Begin typing your search above and press return to search.

ఐబొమ్మ రవి ఆస్తుల చిట్టా చూస్తే మైండ్ బ్లాక్

విచారణలో రవి మరో షాకింగ్ విషయం బయటపెట్టాడు. పైరసీ ప్రపంచంలో మరో పెద్ద వెబ్ సైట్ అయిన "మూవీ రూల్స్"తో తనకు సంబంధాలు ఉన్నట్లు ఒప్పుకున్నాడు.

By:  M Prashanth   |   23 Nov 2025 9:27 AM IST
ఐబొమ్మ రవి ఆస్తుల చిట్టా చూస్తే మైండ్ బ్లాక్
X

ఐబొమ్మ అడ్మిన్ ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు తీగ లాగితే డొంకంతా కదులుతోంది. కేవలం సినిమాలు పైరసీ చేయడమే కాదు, దాని వెనుక పెద్ద మాఫియానే నడిపినట్లు విచారణలో తేలుతోంది. గత మూడు రోజులుగా పోలీసులు రవిని విచారిస్తుండగా, అతను కూడబెట్టిన ఆస్తులు, విదేశాల్లో చేసిన పెట్టుబడుల వివరాలు చూసి అధికారులే షాక్ అవుతున్నారు.

బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన అక్రమ సంపాదనను విదేశాలకు తరలించి, అక్కడ భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు సమాచారం. ​రవి పైరసీ నెట్‌వర్క్ అంతా ఇండియా నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా నడిచేది. ముఖ్యంగా కరేబియన్ దీవుల్లో రవికి ఒక నివాసం ఉంది. దానికి దగ్గరలోనే ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకుని, దాన్ని "వార్ హౌస్"గా పిలిచేవాడట.

అక్కడి నుంచే ఈ పైరసీ ఆపరేషన్స్, బెట్టింగ్ యాప్స్ నిర్వహణ జరిగేది. ఈ మొత్తం వ్యవహారాన్ని చూసుకోవడానికి ఇండియాలోనూ, విదేశాల్లోనూ కలిపి మొత్తం 25 మంది టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్ టీమ్ రవి కోసం పనిచేస్తోంది. వీళ్లు ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌తో ఐబొమ్మ వెబ్ సైట్ లింకులను ఎప్పటికప్పుడు క్లోన్ చేస్తూ పోలీసులకు దొరక్కుండా జాగ్రత్త పడేవారు.

​విచారణలో రవి మరో షాకింగ్ విషయం బయటపెట్టాడు. పైరసీ ప్రపంచంలో మరో పెద్ద వెబ్ సైట్ అయిన "మూవీ రూల్స్"తో తనకు సంబంధాలు ఉన్నట్లు ఒప్పుకున్నాడు. ఈ వెబ్ సైట్ ద్వారా కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయట. విదేశాల నుంచి వచ్చే డబ్బును క్రిప్టోకరెన్సీ రూపంలోకి మార్చి, మూవీ రూల్స్ ద్వారా ఇండియాకు రప్పించేవాడు. ఐబొమ్మ ప్లాట్‌ఫామ్‌ను అక్రమ బెట్టింగ్ యాప్‌లకు గేట్‌వేగా వాడేవాడు.

​రవి కేవలం పైరసీ సినిమాల ద్వారానే కాదు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారా కూడా భారీగా సంపాదించాడు. గత ఏడేళ్లుగా 4 పైరసీ వెబ్ సైట్లు, 4 బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్నట్లు సిఐడి విచారణలో తేలింది. ఆ బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బుతోనే కొత్త సినిమాలను లీక్ చేసే వ్యక్తుల నుంచి ప్రింట్లు కొనుగోలు చేసేవాడట. సినిమాలను ఎవరు లీక్ చేస్తున్నారు, బెట్టింగ్ యాప్స్ వెనుక ఉన్న స్పాన్సర్లు ఎవరు అనే వివరాలను రవి పోలీసులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక మిగతా వారిని కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు అన్ని కోణాల్లో విచారణను కొనసాగిస్తున్నారు.