ఎమోషనల్ అచీవ్మెంట్: అప్పుడు చిన్నపిల్లాడిగా.. ఇప్పుడు స్టార్ హీరోగా..
స్టార్ హీరోల్లో చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులుగా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత హీరోలుగా ఎదిగిన వారు ఉన్నారు.
By: M Prashanth | 12 Jun 2026 12:10 AM ISTస్టార్ హీరోల్లో చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులుగా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత హీరోలుగా ఎదిగిన వారు ఉన్నారు. అయితే ఓ స్టార్ హీరో సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేసి.. దాదాపు 40 ఏళ్ల తర్వాత అదే హీరో సినిమాలో కీలక పాత్రలో కనిపించే అవకాశం రావడం మాత్రం చాలా అరుదు. ఇప్పుడు అలాంటి ఓ ఎమోషనల్ మూమెంట్ సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. 1986లో రజనీకాంత్ నటించిన భగవాన్ దాదా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్.. ఇప్పుడు రజనీకాంత్ జైలర్ 2లో క్యామియో రోల్ లో కనిపించబోతున్నారనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ 2 షూటింగ్ తో బిజీగా ఉన్నారు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఆ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ సాధించిన ఘన విజయంతో సీక్వెల్ ను మరింత భారీ స్థాయిలో రూపొందించే పనిలో మూవీ టీమ్ ఉంది. ఈ నేపథ్యంలో పలువురు స్టార్ హీరోలు క్యామియో పాత్రల్లో కనిపించబోతున్నారనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది.
తాజా సమాచారం ప్రకారం, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఆ చిత్రంలో కీలకమైన స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆ రోల్ లో కోసం మొదట స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ను సంప్రదించినట్లు టాక్ వినిపించింది. అయితే కింగ్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉండటంతో ఆయన ఆ ప్రాజెక్ట్ కు దూరమైనట్లు టాక్. దీంతో ఆ పాత్రకు హృతిక్ రోషన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
జూన్ 22,23 తేదీల్లో చెన్నైలో హృతిక్ కు సంబంధించిన సీన్స్ చిత్రీకరణ జరగనున్నట్లు సమాచారం. ఇది కేవలం వచ్చి వెళ్లే పాత్ర కాదని, కథలో కీలక మలుపు తీసుకొచ్చే రోల్ గా ఉంటుందని తెలుస్తోంది. రజనీకాంత్ పోషిస్తున్న టైగర్ ముత్తువేల్ పాండియన్ పాత్రకు సహాయం చేసే సమయంలో హృతిక్ పాత్ర ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరుగుతోంది. ఆ పాత్ర కోసం హృతిక్ కు పూర్తిగా కొత్త లుక్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
అయితే ఆ వార్తలో అభిమానులను ఎక్కువగా ఎమోషనల్ చేసే ఎలిమెంట్ భగవాన్ దాదా మెమోరీ. ఆ సినిమాలో రజనీకాంత్ పక్కన చిన్నపిల్లాడిగా కనిపించిన హృతిక్.. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగి మళ్లీ అదే రజనీతో స్క్రీన్ పంచుకోబోతుండటం విశేషంగా మారింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా రజనీకాంత్ తనపై ఎంత ఆప్యాయంగా ఉండేవారో హృతిక్ గుర్తు చేసుకున్నారు.
ఇక జైలర్ 2లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ తో పాటు పలువురు నటులు కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఆ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఏదేమైనా చిన్నపిల్లాడిగా రజనీకాంత్ పక్కన నటించిన హృతిక్, ఇప్పుడు స్టార్ హీరోగా అదే సూపర్ స్టార్ తో మరోసారి ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారనే వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ క్రేజీ కాంబినేషన్ నిజమైతే.. జైలర్ 2 పాన్ ఇండియా రేంజ్ లో మరింత సంచలనం సృష్టించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
