Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: కంపెనీ సీఈవో నుంచి పైర‌సీ వ‌ర‌కూ!

పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు, ఆపరేటర్ అయిన ఇమ్మది రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   16 Nov 2025 9:50 AM IST
టాప్ స్టోరి: కంపెనీ సీఈవో నుంచి పైర‌సీ వ‌ర‌కూ!
X

పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు, ఆపరేటర్ అయిన ఇమ్మది రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. శుక్రవారం ఫ్రాన్స్ నుండి హైదరాబాద్‌కు వచ్చిన అత‌డిని కూకట్‌పల్లిలో పోలీసులు వ‌ల‌ప‌న్ని ప‌ట్టుకున్నారు. ప్ర‌స్తుతం అత‌డు నిర్వ‌హిస్తున్న ఐ బొమ్మ‌, బ‌ప్ప‌మ్ వెబ్ సైట్ల‌ను పూర్తిగా బ్లాక్ చేసారు. ఇక వీటిలో 1ఎక్స్ బెట్టింగ్ అనే యాప్ ను ప్ర‌మోట్ చేసి భారీగా నిధులు స‌మ‌కూర్చుకున్నాడ‌ని పోలీసులు చెబుతున్నారు. త‌న‌ను పోలీసులు గుర్తించ‌లేర‌నే ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ తో అత‌డు కూక‌ట్ ప‌ల్లికి వ‌చ్చి దొరికిపోయాడ‌ని కూడా వారు విశ్లేషిస్తున్నారు. అతడు ఐబొమ్మ వెబ్ సైట్ ని క‌రేబియ‌న్ నుంచి ఆప‌రేట్ చేసాడ‌ని చెబుతున్నారు.

ఈ వెబ్ సైట్ లో ఎప్ప‌టిక‌ప్పుడు పైరేటెడ్ తెలుగు సినిమాలు, ఓటీటీ కంటెంట్ ని అప్లోడ్ చేసి, పంపిణీని అత‌డు ప‌ర్య‌వేక్షించేవాడు. అలాగే స‌ర్వ‌ర్ల‌ను సులువుగా హ్యాక్ చేసే టెక్నిక్ లోను అత‌డు నైపుణ్యం సంపాదించాడు. అయితే తెలుగు చిత్ర‌సీమ‌కు కోట్లాది రూపాయ‌ల ఆర్థిక న‌ష్టానికి కార‌కుడైన ఐబొమ్మ నిర్వాహ‌కుడిపై ఇప్ప‌టికే తెలుగు సినిమా యాంటీ పైర‌సీ సెల్ సైబ‌ర్ క్రైమ్ అధికారుల‌కు ఫిర్యాదు చేసింది. ఆ త‌ర్వాత పోలీసులు అత‌డి కోసం వేట ప్రారంభించారు. పోలీసులు గతంలో వెబ్‌సైట్ ఆపరేటర్లను అదుపులోకి తీసుకున్నారు. ఆ త‌ర్వాత దర్యాప్తు మ‌రింత వేగవంత‌మైంది. దీని ఫలితంగా రవి విదేశాలలో ఉంటున్నాడ‌ని అత‌డి క‌ద‌లిక‌ల‌పై నిఘా పెట్టారు.

ప్లాట్‌ఫామ్‌ను నిర్వహించడంలో పాల్గొన్న అతని నెట్‌వర్క్‌లోని ఇతర సభ్యుల కోసం కూడా అధికారులు వెతుకుతున్నారు. డిజిటల్ ఫోరెన్సిక్స్ విశ్లేష‌ణ స‌హా అత‌డికి డ‌బ్బు ఎక్క‌డెక్కడి నుంచి ముడుతోందో పోలీసులు ప‌రిశీలిస్తున్నారు.

