Begin typing your search above and press return to search.

బ‌డ్జెట్ స‌ర్ధ‌లేక డైల‌మా! 'క్రిష్ 4'పై 'వార్ 2' ఎఫెక్ట్?

`సయ్యారా` లాంటి చిన్న బ‌డ్జెట్ సినిమా దాదాపు 300కోట్ల నెట్ వ‌సూలు చేసింది. భార‌త‌దేశంలో 1000 కోట్ల క్ల‌బ్ అనేది ఇప్పుడు క‌ష్ట‌మేమీ కాదు.

By:  Sivaji Kontham   |   8 Feb 2026 10:56 AM IST
బ‌డ్జెట్ స‌ర్ధ‌లేక డైల‌మా! క్రిష్ 4పై వార్ 2 ఎఫెక్ట్?
X

`సయ్యారా` లాంటి చిన్న బ‌డ్జెట్ సినిమా దాదాపు 300కోట్ల నెట్ వ‌సూలు చేసింది. భార‌త‌దేశంలో 1000 కోట్ల క్ల‌బ్ అనేది ఇప్పుడు క‌ష్ట‌మేమీ కాదు. ఇటీవ‌ల విడుద‌లైన `దురంధ‌ర్` 1000 కోట్ల నెట్ వ‌సూళ్ల‌తో సంచ‌ల‌నం సృష్టించింది. కేవ‌లం హిందీ బెల్ట్ నుంచి ఇంత పెద్ద మొత్తం వ‌సూలు చేసింద‌ని నిర్మాత‌లు చెబుతున్నారు. ఈ ఫ‌లితం చూశాక, భార‌త‌దేశం నుంచి 2000 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించ‌డం క‌ష్ట‌మేమీ కాద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. స‌రైన కంటెంట్, స్టార్ ప‌వ‌ర్ తో పాటు భారీ విజువ‌ల్ గ్రాఫిక్స్ ఉన్న సినిమాల‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌రథం ప‌డ‌తార‌ని అంచ‌నా వేస్తున్నారు.

అయితే ఇలాంటి స‌మ‌యంలో కూడా య‌ష్ రాజ్ ఫిలింస్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఓ క్రేజీ సీక్వెల్ విష‌యంలో వెన‌క్కి త‌గ్గ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తాజా స‌మాచారం మేర‌కు క్రిష్ 4 బ‌డ్జెట్ విష‌యంలో య‌ష్ రాజ్ ఫిలింస్ ఆదిత్యా చోప్రాతో హృతిక్ రోష‌న్ వాగ్వాదానికి దిగారని గుస‌గుస వినిపిస్తోంది. హృతిక్ 500 కోట్ల బ‌డ్జెట్ అడుగుతుంటే, ఆదిత్య చోప్రా 250 కోట్ల బ‌డ్జెట్లో సినిమా తీయాల‌ని సూచించార‌ట‌. ఒక డెబ్యూ ద‌ర్శ‌కుడిని న‌మ్మి 500 కోట్లు పెట్ట‌డం స‌రైన‌దేనా? అనే సందేహం ఆదిత్యాకు ఉంది. అదే స‌మ‌యంలో వార్ 2 ఫ‌లితం కూడా క్రిష్ 4 బ‌డ్జెట్ మ్యాట‌ర్ లో ప్ర‌తికూలంగా ప‌ని చేస్తోంద‌ని చెబుతున్నారు.

కార‌ణం ఏదైనా హృతిక్ రోషన్ డ్రీమ్ ప్రాజెక్ట్ `క్రిష్ 4` ప్ర‌స్తుతానికి వాయిదా పడింద‌ని చెబుతున్నారు. బ‌డ్జెట్ మ్యాట‌ర్ లో ఆదిత్య చోప్రా దిగి రావ‌డం లేద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతానికి బ‌డ్జెట్ లెక్క‌లు తేల‌డం లేదు. కానీ హృతిక్ ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయి హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలకు ధీటుగా తెరకెక్కించాలని, క్రిష్ ఫ్రాంఛైజీలోని గ‌త చిత్రాల‌ను మించి విజువ‌ల్ వండ‌ర్ ని తీయాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉన్నార‌ట‌. ఇందుకోసం సుమారు 500 కోట్లు బడ్జెట్ అవసరమని ఆయన పట్టుబడుతున్నారు. ముఖ్యంగా గ్రాఫిక్స్ (VFX), యాక్షన్ సీక్వెన్సుల కోసం భారీ ఖర్చు చేయాల్సి ఉంటుంద‌ని ఆదిత్య చోప్రాకు చెప్పార‌ట‌. మరోవైపు, నిర్మాత ఆదిత్య చోప్రా ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఈ సినిమా బడ్జెట్‌ను 250 కోట్లకు పరిమితం చేయాలని సూచిస్తున్నారు. అయితే బ‌డ్జెట్ మ్యాట‌ర్ లో ఎవ‌రూ త‌గ్గ‌డం లేదు. వీరిద్దరి మధ్య తీవ్రస్థాయి వాగ్వాదం జరగకపోయినా, అభిప్రాయ భేదాల వల్ల సినిమాను ప్రస్తుతానికి పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

డెబ్యూ దర్శకుడికి 500 కోట్లు ఇవ్వడం సరైనదేనా?

