Begin typing your search above and press return to search.

తల నరికినా చావని ఐబొమ్మ

ఒక పెద్ద క్రిమినల్ దొరికాడు, ఇక అంతా సేఫ్ అని పోలీసులు, ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకునేలోపే మరో షాక్ తగిలింది.

By:  M Prashanth   |   20 Nov 2025 10:43 AM IST
తల నరికినా చావని ఐబొమ్మ
X

ఒక పెద్ద క్రిమినల్ దొరికాడు, ఇక అంతా సేఫ్ అని పోలీసులు, ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకునేలోపే మరో షాక్ తగిలింది. టాలీవుడ్ ను పట్టి పీడిస్తున్న ఐబొమ్మ వ్యవస్థాపకుడు రవిని అరెస్ట్ చేసి, ఆ సైట్ ను డౌన్ చేసినా.. పైరసీ అనే మహమ్మారి మాత్రం వదలడం లేదు. ఓ పురాణ కథలో ఒక తల నరికితే మరో తల పుట్టుకొచ్చినట్లు.. ఇప్పుడు ఇంటర్నెట్ లో "iBOMMA One" (ఐబొమ్మ వన్) అనే కొత్త వెబ్ సైట్ ప్రత్యక్షమై కలకలం రేపుతోంది.

అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇది పాత ఐబొమ్మ లాంటిది కాదు. ఆ పేరుతో జరుగుతున్న ఒక పెద్ద మాయాజాలం. నెటిజన్లు ఈ కొత్త సైట్ లోకి వెళ్లి లేటెస్ట్ సినిమాల పోస్టర్లు చూసి మురిసిపోతున్నారు. కానీ సినిమా చూడాలని క్లిక్ చేస్తే మాత్రం అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. ఆ లింక్ నేరుగా మరో పైరసీ దిగ్గజం 'మూవీ రూల్జ్' సైట్ కు రీడైరెక్ట్ అవుతోంది. అంటే, ఐబొమ్మ బ్రాండ్ ఇమేజ్ ని వాడుకుని, ట్రాఫిక్ ని వేరే సైట్లకు మళ్ళించే స్కామ్ ఇదని అర్థమవుతోంది.

పోలీసుల ప్రాథమిక విచారణలో ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి. ఐబొమ్మ అనేది కేవలం ఒక వెబ్ సైట్ కాదని, అదొక పెద్ద 'ఎకో సిస్టమ్' అని అనుమానిస్తున్నారు. దీనికి అనుబంధంగా దాదాపు 65 మిర్రర్ సైట్స్ ఉన్నాయని, మెయిన్ సైట్ డౌన్ అయినా ఈ బ్యాకప్ సైట్స్ ద్వారా పైరసీని కంటిన్యూ చేసే ప్లాన్ వారి దగ్గర ఉందని తెలుస్తోంది. రవి జైల్లో ఉన్నా, అతని నెట్‌వర్క్ బయట యాక్టివ్ గానే ఉందనే అనుమానాలకు ఈ కొత్త సైట్ బలం చేకూరుస్తోంది.

దీంతో ఇండస్ట్రీ పెద్దల డిమాండ్స్ కూడా మారాయి. కేవలం ఐబొమ్మను టార్గెట్ చేస్తే సరిపోదని, దానికి మూలాలైన మూవీ రూల్జ్, తమిళ్ రాకర్స్, తమిళ్ వన్ వంటి బడా పైరసీ సైట్లను కూడా శాశ్వతంగా బ్యాన్ చేయాలని కోరుతున్నారు. ఒక్కరిని అరెస్ట్ చేస్తే సమస్య తీరదని, ఆన్లైన్ లో ఉన్న ఈ పైరసీ డొమైన్లన్నింటినీ బ్లాక్ చేస్తేనే నిర్మాతలకు న్యాయం జరుగుతుందని వాదిస్తున్నారు.

మరోవైపు సైబర్ పోలీసులు సామాన్యులకు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. ఫ్రీగా సినిమాలు చూడాలనే ఆశతో ఇలాంటి కొత్త లింక్స్ మీద క్లిక్ చేస్తే, మీ పర్సనల్ డేటా మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. "ఏదీ ఉచితంగా రాదు, దానికి ఏదో ఒక మూల్యం చెల్లించుకోవాలి" అని హెచ్చరిస్తున్నారు. పైరసీ సైట్లను వాడటం వల్ల మన ప్రైవసీని మనమే తాకట్టు పెట్టినట్లు అవుతుందని సూచిస్తున్నారు.

ప్రస్తుతానికి ఐబొమ్మ రవి రిమాండ్ లో ఉన్నాడు, అతని జీవితంపై సినిమా తీస్తామని కొందరు నిర్మాతలు ప్రకటనలు కూడా చేస్తున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే మాత్రం, రవి అరెస్ట్ అనేది పైరసీ యుద్ధంలో ఒక చిన్న విజయం మాత్రమే. టెక్నాలజీని అడ్డం పెట్టుకుని జరుగుతున్న ఈ దోపిడీని పూర్తిగా అరికట్టాలంటే ఇంకా చాలా చేయాల్సి ఉందని 'ఐబొమ్మ వన్' రాకతో స్పష్టమైంది.