తరిమేయాలి అంటే ప్రజల చేతుల్లోనే ఉందని.. ప్రజలు ఇందులో సినిమాలు చూడడం ఆపివేస్తే దీని వెనుక ఉన్న వ్యక్తులను పట్టుకోవడం మరింత సులభం అవుతుందని.. అటు పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా ఇందులో సినిమాలు చూడడం ప్రజలు మానేస్తారేమో చూడాలి.