అయితే క్రిష్ 4 తో హృతిక్ రోష‌న్ ద‌ర్శ‌కుడిగా ఆరంగేట్రం చేయాల‌ని భావిస్తున్నారు. అయితే ఒక డెబ్యూ ద‌ర్శ‌కుడిని న‌మ్మి అన్ని కోట్లు పెట్టుబ‌డి పెట్ట‌డం ఎలా అనేది స‌స్పెన్స్ . ఆదిత్య చోప్రా దీనిపై సీరియ‌స్ గానే ఆలోచిస్తున్న‌ట్టు క‌థ‌నాలొస్తున్నాయి. అయితే హృతిక్ వైపు ఆలోచిస్తే `క్రిష్` అనేది ఒక పెద్ద బ్రాండ్. దాన్ని సరిగ్గా ప్రెజెంట్ చేయకపోతే ప్రేక్షకులు నిరాశ చెందుతారు. కాబట్టి నాణ్యత కోసం ఎక్కువ బడ్జెట్ అడగడంలో తప్పు లేదని విశ్లేషిస్తున్నారు. ఒక నిర్మాత‌గా ఆదిత్య చోప్రా వైపు చూస్తే.. సినిమా లాభాల్లోకి రావాలంటే బడ్జెట్ కంట్రోల్‌లో ఉండాలి. `వార్ 2` వంటి సినిమాలతో భారీ న‌ష్టాలు వ‌చ్చాయి క‌దా! అందువ‌ల్ల హృతిక్ రోష‌న్ తో బ్యాక్ టు బ్యాక్ ప్ర‌యోగాలు చేయ‌లేమ‌ని కూడా అత‌డు భావిస్తున్నాడ‌ట‌. ముఖ్యంగా అత‌డు త‌న మొదటి చిత్రానికే ఏకంగా 500 కోట్లు అడ‌గ‌డంతో దీనిపై ఆదిత్య చోప్రా వెన‌కాడేసారు.

తాజా స‌మాచారం మేర‌కు హృతిక్ ప్ర‌స్తుతానికి క్రిష్ 4 ని ప‌క్క‌న పెట్టేయ‌లేదు కానీ, స్క్రిప్టు ని బ‌డ్జెట్ కి అనుగుణంగా మార్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆదిత్యా చోప్రా సూచ‌న‌ల‌ను పాటిస్తూ, అన‌వ‌స‌ర‌మైన గ్రాండియారిటీ ఖ‌ర్చుల‌ను కూడా ట్రిమ్ చేస్తున్నార‌ట‌. ఇంత‌లోనే అత‌డు మ‌రో ప్రాజెక్టుకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల‌ని కూడా భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

రాకేష్ రోషన్ 1000 కోట్ల బడ్జెట్ రూమర్స్

నిజానికి క్రిష్ 4 కోసం ఫ్రాంఛైజీ నిర్మాత రాకేష్ రోష‌న్ ఏకంగా 1000 కోట్ల బ‌డ్జెట్ కావాల‌ని ఎదురు చూసిన‌ట్టు క‌థ‌నాలొచ్చాయి. హాలీవుడ్ నుంచి భారీ విజువ‌ల్ గ్రాఫిక్స్ ఉన్న సినిమాల‌కు ధీటుగా తెర‌కెక్కించ‌క‌పోతే పోటీలో నెగ్గుకు రావ‌డం క‌ష్ట‌మ‌ని ఆయ‌న భావించిన‌ట్టు బాలీవుడ్ హంగామా పేర్కొంది. అయితే అప్ప‌ట్లో ఓ ఇంట‌ర్వ్యూలో ఈ ప్రాజెక్టుతో ముడిప‌డిన స‌వాళ్ల గురించి ఆదిత్య చోప్రా ఓపెన్ గా మాట్లాడారు. సినిమా ఆగిపోలేదు. స్క్రిప్టు ప‌నుల‌తో పాటు బడ్జెట్ మ్యాట‌ర్స్ పై చ‌ర్చిస్తున్నామ‌ని తెలిపారు. పెద్ద బ‌డ్జెట్ పెట్టే ప్ర‌ముఖుడి కోసం ఎదురు చూస్తున్నామ‌ని కూడా తెలిపారు.

గతంలో ఈ సినిమా బడ్జెట్ 700కోట్ల‌ నుండి 1000 కోట్ల వరకు ఉంటుందని సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయి. కానీ అధికారికంగా రాకేష్ రోషన్ ఎప్పుడూ ఆ అంకెను ధృవీకరించలేదు. అయితే సినిమాను గ్రాండ్‌గా తీయాలనేది ఆయన డ్రీమ్ అని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఈ ప్రాజెక్ట్‌లో నిర్మాతగా మరియు పర్యవేక్షకుడిగా మాత్రమే ఉంటున్నారు..దర్శకత్వ బాధ్యతలు హృతిక్ తీసుకున్నారు.

ప్రస్తుతం ఏం జరుగుతోంది?

మొత్తానికి బ‌డ్జెట్ ప‌ర‌మైన‌ అడ్డంకుల వల్ల క్రిష్ 4 షూటింగ్ 2026 మధ్యలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విడుదల 2027 కి వాయిదా పడొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. మొత్తానికి, క్రిష్ 4 విషయంలో బడ్జెట్ యుద్ధం నడుస్తోంది. హృతిక్ తన మొండి పట్టు వీడతారా లేక ఆదిత్య చోప్రా బడ్జెట్ పెంచుతారా అనేది చూడాలి.