సెప్టెంబర్‌లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ, బప్పం సహా 65 మిర్రర్ వెబ్‌సైట్‌లను చట్టవిరుద్ధంగా కంటెంట్‌ను అప్‌లోడ్ చేసి పంపిణీ చేసినందుకు కేసు నమోదు చేశారు. పైర‌సీ స‌మ‌స్య‌పై తెలుగు సినీప‌రిశ్ర‌మ పెద్ద‌ల‌తో పోలీసులు స‌మావేశం నిర్వ‌హించి చ‌ర్చించారు. తమిళ్ ఎంవి, తమిళ్ బ్లాస్టర్స్, మోవియర్ల్జ్ వంటి పైరేటెడ్ పోర్టల్స్‌ను అధికారులు గుర్తించారు. సైబర్ క్రైమ్ నెట్‌వర్క్ థియేటర్‌లో సినిమాలను రికార్డ్ చేసి, రికార్డింగ్‌లను ఆన్‌లైన్‌లో లీక్ చేసిందని వారు చెప్పారు.

ప‌ట్టించిన విడాకుల విచార‌ణ‌:

ఐబొమ్మ ర‌వి ప్ర‌స్తుతం భార్య‌తో విడాకుల కేసులో హైద‌రాబాద్ కూక‌ట్ ప‌ల్లిలోని ఫ్యామిలీ కోర్టుకు హాజ‌ర‌వుతున్నాడు. అదే క్ర‌మంలో త‌దుప‌రి విచార‌ణ కోసం అత‌డు కూక‌ట్ ప‌ల్లిలోని ఒక అపార్ట్ మెంట్ కి వచ్చాడ‌ని అధికారులు చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ర‌వి స‌మాచారం అతడి వైరి వ‌ర్గాల‌ నుంచి పోలీసుల‌కు లీకైంద‌ని కూడా ఒక గుస‌గుస వినిపిస్తోంది. ద‌మ్ముంటే ప‌ట్టుకోండి! అని స‌వాల్ విసిరిన రవి ఇప్పుడు దొరికిపోయాడు. పోలీసు కస్టడీలో విచార‌ణ‌ను ఎదుర్కొంటున్నాడ‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

భారీ ఒప్పందాల‌తో నిధులు:

ఆన్‌లైన్ బెట్టింగ్ - గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లతో ప్రకటనల ఒప్పందాల ద్వారా రవి కోట్లు సంపాదించాడని దర్యాప్తు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ క‌ళ్లు గప్పేందుకే అత‌డు కరేబియన్ ద్వీపం నుండి పనిచేస్తున్నాడని వారు అనుమానిస్తున్నారు. విదేశాల నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ అతడు హైదరాబాద్‌లో పెద్ద నెట్ వ‌ర్క్ ని ఏర్పాటు చేసుకున్నాడ‌ని క‌డా పోలీసులు అనుమానిస్తున్నారు.

రవిని శనివారం నాంపల్లి కోర్టు ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అత‌డి నుంచి చాలా డాక్యుమెంట్లు, మరియు హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నార‌ని, అత‌డి బ్యాంక్ అకౌంట్లలోని 3 కోట్లు సీజ్ చేసార‌ని కూడా తెలుస్తోంది. అత‌డు పైర‌సీని విదేశాల నుంచి న‌డిపిస్తున్నాడు గ‌నుక విచార‌ణ‌లో భాగంగా అక్క‌డ స్థానిక ఏజెన్సీల సాయం తీసుకుంటార‌ని కూడా తెలుస్తోంది.

పైర‌సీ వ్యాపారంలో రవి ఒంటరిగానే ఉన్నాడా లేదా డజన్ల కొద్దీ మిర్రర్ సైట్‌లను నడిపే విస్తృత నెట్‌వర్క్‌లో భాగంగా కొన‌సాగుతున్నాడా? అనేది కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆన్‌లైన్ పైరసీ వల్ల 2024లో తెలుగు చిత్ర పరిశ్రమకు దాదాపు రూ. 3,700 కోట్ల నష్టం వాటిల్లిందని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంచనా వేసింది. కేవ‌లం ఐబొమ్మ వంటి వెబ్ సైట్ల కారణంగా అతి పెద్ద న‌ష్టం వాటిల్లుతోంద‌ని ఇప్ప‌టికే ఆందోళ‌న‌ను వ్య‌క్తం చేస్తోంది.