సలార్ మేకర్స్ తో హృతిక్ తొలి సౌత్ మూవీ.. వర్కౌట్ అవుతుందా?
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ వరకు ప్రతి ఒక్కరు పాన్ ఇండియా మూవీల పైన దృష్టి పెడుతున్న విషయం తెలిసిందే.
By: Madhu Reddy | 1 Sept 2025 6:00 PM ISTఈ మధ్యకాలంలో టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ వరకు ప్రతి ఒక్కరు పాన్ ఇండియా మూవీల పైన దృష్టి పెడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా ప్రతి హీరో కూడా సొంత గూటిని వదిలి వివిధ భాషలలో నేరుగా సినిమాలు చేసి సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ లో సత్తా చాటే ప్రయత్నం చేయగా.. అటు బాలీవుడ్, కోలీవుడ్ , మాలీవుడ్ , శాండిల్ వుడ్ హీరోలు కూడా తెలుగులో సినిమాలు చేస్తూ తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు బాలీవుడ్ హీరోలు సౌత్ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు..
సౌత్ బాట పట్టిన హృతిక్ రోషన్..
ఈ క్రమంలోనే ఇప్పుడు బాలీవుడ్ గ్రీక్ గాడ్ గా పేరు సొంతం చేసుకున్న హృతిక్ రోషన్ కూడా నేరుగా సౌత్ లో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. మరి ఏ జానర్ లో ఆయన సినిమా చేస్తున్నారు? నిర్మాత ఎవరు? దర్శకుడు ఎవరు? అసలు ఈ సినిమా కథ ఏంటి? ఏ మేరకు వర్కౌట్ అవుతుంది ? ఇలా పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కి తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. దీనికి తోడు ఈ ఏడాది ఆగస్టు 14న విడుదలైన 'వార్ 2' సినిమాతో మరింత చేరువయ్యారు. అంతేకాదు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో నిర్వహించగా.. అందులో ఆయన తెలుగు ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన మాటలకు చాలామంది ఫిదా అయిపోయారు.ఇక ఇప్పుడు హృతిక్ రోషన్ ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ అయిన హోం భలే ఫిలిమ్స్ బ్యానర్ పై తన కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సెన్సేషనల్ కాంబినేషన్ ఎప్పుడు ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ బయటకు రావడం గమనార్హం.
హోంభలే ఫిలిమ్స్ బ్యానర్ పై హృతిక్ రోషన్ నటిస్తున్న ఈ చిత్రం ఒక మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత నిజం అనేది తెలియదు కానీ హృతిక్ రోషన్ నుంచి వస్తున్న మొదటి స్ట్రెయిట్ సౌత్ మూవీ కావడంతో అంచనాలు మాత్రం భారీగానే పెరిగిపోయాయి. ఇప్పటికే కేజిఎఫ్, సలార్ చిత్రాలతో హోం భలే ఫిలిమ్స్ సంస్థ భారీ విజయాన్ని , పేరును దక్కించుకుంది. ఇప్పుడు ఇలాంటి నిర్మాణ సంస్థతో హృతిక్ చేతులు కలిపారు అంటే కచ్చితంగా ఈ సినిమా మరో పాన్ ఇండియా సక్సెస్ అవుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి హృతిక్ రోషన్ కి సౌత్ డెబ్యూ మూవీ ఏ విధంగా వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.
హృతిక్ రోషన్ సినిమాలు..
తన తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన 'కహో నా ప్యార్ హై' అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టిన ఈయన.. ఈ సినిమా కంటే ముందు బాల నటుడిగా కూడా ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. కహో నా ప్యార్ హై సినిమాతో ఉత్తమ నటుడు విభాగంలో ఫిలింఫేర్ అవార్డు అందుకోవడం జరిగింది. తన నటనతో విలక్షణమైన నటుడిగా పేరు సొంతం చేసుకున్న హృతిక్ ఆరు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. క్రిష్ , ధూమ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.
