Begin typing your search above and press return to search.

హృతిక్ కెరీర్‌ పై అనుమానాలెందుకు? అదే కారణమా?

సరైన సినిమా పడితే బాక్సాఫీస్‌ ను షేక్ చేసే సత్తా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సొంతమని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

By:  M Prashanth   |   6 July 2026 10:23 AM IST
హృతిక్ కెరీర్‌ పై అనుమానాలెందుకు? అదే కారణమా?
X

సరైన సినిమా పడితే బాక్సాఫీస్‌ ను షేక్ చేసే సత్తా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సొంతమని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. అయితే ఇప్పుడు హృతిక్ కెరీర్‌ కు సంబంధించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయనకు కథలు చెబుతున్న దర్శకులే కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతం పలువురు తెలుగు, తమిళ, కన్నడ దర్శకులు హృతిక్ తో సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇందులో పెద్దగా ఆశ్చర్యం లేకపోయినా.. హృతిక్‌ కు కథలు చెప్పిన వారిలో ఇటీవల ఫ్లాపులు ఎదుర్కొన్న దర్శకులు ఉన్నారనే ప్రచారమే కొత్త చర్చకు దారితీసింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. తమ గత చిత్రాలతో నిరాశపరిచిన నలుగురు దర్శకులు హృతిక్‌ కు కథలు వినిపించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అసలు హృతిక్ ప్లాన్ ఏంటి? ఆయన నిజంగానే ఆ దర్శకులతో సినిమాలు చేయాలని అనుకుంటున్నారా? లేక అందరి కథలు విని చివరకు తనకు నచ్చిన ప్రాజెక్టును ఎంపిక చేసుకోవాలనుకుంటున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

నిజానికి హృతిక్ రేంజ్ కు దర్శకుల నుంచి కథలు రావడం సాధారణమే. స్టార్ హీరోలు ఒకేసారి పదుల సంఖ్యలో కథలు వింటుంటారు. అందులో ఒకటి లేదా రెండు మాత్రమే సినిమాలుగా మారుతాయి. కాబట్టి కథలు విన్నంత మాత్రాన ఆయా దర్శకులతో హృతిక్ సినిమాలు ఖరారైనట్లు కాదు. అయితే ఇక్కడ హృతిక్ అభిమానుల ఆందోళన మరోలా ఉంది. ఆయన స్థాయి స్టార్ హీరో కెరీర్‌ లో ప్రతి సినిమా కీలకమే.

ఇప్పుడు ఆయన ఒక భారీ విజయం సాధిస్తే వచ్చే క్రేజ్ ఎంత ఉంటుందో.. వరుసగా సినిమాలు ఫ్లాప్ అయితే మార్కెట్‌ పై పడే ఎఫెక్ట్ కూడా అంతే ఉంటుంది. అందుకే హృతిక్ తన నెక్స్ట్ ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఒక దర్శకుడి గత సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన అతడిలో టాలెంట్ లేదని చెప్పలేం. ఫ్లాపుల తర్వాత భారీ విజయాలు అందుకున్న దర్శకులు చాలామందే ఉన్నారు.

ఒక్క సరైన కథ, సరైన హీరో కాంబో మొత్తం లెక్కలను మార్చేయగలదు. బహుశా హృతిక్ కూడా దర్శకుల గత రిజల్ట్స్ కంటే వారు చెప్పే కథలకే ప్రాధాన్యం ఇస్తుండవచ్చు. అదే సమయంలో సౌత్ దర్శకులకు బాలీవుడ్‌ లో పెరిగిన డిమాండ్‌ కూడా పరిగణనలోకి తీసుకోవాలి. పాన్ ఇండియా రేంజ్ లో సౌత్ సినిమాలు సత్తా చాటడంతో బాలీవుడ్ స్టార్లు సైతం సౌత్ దర్శకులతో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. హృతిక్ కూడా అదే దిశగా ఆలోచిస్తున్నారా? అనే డౌట్లు ఉన్నాయి.

అందుకే హృతిక్ రోషన్ కెరీర్ డౌన్‌ ఫాల్ మొదలైందని ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుంది. కానీ ఆయనకు కథలు చెబుతున్న దర్శకుల విషయంలో జరుగుతున్న ప్రచారం మాత్రం అభిమానుల్లో అనుమానాలు పెంచుతోంది. కథలు వినడం వరకు ఓకే.. కానీ చివరకు ఎలాంటి కథను, ఏ దర్శకుడిని ఎంపిక చేసుకుంటారన్నదే కీలకం. ఒక్క సరైన నిర్ణయం హృతిక్‌ ను మరో రేంజ్ కు తీసుకెళ్లగలదు. తేడా వస్తే మాత్రం కెరీర్‌పై కొత్త ప్రశ్నలు రావడం ఖాయం.