కల్తీ.. కల్తీ.. మేక మాంసంలో ఎద్దు మాంసం
ప్రతి రోజు మనం తినే ఆహారం ఏ స్థాయిలో కల్తీ అవుతుందో ఆలోచిస్తే ముద్ద నోట్లో దిగే పరిస్థితి కనిపించడం లేదు. ఇంట్లో చేసుకున్న ఆహారం విషయంలోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది.
By: Ramesh Palla | 2 July 2026 11:03 AM ISTప్రతి రోజు మనం తినే ఆహారం ఏ స్థాయిలో కల్తీ అవుతుందో ఆలోచిస్తే ముద్ద నోట్లో దిగే పరిస్థితి కనిపించడం లేదు. ఇంట్లో చేసుకున్న ఆహారం విషయంలోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది. మనం తయారు చేసుకున్న ఆహారంలో వాడే సరుకులు సైతం కల్తీ అవుతున్నట్లుగా వార్తలు చూస్తున్నాం. వంట నూనె, అల్లం, పసుపు, మసాలా ఇలా ప్రతి ఒక్కటి కల్తీ అవుతున్న నేపథ్యంలో సాధారణ జనాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక ఈ మధ్య కాలంలో రెస్టారెంట్‌లలో ఉంటున్న పరిస్థితులను చూస్తే అటు వైపు వెళ్లాలి అని కూడా అనిపించడం లేదని సామాన్య జనాలు వాపోతున్నారు. అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. పెద్ద పెద్ద హోటల్స్‌గా పేరున్న హోటల్స్‌లో సైతం మినిమం క్లీనింగ్ కనిపించడం లేదు. కిచెన్‌లో పాడైపోయిన పదార్థాలు, కుల్లిపోయిన వంట సరుకులు ఈ మధ్య కాలంలో బయట పడటం సర్వసాధారణం అయింది.
హైదరాబాద్ హోటల్స్, రెస్టారెంట్స్‌లో...
హోటల్స్, రెస్టారెంట్స్‌లో కిచెన్ తనికీలు చేసిన అధికారులు సైతం విస్తు పోయారు. పలు హోటల్స్ ను సీజ్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు మటన్ ను కల్తీ చేసిన ముఠా గుట్టు రట్టు అయ్యింది. హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన తనిఖీల్లో భయంకర విషయాలు బయటకు వచ్చాయి. కొన్ని చోట్ల పాడై పోయిన మటన్ కనిపించింది. కొన్ని చోట్ల రెండు మూడు రోజుల క్రితం చనిపోయిన మేకలు, గొర్రెలు కోస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే హబీబ్ నగర్ పరిధిలోని ఒక మాంసం షాప్‌లో మేక మటన్‌లో ఎద్దు మాంసం కలిపి విక్రయిస్తున్నారు. అక్కడ నుంచి హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్స్‌కి సదరు మటన్ వెళ్తుందట. ప్రతి రోజు వేలాది మంది మేక మటన్‌తో పాటు ఎద్దు మాంసం ను కూడా తింటున్నారు. ఆ విషయం వారికి తెలియనే లేదు.
హబీబ్ నగర్ మటన్ షాప్...
హోటల్స్ వారు తక్కువ ధరకు వస్తుందనే ఉద్దేశంతో హబీబ్ నగర్‌లోని ఉస్మాన్ ఖురేషి అనే మటన్ వ్యాపారి వద్ద మాంసంను కొనుగోలు చేస్తారు. అతడు మేక మటన్ ను కల్తీ చేసి అందులో ఎద్దు మటన్‌ను కలపడం ద్వారా తక్కువ రేటుకు ఇస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. హోటల్స్ కు ఆ మటన్‌ను పంపిన సమయంలో గుర్తించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా ఉస్మాన్ ఖురేషి మటన్ షాప్‌లో పని చేస్తున్న వారు చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉస్మాన్ ఖురేషిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. H-FAST అధికారులు తమ సోదాలు కొనసాగుతాయని, ఇలాంటివి మళ్లీ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఎంతగా హెచ్చరిస్తున్నా జరిగే నష్టం జరుగుతూనే ఉంది, అయ్యే కల్తీ అవుతూనే ఉందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కల్తీ మటన్ తో అనారోగ్య సమస్యలు...
కల్తీ మటన్ తిన్న వారికి వెంటనే అనారోగ్య సమస్యలు తలెత్తక పోవచ్చు. కానీ దీర్ఘకాలిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. నడుము నొప్పి, కండరాల బలహీనత వంటి సమస్యలు కాల క్రమేనా వచ్చే అవకాశం ఉందని, అందుకే కల్తీ మటన్ తినకూడదు అని వైద్యులు సూచిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కల్తీ పదార్థాలు ఎక్కువగా మార్కెట్‌లో ఉంటున్నాయి. ఏది కల్తీ, ఏది అసలీ అనే విషయాన్ని నిపుణులు సైతం గుర్తించలేనంతగా కల్తీ చేస్తున్నారు. ఈ కల్తీని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఇది జనాలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యగా గుర్తించాల్సిన అవసరం ఉందని సామాన్యులు ప్రభుత్వ పెద్దలకు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇకపై హైదరాబాద్‌లో మటన్ బిర్యానీ తినాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏం తినాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించే పరిస్థితి వచ్చిందని జనాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
