త్వరలో ఐబొమ్మ హెడ్ అరెస్ట్!
ఈ మేరకు తాజాగా సినీ పరిశ్రమ ప్రముఖులతో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు భేటీ అవ్వగా.. ఈ భేటీలో ఎన్నో విషయాలను చర్చించినట్లు తెలుస్తోంది.
By: Madhu Reddy | 30 Sept 2025 1:54 PM ISTసినిమా ఇండస్ట్రీని పట్టిపీడిస్తున్న పైరసీ భూతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. సినిమా అలా విడుదల అయిందో లేదో ఇలా పైరసీ అయిపోయి అటు నిర్మాతలకు ఇటు నటీనటులకు భారీ నష్టాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కాస్త ముందడుగు వేసి..దాదాపు రూ.2కోట్ల ఖర్చుతో అధునాతన పరికరాలను ఉపయోగించి.. భారతదేశంలోనే అతిపెద్ద పైరసీ ముఠాను అరెస్టు చేశారు. త్వరలోనే ఐబొమ్మ హెడ్ ని కూడా అరెస్టు చేస్తామని తెలిపారు.
ఈ మేరకు తాజాగా సినీ పరిశ్రమ ప్రముఖులతో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు భేటీ అవ్వగా.. ఈ భేటీలో ఎన్నో విషయాలను చర్చించినట్లు తెలుస్తోంది. మంగళవారం హైదరాబాదులో సినీ పరిశ్రమ పెద్దలతో ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేయగా.. ఈ సమావేశానికి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, నాని, నాగచైతన్యతో పాటు దర్శకులు, డిజిటల్ మీడియా కంపెనీల ప్రతినిధులు, నిర్మాత దిల్ రాజు తదితరులు హాజరయ్యారు. ఇందులో పోలీసులు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పైరసీ ముఠాల పనితీరును సినీ పెద్దలకు వివరించారు.
ముఖ్యంగా ఇందులో సినిమాలు థియేటర్లలోకి రాకముందే హెచ్డీ క్వాలిటీ ప్రింట్ లు ఎలా బయటకు వస్తున్నాయో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా సంస్థల సర్వర్లలో ఉన్న బలహీనమైన సైబర్ భద్రతను ఆసరాగా చేసుకుని హ్యాకర్స్ ఇలా సినిమాలను దొంగలిస్తున్నారని.. ఈ హ్యాకర్లు పైరసీ ముఠాలకు.. బెట్టింగ్ యాప్ ల నిర్వహకులు భారీగా డబ్బు చెల్లిస్తున్నారని ఆధారాలతో సహా బయటపెట్టారు. ముఖ్యంగా ఈ పైరసీ పెరిగిపోవడానికి.. బెట్టింగ్ యాప్స్ ప్రధాన కారణం అని కూడా తెలియజేశారు.. ముఖ్యంగా సెలబ్రిటీలు ప్రచారం చేస్తున్న బెట్టింగ్ యాప్ ల నిర్వాహకులే ఈ పైరసీ ముఠాలకు నిధులు సమకూరుస్తున్నారనే చేదు నిజం బయటపడడంతో భవిష్యత్తులో బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఎలాంటి ప్రచార కార్యక్రమాలలో పాల్గొనకూడదని ఇప్పుడు టాలీవుడ్ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది.
ఇకపోతే సమావేశంలో పోలీసులు వివరించిన వివరాలను దృష్టిలో పెట్టుకున్న డిజిటల్ మీడియా కంపెనీలు కూడా తమ సైబర్ భద్రత వ్యవస్థలను పటిష్టం చేసుకుంటామని సర్వర్ల రక్షణ కోసం మరింత ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు.. ఇకపోతే పైరసీ ముఠా గుట్టురట్టు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు త్వరలోనే ఓటీటీ పైరసీ కంటెంట్ సైట్ అయిన ఐబొమ్మ నిర్వాహకులను పట్టుకుంటామని తెలిపారు. ఇక ఈ విషయంపై ఐపీఎస్ సివి ఆనంద్ మాట్లాడుతూ.." దాదాపు రెండు కోట్లు ఖర్చు చేసి అధునాతన పరికరాలు వాడి దేశాన్ని పట్టిపీడిస్తున్న పైరసీ ముఠాని పట్టుకున్నాము. త్వరలో ఐబొమ్మ నిర్వహకులను కూడా అరెస్టు చేస్తాము.. ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసాము" అంటూ తెలిపారు.
