ఐబొమ్మ రవి.. బెయిల్ వెనుక కోర్టు కండిషన్లు
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఏ పెద్ద సినిమా రిలీజ్ అయినా, థియేటర్లో బొమ్మ పడకముందే మొబైల్ స్క్రీన్ల మీద ప్రత్యక్షమయ్యేది.
By: M Prashanth | 17 Feb 2026 6:27 PM ISTటాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఏ పెద్ద సినిమా రిలీజ్ అయినా, థియేటర్లో బొమ్మ పడకముందే మొబైల్ స్క్రీన్ల మీద ప్రత్యక్షమయ్యేది. ఇదంతా ఒకే ఒక వెబ్‌సైట్ పుణ్యమే.. అదే ‘ఐబొమ్మ’. దాదాపు 21 వేలకు పైగా సినిమాలను పైరసీ చేసి, ఫిల్మ్ ఇండస్ట్రీకి కొన్ని కోట్ల రూపాయల నష్టం కలిగించిన ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి ఇమంది రవి అరెస్ట్ అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. “దమ్ముంటే పట్టుకోండి” అని పోలీసులకే సవాల్ విసిరిన రవి, చివరకు సైబర్ క్రైమ్ పోలీసుల వలకి చిక్కడం సినిమాటిక్ మలుపులను తలపించింది.
జైలుకు వెళ్లిన తర్వాత రవిని పోలీసులు రెండు సార్లు కస్టడీలోకి తీసుకుని విచారించారు. విచారణలో చాలా ప్రశ్నలకు “గుర్తులేదు, తెలియదు” అంటూ రవి సమాధానాలు దాటవేసినట్లు వార్తలు వచ్చాయి. మధ్యలో అతడికి పోలీసులే జాబ్ ఆఫర్ చేశారన్న రూమర్లు కూడా వైరల్ అయ్యాయి కానీ, పోలీసులు వాటిని కొట్టిపారేశారు. రవి సంపాదించిన అక్రమ సొమ్ము ఎక్కడ ఉంది? బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంత వెనకేశాడు? అనే కోణంలో దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఇక చాలా రోజుల రిమాండ్ తర్వాత ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బయటకు వచ్చినా కూడా రవిపై పోలీసులు గట్టి నిఘా ఉంచేలా కోర్టు కఠినమైన రూల్స్ పెట్టింది. సైబర్ క్రైమ్ హిస్టరీలో ఇంతటి భారీ పైరసీకి పాల్పడిన వ్యక్తికి బెయిల్ రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ బెయిల్ వెనుక కోర్టు విధించిన కండిషన్లు చూస్తుంటే రవి ఇప్పట్లో మళ్ళీ తన పాత పనుల్లోకి వెళ్లడం అసాధ్యమనే అనిపిస్తోంది.
కోర్టు ఆదేశాల ప్రకారం రవి ప్రతిరోజూ సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది. అంతేకాకుండా, తన పాస్‌పోర్ట్‌ను కూడా కోర్టులో సరెండర్ చేయాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అనుమతి లేకుండా దేశం విడిచి ఎక్కడికీ వెళ్లకూడదన్నది ప్రధాన షరతు. ఒకవేళ ఏ చిన్న తప్పు చేసినా బెయిల్ రద్దయ్యే అవకాశం ఉండటంతో, రవి ఇప్పుడు పోలీసుల నిఘా నీడలోనే ఉండబోతున్నాడు. విచారణకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోర్టు ఆదేశించింది.
ఇందులో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. రవి ఇంటర్నెట్ వాడకం మీద కూడా కోర్టు ఆంక్షలు విధించింది. ఒకవేళ ఇంటర్నెట్ వాడాల్సి వస్తే ముందే పోలీసుల పర్మిషన్ తీసుకోవాలని స్పష్టం చేసింది. డిజిటల్ ప్రపంచంలో వేల సినిమాలను అప్‌లోడ్ చేసిన వ్యక్తికి, ఇప్పుడు అదే ఇంటర్నెట్ వాడాలంటే పోలీసుల పర్మిషన్ కావాలనడం ఒక రకంగా పెద్ద శిక్షే అని చెప్పాలి. టెక్నాలజీని ఉపయోగించి వ్యవస్థను సవాల్ చేసిన వ్యక్తికి, అదే టెక్నాలజీకి దూరం చేయడం ఈ కేసులో కీలక మలుపు.
ఇక ఐబొమ్మ రవికి బెయిల్ వచ్చినా, అది ఒక రకమైన గృహ నిర్బంధం లాంటిదే అనిపిస్తోంది. ఐబొమ్మ వెబ్‌సైట్ మళ్ళీ యాక్టివ్ అవుతుందా లేదా అనే టెన్షన్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఉంది. కానీ పోలీసుల నిఘా ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు రవి మళ్ళీ సాహసం చేస్తాడా అన్నది అనుమానమే. ఈ కేసు తదుపరి విచారణలో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాలి.
