తెలంగాణ రైజింగ్ సమ్మిట్-2047లో సల్మాన్ పెద్ద ప్రకటన
తెలంగాణ రాజధాని హైదరాబాద్ కి విస్త్రతమైన పర్యాటకం అభివృద్ధి చెందడానికి కారణం, ఆ నగరానికి ఉన్న చారిత్రక నేపథ్యం.
By: Sivaji Kontham | 4 Dec 2025 11:35 PM ISTతెలంగాణ రాజధాని హైదరాబాద్ కి విస్త్రతమైన పర్యాటకం అభివృద్ధి చెందడానికి కారణం, ఆ నగరానికి ఉన్న చారిత్రక నేపథ్యం. దశాబ్ధాల పాటు హైదరాబాద్ చుట్టూ జరిగినంత అభివృద్ధి ఏపీ-తెలంగాణలో ఎక్కడా లేదు. హైటెక్ సిటీ- సాఫ్ట్ వేర్ రంగం, ఫార్మా సిటీ- ఫార్మా రంగం, రామోజీ ఫిలింసిటీ - సినిమా వినోద రంగాలు... ఇక అన్ని రకాల వ్యాపారాలు, ఇండస్ట్రీస్ కూడా హైదరాబాద్ నుంచి ఎక్కువగా ఆపరేట్ అవుతుండటంతో ఈ నగరానికి వ్యాపారులతో పాటు పర్యాటకులు కూడా విస్త్రతంగా వస్తున్నారు.
ఇక తెలంగాణలో మరింత వేగంగా అభివృద్ధిని పరిగెత్తించేందుకు సీఎం రేవంత్ రెడ్డి భారీగా పెట్టుబడులను ఆహ్వానిస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రైజింగ్ సమ్మిట్- 2047 కార్యక్రమంలో టెక్నాలజీ, మౌలిక సదుపాయాలు, మీడియా, వినోదం, పర్యాటకం వంటి విభిన్న రంగాలలో మరింత వృద్ధిని ప్రభుత్వం కోరుకుంటోంది.
ఆసక్తికరంగా హైదరాబాద్ లో జరగనున్న ఈ సమావేశంలో పర్యాటకం, వినోద రంగానికి కూడా రేవంత్ ప్రత్యేకించి పెద్ద పీట వేస్తున్నారు. సినిమా రంగం సాంకేతిక అభివృద్ధికి రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో భారీ పెట్టుబడులను సమీకరణ కోసం రేవంత్ పిలుపునిస్తున్నారు. ఇక ఇదే వేదికపై సల్మాన్ ఖాన్ ఓ భారీ స్టూడియోని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనున్నారని సమాచారం. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా ఒక స్టూడియో నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఇవి రెండూ వస్తే గనుక అది కచ్ఛితంగా సినిమా పురోభివృద్ధికి దోహదపడతాయని ప్రజలు భావిస్తున్నారు.
డిసెంబర్ 8-9 తేదీలలో హైదరాబాద్ సమీపంలోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ వ్యాపారులు, పారిశ్రామిక రంగ ప్రముఖులు, వినోద రంగానికి చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు.
భారత్ ఫ్యూచర్ సిటీ లోపల అత్యాధునిక ఫిల్మ్ స్టూడియోను నిర్మించడానికి సల్మాన్ ఖాన్ నిర్మాణ సంస్థ రాష్ట్రంతో ముందస్తు చర్చలు జరిపినట్టు ఇప్పటికే కథనాలొచ్చాయి. ఈ స్టూడియోల నిర్మాణానికి అనుమతులు లభిస్తే, టాలీవుడ్ కి సాంకేతికంగా మరింత అదనపు వనరులు పెరిగినట్టేనని భావిస్తున్నారు. సినిమా, OTT, పోస్ట్-ప్రొడక్షన్, వీఎఫ్ ఎక్స్ అవసరాలకు టెక్నాలజీ స్థానికంగా మరింత అదనంగా అందుబాటులోకి వస్తుంది. ఇవే కాకుండా, బాలీవుడ్, దక్షిణ-భారతీయ సినిమాలను అనుసంధానించే కీలకమైన జాతీయ కేంద్రంగా తెలంగాణను నిలబెట్టగలవని నమ్ముతున్నారు.
