Begin typing your search above and press return to search.

నా కొడుకు చేసింది తప్పే...!

తన కొడుకు చేసింది పెద్ద తప్పే అని, అయితే అతడికి ఒక బిడ్డ ఉందని, ఆ పాప పరిస్థితి తల్చుకుంటేనే బాధగా ఉందని చిన్నప్పరావు అన్నాడు.

By:  Ramesh Palla   |   18 Nov 2025 3:51 PM IST
నా కొడుకు చేసింది తప్పే...!
X

ఐబొమ్మ వెబ్‌ సైట్ ద్వారా పైరసీ సినిమాలను అందిస్తున్న ఇమ్మాడి రవిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా వందల కొద్ది సినిమాలను థియేటర్‌లో విడుదల అయిన వెంటనే లేదా, ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయిన వెంటనే పైరసీ చేస్తున్న రవిని నిఘా వేసి మరీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కొన్నాళ్ల క్రితం రవి దమ్ముంటే తనను పట్టుకోవాలి అంటూ పోలీసు అధికారులకు సవాల్‌ విసిరినట్లు వార్తలు వచ్చాయి. పోలీసులు సుదీర్ఘ కాలం పాటు వేచి ఉండి, టైం చూసి రవిని అరెస్ట్‌ చేశాడు. రవి అరెస్ట్‌ తర్వాత అతడి గురించి పలు విషయాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా అతడి వ్యక్తిగత విషయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం రవి ఒక యువతిని ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. రవి అరెస్ట్‌ తర్వాత ఆయన తండ్రిని మీడియా వారు మాట్లాడించే ప్రయత్నం చేశారు.

ఐబొమ్మ రవి గురించి తండ్రి వ్యాఖ్యలు...

రవి తండ్రి చిన్నప్పరావు మీడియాతో మాట్లాడుతూ తన కొడుకు చేసింది ముమ్మాటికి తప్పే అన్నాడు. ఒక నేరం చేస్తే కచ్చితంగా ఏదో ఒక రోజు పోలీసులకు పట్టుబడాల్సిందే అని, తప్పు చేయడం మాత్రమే కాకుండా పోలీసులను చాలెంజ్‌ చేయడం ఏమాత్రం కరెక్ట్‌ కాదని చిన్నప్పరావు అన్నాడు. తన కొడుకు రవికి మద్దతు ఇస్తున్న వారు కూడా తప్పు చేసిన వారు అవుతారని అన్నాడు. చిన్నప్పటి నుంచి చదువులో షార్ప్‌ గా ఉండేవాడని, అయితే అతడు ఏం చదువుకున్నాడు అనేది నాకు సరిగ్గా తెలియదు అన్నాడు. తనకు పెద్దగా చదువు లేకపోవడంతో రవి ఏం చదువుతున్నాడు, ఏం జాబ్ చేస్తున్నాడు అనే విషయాలు తెలియదు అన్నాడు. నాకు డబ్బులు పంపించలేదని, ఈఎంఐ లు పెట్టుకుని లోన్ తీసుకుని తాను ఇల్లు కట్టుకున్నట్లుగా రవి తండ్రి చిన్నప్ప రావు మీడియాతో మాట్లాడిన సమయంలో చెప్పుకొచ్చాడు.

టాలీవుడ్‌ కొత్త సినిమాలు పైరసీ..

తన కొడుకు చేసింది పెద్ద తప్పే అని, అయితే అతడికి ఒక బిడ్డ ఉందని, ఆ పాప పరిస్థితి తల్చుకుంటేనే బాధగా ఉందని చిన్నప్పరావు అన్నాడు. రవికి శిక్ష తక్కువ పడేలా చూడాలని పోలీసులకు ఆయన విజ్ఞప్తి చేశాడు. తన కొడుకు చేసింది తప్పు అంటూనే.. కొడుకు మీద ప్రేమను కనబర్చుతూ తక్కువ శిక్ష పడాలి అని కోరుకుటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. రవి చేస్తున్న తప్పు గురించి నాకు తెలియదు అని, చాలా కాలంగా అతడు ఇంటికి దూరంగా ఉంటున్నట్లుగానూ చిన్నప్ప రావు చెప్పుకొచ్చాడు. చాలా కాలం క్రితమే రవి ఇంట్లోంచి వెళ్లి పోయినట్లు చెప్పుకొచ్చాడు. హైదరాబాద్‌ వెళ్లిన మొదట్లో పస్తులు ఉండి ఏవో కోర్స్‌లు నేర్చుకుంటూ బతికాడని, నేను ఏదో పని చేసుకుంటున్నాడు అనుకున్నాను. పెద్ద పెద్ద ఉద్యోగాలు నేను ఇప్పించలేను కదా, అతడికి వచ్చింది చేసుకోనివ్వు అనుకున్నాను అన్నాడు.

ఐబొమ్మ రవి గురించి నటుడు శివాజీ వ్యాఖ్యలు

ఐబొమ్మ రవికి మద్దతుగా చాలా మంది సోషల్‌ మీడియాలో పోస్ట్‌ లు చేస్తున్నాడు. అతడి బుర్ర, అతడి తెలివిని అంతా ప్రశంసిస్తూ అభినందిస్తున్నారు. నిజంగా అతడు చాలా తెలివి కలిగిన వాడు, అలాంటి వాడి తెలివి మంచి కోసం, దేశం కోసం వినియోగింపబడితే బాగుంటుంది అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. నటుడు శివాజీ స్వయంగా మాట్లాడుతూ రవి యొక్క ప్రతిభ తెలిసి ఆశ్చర్యపోయాను అన్నాడు. అలాంటి తెలివి కల్ల వాడు దేశం కోసం పని చేస్తే బాగుంటుంది అన్నాడు. మొత్తానికి పోలీసులు మాత్రం రవిని కస్టడీలోకి తీసుకుని తమదైన శైలిలో ఎంక్వౌరీ చేసి మరిన్ని విషయాలను బయటకు లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వందల కొద్ది సినిమాలు ఉన్న హార్డ్‌ డిస్క్‌ లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ఇప్పటికే ఐబొమ్మ ను రవి చేతులతోనే క్లోజ్ చేయించారు.