ఐ బొమ్మ నిర్వాహకుడు అరెస్ట్ వెనక!
ఎప్పటికప్పుడు థియేటర్లలో విడుదలయ్యే కొత్త సినిమాలను లైవ్ గా అందిస్తూ `ఐ-బొమ్మ` వెబ్ సైట్ యూత్ లో భారీ ఫాలోయింగ్ ని సంపాదించిన సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 15 Nov 2025 11:58 AM ISTఎప్పటికప్పుడు థియేటర్లలో విడుదలయ్యే కొత్త సినిమాలను లైవ్ గా అందిస్తూ `ఐ-బొమ్మ` వెబ్ సైట్ యూత్ లో భారీ ఫాలోయింగ్ ని సంపాదించిన సంగతి తెలిసిందే. ఐ-బొమ్మలో కొత్త సినిమాలు, ఓటీటీ కంటెంట్ కూడా అందుబాటులోకి వస్తోంది. అయితే ఈ పైరసీ వెబ్ సైట్ కారణంగా తామంతా తీవ్రంగా నష్టపోతున్నామని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్ట్ చేయాల్సిందిగా టాలీవుడ్ నిర్మాతలు ఇప్పటికే పలు కేసులు నమోదు చేయగా విచారణను ప్రారంభించిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు చాలా కాలం క్రితమే ఐబొమ్మ నిర్వాహకుడి కోసం వేట మొదలు పెట్టారు.
అయితే రవి అనే వ్యక్తి విదేశాల నుంచి ఈ పైరసీ వ్యవస్థను ఆపరేట్ చేస్తున్నాడని, సినిమాలు విడుదలైన కొన్ని నిమిషాల్లోనే అతడు వెబ్ లో వాటిని అప్ లోడ్ చేస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. కరీబియన్ లో ఉంటూ అక్కడి నుంచే ఐబొమ్మను నిర్వహిస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. అతడు నిన్నటిరోజున ఫ్రాన్స్ నుంచి నేరుగా హైదరాబాద్ కి వచ్చాడు. ఇక్కడ కూకట్ పల్లిలోని ఓ అపార్ట్ మెంట్ లో సీసీఎస్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసారని మీడియాలో కథనాలొస్తున్నాయి.
ఇటీవల ఐబొమ్మ నిర్వాహకుడు తనను పట్టుకోవాల్సిందిగా పోలీసులకు సవాల్ విసిరాడు. ఆ తర్వాత పలువురు నిర్మాతలు అతడిపై కేసులు పెట్టారు. అతడి కారణంగా పరిశ్రమ ఇప్పటికే 2000 కోట్లు పైగా నష్టపోయిందని కూడా నిర్మాతలు ఆరోపించారు. ప్రస్తుత కేసుల ఆధారంగా సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతడిని పట్టుకోవడానికి ఇంకెన్నో రోజులు పట్టదని కూడా పోలీసులు ప్రతిఛాలెంజ్ విసిరారు. మొత్తానికి ఐబొమ్మ నిర్వాహకుడు హైదరాబాద్ కి రావడంతో సీసీఎస్ పోలీసులు వలపన్ని అతడిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.
ఇక ఐబొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేసిన తర్వాత సర్వర్లలో కంటెంట్ ని పోలీసులు పరిశీలించారని తెలుస్తోంది. అంతేకాదు అతడి బ్యాంక్ అకౌంట్లలోని 3 కోట్ల నిధిని కూడా ఫ్రీజ్ చేసినట్టు సమాచారం. ఐబొమ్మ రవి భార్య నుంచి విడిపోయి ప్రస్తుతం ఒంటరిగా నివశిస్తున్నాడని, విదేశాలను గమ్యస్థానం గా చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.
