Begin typing your search above and press return to search.

అన్నీ తెలుసుకున్నాక.. హృతిక్‌కు వచ్చిన ఆలోచన!

ఏళ్ల తరబడి జ్ఞానం, స్పష్టత కోసం పరుగులు పెడతాం. చివరకు ఏమీ తెలియకుండా ఉండటంలోనే ఆనందం ఉందని అర్థమవుతుందంటూ హృతిక్ తెలిపారు.

By:  M Prashanth   |   30 Oct 2026 2:58 PM IST
అన్నీ తెలుసుకున్నాక.. హృతిక్‌కు వచ్చిన ఆలోచన!
X

బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ అంటే కష్టపడి పనిచేసే హీరోగా పేరుంది. పాత్ర కోసం లుక్ మార్చుకోవడం, డ్యాన్స్‌లో పర్ఫెక్షన్ కోసం గంటల తరబడి సాధన చేయడం ఆయనకు అలవాటు. అలాంటి హృతిక్ ఇప్పుడు సినిమా గురించి కాకుండా జీవితం గురించి ఓ ఆసక్తికరమైన వివరణ ఇచ్చాడు. మనిషి ఎంత తెలివి సంపాదించినా, చివరకు ఆనందం కోసం మళ్లీ వెనక్కి వెళ్లాల్సి వస్తుందనే భావనను పంచుకున్నారు.

ఏళ్ల తరబడి జ్ఞానం, స్పష్టత కోసం పరుగులు పెడతాం. చివరకు ఏమీ తెలియకుండా ఉండటంలోనే ఆనందం ఉందని అర్థమవుతుందంటూ హృతిక్ తెలిపారు. ఈ ప్రపంచం అమాయకులదేనేమోనని కూడా వ్యాఖ్యానించారు. అయితే ఆయన చెప్పింది నిజంగా తెలివి లేకుండా ఉండాలని కాదు. అన్నింటినీ అర్థం చేసుకోవాలనే తాపత్రయం నుంచి కొన్నిసార్లు బయటపడాలని చెప్పే ప్రయత్నం చేశారు.

సాధారణంగా వయసు పెరిగేకొద్దీ అనుభవంతో పాటు ఆలోచనలు కూడా పెరుగుతాయి. ప్రతి మాట వెనుక కారణం వెతకడం, ప్రతి నిర్ణయం వల్ల ఏం జరుగుతుందో ముందే ఊహించుకోవడం మొదలవుతుంది. ఇందులో ఉపయోగం ఉన్నా చిన్న విషయాలను కూడా అనవసరంగా కన్ఫ్యూజ్ చేసుకునే అవకాశం ఉంది. హృతిక్ పోస్టులో కనిపిస్తున్న వైరుధ్యం కూడా ఇదే. ఎక్కువ తెలుసుకున్న తర్వాత మళ్లీ సింపుల్‌గా ఉండాలని అనిపించడం.

ఇక హృతిక్ మరో ఆసక్తికరమైన మాట కూడా చెప్పారు. జ్ఞానానికి లేదా ఆధ్యాత్మికతకు చివరి మెట్టు, తెలిసిన ప్రపంచం నుంచి కావాలనే ఒక అడుగు వెనక్కి వేయడమే కావచ్చన్నారు. అంటే నేర్చుకున్న విషయాలను మర్చిపోవడం కాదు. అవసరమైనప్పుడు ఆలోచనలను పక్కనపెట్టి సరదాగా ఉండగలగడం. అందుకే మళ్లీ అమాయకుడిగా మారాలని తన పోస్టులో పేర్కొన్నారు.

హృతిక్ లాంటి స్టార్ నుంచి ఇలాంటి పోస్టు రావడంతో దాన్ని సినిమాలకు ముడిపెట్టే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఆయన తన సందేశంలో ఏ సినిమా పేరు గానీ, వ్యక్తి పేరు గానీ ప్రస్తావించలేదు. ఎవరికీ కౌంటర్ ఇవ్వలేదు. ఒక సెల్ఫీతో పాటు తనకు వచ్చిన ఆలోచనను పంచుకున్నారు. చివర్లో గుడ్ మార్నింగ్ అంటూ సూర్యుడి ఎమోజీ జోడించారు.

నిజానికి హృతిక్ కెరీర్‌లో విభిన్నమైన పాత్రలు కనిపిస్తాయి. 'కోయి మిల్ గయా'లో అమాయకమైన రోహిత్‌గా, 'సూపర్ 30'లో ఉపాధ్యాయుడిగా నటించారు. పాత్ర కోసం పూర్తిగా మారిపోయే హృతిక్ నిజజీవితంలో కూడా ఇంత లోతుగా ఆలోచించడం ఆసక్తికరమే. అయితే ఆయన పోస్టులో ఉపయోగించిన 'ఫూల్' అనే పదాన్ని కొందరు మరోలా అర్థం చేసుకునే అవకాశం ఉంది. తెలివితక్కువగా ప్రవర్తించడం కంటే, అన్నింటినీ సీరియస్‌గా తీసుకోకుండా కొన్నిసార్లు జీవితాన్ని సరదాగా గడపాలనే భావన ఆయన మాటల్లో కనిపిస్తోంది.