డబుల్ కామెడీతో 'హుషారు-2'.. రిజల్ట్ కూడా ఆ రేంజ్ లో ఉండాలంటే..
ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ వస్తోంది. హుషారు-2 అంటూ మేకర్స్ ఇచ్చిన అప్డేట్ తో మరోసారి ఆ బ్రాండ్ పై నెట్టింట చర్చ మొదలైంది.
By: M Prashanth | 6 Oct 2026 9:21 AM ISTయూత్ కు కనెక్ట్ అయిన సినిమా పేరు చెబితే హుషారు కచ్చితంగా టాప్ లో ఉంటుంది. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి.. ఫ్రెండ్ షిప్, కామెడీ, లవ్, యూత్ ఫుల్ ఎమోషన్స్ తో కుర్రకారును ఆకట్టుకుంది. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ వస్తోంది. హుషారు-2 అంటూ మేకర్స్ ఇచ్చిన అప్డేట్ తో మరోసారి ఆ బ్రాండ్ పై నెట్టింట చర్చ మొదలైంది.
2018లో వచ్చిన హుషారు చిన్న సినిమాగా మొదలై మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా యువతలో సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. ఫ్రెండ్స్ మధ్య జరిగే ఫన్నీ సీన్స్, కామెడీ, రిలేషన్ షిప్స్, మ్యూజిక్ సినిమాకు స్ట్రెంత్ గా నిలిచాయి. అప్పట్లో వచ్చిన ఉండిపోరాదే పాట కూడా సినిమాకు మరింత గుర్తింపు తీసుకొచ్చింది. ఇప్పుడు దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత హుషారు-2 సిద్ధమవుతోంది.
ఆ సీక్వెల్ కు కూడా శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్నారు. అంటే మొదటి సినిమాకు పనిచేసిన దర్శకుడే మరోసారి రంగంలోకి దిగుతున్నారు. యూత్ స్టోరీలు, కామెడీ టైమింగ్ పై శ్రీహర్షకు ఉన్న పట్టును దృష్టిలో పెట్టుకుంటే.. సీక్వెల్ పై అంచనాలు పెరగడం కామనే. అయితే ఈసారి పోస్టర్ తోనే సినిమాను కాస్త డిఫరెంట్ గా చూపించే ప్రయత్నం చేశారు. పోస్టర్ లో ట్రక్కు, పాము, తాబేలు, బంగారు నగల పెట్టె కనిపిస్తున్నాయి.
మొత్తం సెటప్ చూస్తే అమృత మథనం గుర్తుకొస్తుంది. దేవతలు, రాక్షసులు కలిసి సముద్రాన్ని మథించినట్టుగా పోస్టర్ ను డిజైన్ చేశారు. దీనికి సినిమాకు ఉన్న సంబంధం ఏంటనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ లో పెట్టారు. ఇక హుషారు-2లో ఫస్ట్ పార్ట్ కంటే ఎక్కువ ఫన్, మరింత మ్యాడ్ నెస్ ఉంటుందని మూవీ టీమ్ చెబుతోంది. అంటే మొదటి సినిమాలో పనిచేసిన యూత్ ఫుల్ కామెడీని అలాగే కంటిన్యూ చేస్తూ.. ఈసారి మరింత కొత్తగా చూపించాలన్నది టీమ్ ప్లాన్ గా కనిపిస్తోంది.
రాహుల్ రామకృష్ణ, అశోక్ గల్లా, రవి ఆంథోని, దినేష్ తేజ్, శశిధర్ కోచర్లకోట తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే సీక్వెల్ కు కేవలం హుషారు అనే పేరు ఉంటే సరిపోదు. మొదటి భాగాన్ని ఇష్టపడిన ప్రేక్షకులకు ఫ్రెష్ గా ఏదైనా ఇవ్వాలి. అదే కామెడీని, అదే ఫ్రెండ్ షిప్ టెంప్లేట్ ను మళ్లీ చూపిస్తే అది రిపీట్ అనిపించే అవకాశం ఉంటుంది. అందుకే ఈసారి కథ, కామెడీ, క్యారెక్టర్లు మూడు కొత్తగా అనిపించడం చాలా ముఖ్యం.
అదే సమయంలో మొదటి భాగం క్రేజ్ ను క్యాష్ చేసుకోవడం కూడా ప్లస్ పాయింట్. టైటిల్ వినగానే యూత్ లో ఒక గుర్తింపు రావడం సీక్వెల్ కు కలిసొచ్చే అంశం. థియేటర్లలో నవ్వించే కంటెంట్ తోపాటు మంచి పాటలు, ఫ్రెష్ క్యారెక్టర్లు, ఇప్పటి యువతకు కనెక్ట్ అయ్యే పరిస్థితులు ఉంటే ఫస్ట్ పార్ట్ కు మించిన రేంజ్ లో రిజల్ట్ వస్తుంది. ప్రస్తుతం హుషారు-2 షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
