Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల రాజ‌ధానులు 'గ్లోబ‌ల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ హ‌బ్' అవ్వాలంటే?

తెలుగు సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లాలంటే హాలీవుడ్ స్టూడియోలు, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి సంస్థలు హైదరాబాద్, అమరావతిలో కార్యాలయాలు ఏర్పాటు చేసి పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని కథనం అభిప్రాయపడింది. ఇందుకు ప్రపంచస్థాయి స్టూడియోలు, వీఎఫ్ఎక్స్ సదుపాయాలు, పారదర్శక నిర్మాణ విధానాలు అవసరమని పేర్కొంది. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు సింగిల్ విండో అనుమతులు, పన్ను రాయితీలతో సహకరించాలని సూచించింది.

By:  Tupaki Political Desk   |   20 Nov 2026 10:51 PM IST
తెలుగు రాష్ట్రాల రాజ‌ధానులు గ్లోబ‌ల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ హ‌బ్ అవ్వాలంటే?
X

బాహుబలి, ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడి వంటి చిత్రాలతో తెలుగు సినిమా ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్ లో తన సత్తాను చాటిచెప్పింది. అయితే ఈ ఊపును శాశ్వత స్థాయికి తీసుకెళ్తూ హైదరాబాద్ , అమరావతి (ఏపీలో కొత్త టాలీవుడ్) నగరాలను నిజమైన గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌లుగా తీర్చిదిద్దాలంటే కేవలం మన సినిమాలను విదేశాల్లో విడుదల చేస్తే సరిపోదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షిస్తున్నట్లుగా హైదరాబాద్ గ్లోబల్ వేదికగా మారాలంటే.. హాలీవుడ్ దిగ్గజ సంస్థలే నేరుగా తెలుగు రాష్ట్రాలకు తరలివచ్చి ఇక్కడ కార్యాలయాలు తెరిచి పెట్టుబడులు పెట్టే వాతావరణం ఏర్పడాలి. ప్ర‌స్తుతానికి హైద‌రాబాద్ కు గొప్ప అవ‌కాశం ఉంది. అమ‌రావ‌తి లేదా విశాఖ‌ప‌ట్నంలో మ‌రో కొత్త ప‌రిశ్ర‌మ నెల‌కొల్పాల‌ని భావిస్తున్నందున కొంత కాలం ప‌ట్టినా.. ఎంట‌ర్‌టైన్‌మెంట్ రంగానికి సీఎం చంద్ర‌బాబు నాయుడు త‌గిన ప్రాధాన్య‌త‌నిస్తార‌నే అంతా ఆశిస్తున్నారు.

వార్నర్ బ్రదర్స్, యూనివర్సల్, పారామౌంట్, సోనీ పిక్చర్స్, డీసీ, ఎంసీయూ వంటి మేజర్ హాలీవుడ్ స్టూడియోలు కేవలం డిస్ట్రిబ్యూషన్‌కే పరిమితం కాకుండా భార‌త‌దేశంలో అడుగుపెట్టి, ఇక్కడ కో ప్రొడక్షన్ విభాగాలను ప్రారంభించాలి. వీటితో పాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ఎంజీఎం, ఆపిల్ టీవీ ప్ల‌స్ వంటి స్ట్రీమింగ్ దిగ్గజాలు ప్రాంతీయ కథలను గ్లోబల్ ఒరిజినల్స్‌గా మలచడానికి ప్రత్యేక కంటెంట్ డెవలప్‌మెంట్ కార్యాలయాలను ఏర్పాటు చేయాలి. అలాగే ఆస్కార్ స్థాయి వీఎఫ్ఎక్స్, గేమింగ్ స్టూడియోలు, సీసీఏ, డ‌బ్ల్యూఎంఏ వంటి గ్లోబల్ టాలెంట్ ఏజెన్సీలు ఇక్కడికి వస్తే మన సాంకేతిక నిపుణులు, రచయితలు నేరుగా అంతర్జాతీయ ప్రాజెక్టులలో భాగమయ్యే అవకాశం దక్కుతుంది.

విదేశీ కార్పొరేట్ సంస్థలు కేవలం మాటల హామీలు- ఆతిథ్యాన్ని చూసి పెట్టుబడులు పెట్టవని టాలీవుడ్ పెద్దలు గుర్తించాలి. హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గట్టుగా మన నిర్మాణ సంస్థలు వ్యక్తిగత నిర్ణయాలను వీడి కార్పొరెట్ పారదర్శకత.. పక్కా బడ్జెట్ ఆడిటింగ్ విధానాలకు మారాలి. షూటింగ్ మొదలయ్యాక మార్పులు చేయకుండా ముందే `బౌండెడ్ స్క్రిప్ట్` సిద్ధం చేయడం.. సినిమా సమయానికి పూర్తవుతుందని హామీ ఇచ్చే కంప్లీషన్ బాండ్, ఇన్సూరెన్స్ వ్యవస్థలను అమలు చేయడం తప్పనిసరి. అంతేకాకుండా కథలు- పాత్రలు-మ్యూజిక్ వంటి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ (ఐపీ) హక్కుల విషయంలో అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా స్పష్టమైన ఒప్పందాలు ఉండాలి.

మౌలిక సదుపాయాల విషయానికి వస్తే.. ప్రపంచ స్థాయి సౌండ్ స్టేజ్‌లు, ఎల్‌.ఇ.డి వాల్యూమ్ వర్చువల్ ప్రొడక్షన్ ల్యాబ్‌లను నిర్మించడంతో పాటు విదేశీ టీమ్‌ల‌కు సహకరించే నిపుణులైన లైన్ ప్రొడ్యూసర్ల వ్యవస్థను బలోపేతం చేయాలి. సెట్‌లో పనిచేసే కార్మికుల పని గంటలు-బీమా- భద్రతా ప్రమాణాల విషయంలో గ్లోబల్ నిబంధనలను పాటించడం ద్వారా విదేశీ స్టూడియోలకు మన పనితీరుపై నమ్మకం కలిగించవచ్చు. పరిశ్రమ పెద్దలు తమ పాత పద్ధతులను మార్చుకుని ఈ కార్పొరెట్ సంస్కృతిని అందిపుచ్చుకున్నప్పుడే హాలీవుడ్ కంపెనీలు భాగస్వామ్యానికి ముందుకొస్తాయి.

ఈ ప్రక్రియలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు.. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్.డి.సి) అత్యంత కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. విదేశీ కంపెనీలు ఇక్కడ కార్యాలయాలు తెరిచేలా ప్రభుత్వ స్థాయిలో నేరుగా మంతనాలు జరపడం.. షూటింగ్‌లకు సింగిల్ విండో అనుమతులు ఇవ్వడం.. పన్ను రాయితీలు -సబ్సిడీలను ప్రకటించడం ద్వారా ప్రోత్సాహం అందించాలి. ప్రభుత్వాలు కల్పించే పాలసీ అండదండలు, సినీ పరిశ్రమ పాటించే కార్పొరెట్ క్రమశిక్షణ రెండూ కలిసినప్పుడే హైదరాబాద్-అమరావతి జంట నగరాలు ప్రపంచ సినిమాకు కొత్త చిరునామాగా మారతాయి.