Begin typing your search above and press return to search.

సినిమా హాళ్ల‌లో తినుబండారాలు- కోలాల ధ‌ర‌ల‌పై తిరుగుబాటు!

సినిమా థియేట‌ర్ల‌లో తినుబండారాలు, కోలాల ధ‌ర‌లు సామాన్యుల‌కు చుక్క‌లు చూపిస్తున్న వైనంపై చాలా కాలంగా అస‌హ‌నం పేరుకుపోయి ఉంది.

By:  Sivaji Kontham   |   28 Nov 2025 8:14 PM IST
సినిమా హాళ్ల‌లో తినుబండారాలు- కోలాల ధ‌ర‌ల‌పై తిరుగుబాటు!
X

సినిమా థియేట‌ర్ల‌లో తినుబండారాలు, కోలాల ధ‌ర‌లు సామాన్యుల‌కు చుక్క‌లు చూపిస్తున్న వైనంపై చాలా కాలంగా అస‌హ‌నం పేరుకుపోయి ఉంది. పార్కింగ్ పీజుల బాదుడుపైనా వ్య‌తిరేక‌త తీవ్రంగా ఉంది. ఈ రెండు వ్య‌వ‌హారాల‌పైనా గ‌తంలో తెరాస ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల నుంచి చాలా ఫిర్యాదుల‌ను ప‌రిశీలించి, చివ‌రికి స‌మ‌స్య‌ను సీరియ‌స్ గా తీసుకుంది. సింగిల్ థియేట‌ర్లతో పాటు, మ‌ల్టీప్లెక్సుల‌పైనా తెలంగాణ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంది. పార్కింగ్ ఫీజుల బాదుడును చాలా వ‌ర‌కూ త‌గ్గించింది. అలాగే తినుబండారాల రేట్ల‌పై చార్ట్ లు పెట్టేలా చ‌ర్య‌లు చేప‌ట్టింది. కానీ చివ‌రికి ప్ర‌భుత్వాలు మారిన త‌ర్వాత య‌థారాజా త‌థాప్ర‌జా అన్న చందంగా ప‌రిస్థితి మారింది. ఇప్పుడు మ‌రోసారి హైద‌రాబాద్ సంథ్య థియేట‌ర్ వ‌ద్ద తినుబండారాలు, పార్కింగ్ ఫీజుల లొల్లును ప్ర‌శ్నిస్తూ, ప్రొగ్రెస్సివ్ యూత్ లీగ్ అనే సంస్థ ప్రేక్ష‌కుల నుంచి సంత‌కాల సేక‌ర‌ణ‌ను ప్రారంభించింది.

అయితే దీనికి సంథ్య థియేట‌ర్ యాజ‌మాన్యం స‌సేమిరా! అంటూ స‌ద‌రు సంస్థ ప్ర‌తినిధుల‌తో ఘ‌ర్ష‌ణ‌కు దిగ‌డం చ‌ర్చ‌గా మారింది. ఈ సంద‌ర్భంగా `ప్రొగ్రెస్సివ్ యూత్ లీగ్` ప్ర‌తినిధి మీడియాతో మాట్లాడుతూ.. సామాన్యుడు థియేట‌ర్ల‌కు వెళ్లని ప‌రిస్థితులు దాపురించాయ‌ని ఆవేద‌న‌ను వ్య‌క్తం చేసారు. రూ.30 ఖ‌రీదు చేసే తినుబండారాలను రూ.300 ధ‌ర‌కు అమ్మ‌డం, లేదా రూ.40 ఖ‌రీదు చేసే తినుబండారాల‌ను రూ.400 ధ‌ర‌కు అమ్మ‌డం దారుణంగా ఉంద‌ని, సామాన్యులు థియేట‌ర్ల‌కు వెళ్లాలా లేదా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వాలే థియేట‌ర్ యాజ‌మాన్యాల‌కు వ‌త్తాసు ప‌ల‌క‌డం వ‌ల్ల‌నే ఈ ప‌రిస్థితి దాపురించింద‌ని కూడా అత‌డు ఆవేద‌న చెందారు.

నిజానికి పైర‌సీ మాఫియా విస్త‌రించ‌డానికి అదుపు త‌ప్పిన‌ ఈ ధ‌ర‌లు ప్ర‌ధాన‌ కార‌ణ‌మ‌ని విశ్లేష‌ణ‌లు వెలువ‌డుతున్నాయి. ఓ వైపు పైర‌సీ మాఫియా గురించి చ‌ర్చ సాగుతున్న త‌రుణంలో ఇప్పుడు థియేట‌ర్ల‌లో తినుబండారాలు, కోలాల ధ‌ర‌లు, పార్కింగ్ ఫీజుల గురించి చ‌ర్చ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఈరోజుల్లో థియేట‌ర్ల వ‌ర‌కూ సామాన్యులను వెళ్ల‌నివ్వ‌ని ప‌రిస్థితులు ఎగ్జిబిష‌న్ రంగంలో ఉన్నాయి. సినిమా టికెట్ల ధ‌ర‌లను ఇష్టానుసారం పెంచుకునే ప‌రిస్థితి నేడు ఉంది. దీనికి ప్ర‌భుత్వాలే అనుమ‌తులివ్వ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. టికెట్ ధ‌ర‌ల‌ను మించి తిండి ప‌దార్థాలు, కోలాల‌కు సామాన్యుడు జేబులు గుల్ల చేసుకోవాల్సిన ప‌రిస్థితి ఉందని ఆవేద‌న చెందుతున్నారు. ఐదుగురు స‌భ్యులు ఉన్న కుటుంబం టికెట్ల కోసం కేవ‌లం రూ.1000 ఖ‌ర్చు చేస్తే, తినుబండారాలు, కోలాల‌ కోసం రూ.3000 చెల్లించుకోవాల్సిన దుస్తితి నేడు ఉంది. అస‌లు కంటే కొస‌రు జేబులు ఖాళీ చేయించ‌డంపై చాలా కాలంగా ప్ర‌జ‌లు సీరియ‌స్ గా ఉన్నా దానిని ఎగ్జిబిట‌ర్లు కానీ, సినీప‌రిశ్ర‌మ కానీ ఏనాడూ ప‌ట్టించుకున్న‌ది లేదు. బ‌హుశా పైర‌సీలో ప్రజ‌లు సినిమాలు చూడాల‌నుకోవ‌డానికి కూడా ఇవ‌న్నీ కార‌ణాలు అని విశ్లేషిస్తున్నారు.