19 ఏళ్ల అమ్మాయి నటన చూసి స్క్రిప్ట్‌నే మార్చేసిన దర్శకుడు!
సమాజంలోని వ్యవస్థాగత లోపాలు, వాటి ముందు సామాన్యులు ఎదుర్కొనే నిస్సహాయత ఆధారంగా ఈ కథ రూపొందిందని హిరాజ్ తెలిపారు.
By: Srikanth Kontham | 29 Sept 2026 12:05 PM ISTజియోహాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోన్న `హుంకార్: ది రోర్` వెబ్ సిరీస్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.నిత్యా మెహ్రా, కరణ్ డి. కపాడియా సృష్టికర్తలుగా వ్యవహరించిన సిరీస్‌కు ప్రముఖ రచయిత, దర్శకుడు హిరాజ్ మార్ఫాటియా లీడ్ రైటర్‌గా వ్యవహరించడంతో పాటు రెండు ఎపిసోడ్లకు దర్శకత్వం వహించారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సిరీస్ నిర్మాణం, స్క్రిప్ట్ తయారీ వెనుకున్న భావోద్వేగాలు , నటీనటుల ప్రతిభ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
సమాజంలోని వ్యవస్థాగత లోపాలు, వాటి ముందు సామాన్యులు ఎదుర్కొనే నిస్సహాయత ఆధారంగా ఈ కథ రూపొందిందని హిరాజ్ తెలిపారు. అయితే ఈ సిరీస్ ప్రేక్షకులను నిరాశా నిస్పృహలకు గురిచేయడానికి కాకుండా వారిలో ఆశను చిగురించేలా తీర్చిదిద్దినట్లు చెప్పారు. `ప్రజలమైన మనమే ఈ వ్యవస్థలో భాగం. ప్రతీ ఒక్కరూ తమ ధర్మాన్ని, బాధ్యతను సరిగ్గా నిర్వర్తిస్తే మార్పు సాధ్యమవుతుంది` అనే బలమైన సందేశాన్ని ఈ సిరీస్ ద్వారా ఇచ్చే ప్రయత్నం చేశామని వివరించారు.
మొత్తం ఆరు ఎపిసోడ్ల స్క్రిప్ట్ డిజైనింగ్ , రైటింగ్ రూమ్‌లో పనిచేసిన అనుభవాన్ని హిరాజ్ పంచుకున్నారు. బహుళ పాత్రల ట్రాక్‌లను సమతుల్యం చేస్తూ కోర్టు గది సన్నివేశాలను ఉత్కంఠభరితంగా మలచడం పెద్ద సవాలని పేర్కొన్నారు. తాను స్వయంగా రాసుకున్న కథకు దర్శకత్వం వహించడం అత్యంత సంతృప్తికరమైన విషయమని, రచయితగా మనసులోని అసలైన భావాన్ని తెరపై తేవడానికి ఇది సరైన మార్గమని అభిప్రాయపడ్డారు.
ఈ సిరీస్‌లో 19 ఏళ్ల యువ నటి అనీత్ పడ్డా ప్రదర్శించిన నటనా పటిమపై హిరాజ్ ప్రశంసల వర్షం కురిపించారు. వర్క్‌షాప్ సమయంలో చివరి ఎపిసోడ్ కోసం అనీత్ పాత్రలోకి లీనమై చూపించిన భావోద్వేగాలు చూసి, ఆ ప్రదర్శ నను ప్రత్యేకంగా స్క్రిప్ట్‌లోనే చేర్చాల్సి వచ్చిందన్నారు. అలాగే అవుట్‌డోర్ షూటింగ్‌లో సమయం తక్కువగా ఉన్న సమయంలో కంగారు పడకుండా రెండు టేకుల్లో సీన్ ఓకే చేసి యావత్ యూనిట్‌ను ఆశ్చర్యపరిచిందని కొనియాడారు.
సీనియర్ నటుడు విపిన్ శర్మ ఈ సిరీస్‌లో తండ్రి పాత్రలో అద్భుతంగా నటించారని హిరాజ్ గుర్తు చేసు కున్నారు. ఒక కీలకమైన ఎమోషనల్ మోనోలాగ్ చెప్పేముందు ఆయన దాదాపు గంట పాటు గదిలో ఒంటరిగా ఉండి పాత్రలోకి లీనమయ్యారని తెలిపారు. ఆ తర్వాత ఒకే ఒక్క షాట్‌లో ఆ సన్నివేశాన్ని పూర్తిచేసి సెట్‌లో ఉన్నవారందరినీ కట్టిపడేశారన్నారు.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ ఈ ప్రాజెక్ట్‌కి ఎగ్జైక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం సిరీస్‌కు మరింత బలాన్ని ఇచ్చిందని హిరాజ్ తెలిపారు. ఎడిటింగ్ పూర్తయ్యాక షో చూసిన ప్రియాంక, దీనికి తనవంతు పూర్తి మద్దతు అందించేందుకు ముందుకు వచ్చారన్నారు. అత్యున్నత నిర్మాణ విలువలతో రూపుదిద్దుకున్న `హుంకార్` వెబ్ సిరీస్ ప్రస్తుతం జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
