RFC కి పోటీగా HYDలో మరో కొత్త ఫిలిం స్టూడియో
ప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్ర స్టూడియో కాంప్లెక్స్‌గా హైపర్ కమర్షియల్- ప్రొడక్షన్ పరంగా దశాబ్దాలుగా ఏకచ్ఛత్రాధిపత్యం చెలాయిస్తున్న `రామోజీ ఫిల్మ్ సిటీ` (RFC)కి త్వరలోనే గట్టి పోటీ ఎదురుకానుందా? అంటే సినీ వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది.
By: Sivaji Kontham | 13 Oct 2026 6:29 AM ISTప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్ర స్టూడియో కాంప్లెక్స్‌గా హైపర్ కమర్షియల్- ప్రొడక్షన్ పరంగా దశాబ్దాలుగా ఏకచ్ఛత్రాధిపత్యం చెలాయిస్తున్న `రామోజీ ఫిల్మ్ సిటీ` (RFC)కి త్వరలోనే గట్టి పోటీ ఎదురుకానుందా? అంటే సినీ వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. హైదరాబాద్ నగర శివార్లలోని శంషాబాద్ ప్రాంతంలో మరో అత్యంత విశాలమైన, సరికొత్త భారీ ఫిల్మ్ స్టూడియోను నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తాజాగా వార్తలు వెలువడ్డాయి. టాలీవుడ్ పాన్-ఇండియా సినిమాలతో గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్ నగరానికి ప్రామఖ్యత పెరిగింది. అందుకే ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్ట్ ప్రకటన సర్వత్రా చర్చనీయాంశమైంది.
శంషాబాద్ ప్రాంతం అంతర్జాతీయ విమానాశ్రయం కలిగి ఉండటం.. రవాణా పరంగా అద్భుతమైన కనెక్టివిటీని కలిగి ఉండటంతో స్టూడియో ఏర్పాటుకు ఇది సరైన లొకేషన్ అని నిర్వాహకులు భావిస్తున్నట్లు సమాచారం. అయితే, రామోజీ ఫిల్మ్ సిటీ స్థాయిని అందుకోవడం లేదా దానికి ప్రత్యామ్నాయంగా నిలవడం అంత తేలికైన విషయమా అనే దానిపై ట్రేడ్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత భారీ పెట్టుబడులతో రూపుదిద్దుకోనున్న ఈ కొత్త స్టూడియోకి సంబంధించిన పూర్తి విధివిధానాలు...అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
మరోవైపు ఈ భారీ ప్రాజెక్ట్ వెనుక కేవలం సినిమా అవసరాలే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపార కోణం కూడా దాగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో కేవలం సినిమా షూటింగ్‌ల కోసం మాత్రమే ఇంతటి భారీ భూభాగాన్ని కేటాయించి స్టూడియోను నిర్వహించడం ఎంతవరకు లాభసాటిగా మారుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిర్మాణ వ్యయం, నిర్వహణ భారం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుంటే.. ఇది కేవలం సినిమా స్టూడియోగా మాత్రమే కాకుండా కమర్షియల్ వెంచర్‌గా మారే అవకాశాలు ఎక్కువని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక ప్రస్తుత కాలంలో మారుతున్న సినిమా షూటింగ్ ట్రెండ్స్‌ను గమనిస్తే ఈ ప్రాజెక్ట్ విజయావకాశాలపై మరింత చర్చ జరుగుతోంది. నేటి ఆధునిక దర్శకులు భారీ స్టూడియో సెట్ల కంటే రియల్ లోకేషన్లలో షూటింగ్ చేయడానికి, అలాగే వర్చువల్ ప్రొడక్షన్ (ఎల్ ఇడి వాల్స్), విజువల్ ఎఫెక్ట్స్ (VFX) టెక్నాలజీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో స్టూడియోల అవసరం క్రమంగా మారుతున్న తరుణంలో.. ఇంత భారీ స్థాయిలో మరో కొత్త స్టూడియో రావడం ఎంతవరకు గిరాకీని సంపాదించుకుంటుందనేది చూడాలి.
ఏది ఏమైనా రామోజీ ఫిల్మ్ సిటీకి దీటుగా హైదరాబాద్‌లో మరో పెద్ద ఫిల్మ్ స్టూడియో రాబోతుందనే వార్త తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ... వ్యాపార సర్కిళ్లలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ప్రాజెక్ట్ నిజంగానే టాలీవుడ్ మౌలిక వసతులను మరింత పటిష్టం చేస్తుందా లేక కేవలం ఒక కమర్షియల్ ప్రాజెక్ట్‌గా మిగిలిపోతుందా అనేది కాలమే నిర్ణయించాలి.
