టాప్ స్టోరీ:టాలెంట్‌కి నిజంగా అవకాశం లభిస్తోందా?
ఇండస్ట్రీలో కొత్త టాలెంట్‌కు పెద్ద పీట వేస్తాం. మంచి కథలు, ఆసక్తిని రేకెత్తించే ఇన్నోవేటివ్ థాట్స్‌తో వచ్చే వారికి పరిశ్రమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.
By: Ravindar Gorantla | 10 March 2026 3:59 PM ISTఇండస్ట్రీలో కొత్త టాలెంట్‌కు పెద్ద పీట వేస్తాం. మంచి కథలు, ఆసక్తిని రేకెత్తించే ఇన్నోవేటివ్ థాట్స్‌తో వచ్చే వారికి పరిశ్రమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. కొత్త రక్తం ప్రవేశిస్తేనే మంచి సినిమాలొస్తాయి. మంచి మంచి కథలు తెరపై ఆవిష్కృతమవుతాయి.. నిత్యం ఇండస్ట్రీలో వినిపించే మాటలివి. క్షేత్ర స్థాయిలో ఇదే పరిస్థితి ఉందా? అంటే లేదు. ఇక్కడ పరిచయాలు, ఇండస్ట్రీ సర్కిల్ లేకుంటే టాలెంట్ ఉన్నా జీరోలే. కింది నుంచి వచ్చామని చెప్పిన వాళ్లు కూడా ఓ వర్గం లేదా పేరున్న నేపథ్యం ఉన్న వాళ్ల అండతో ఎదిగిన వాళ్లే కానీ టాలెంట్ ఉంది కదా అని ఇక్కడ స్టార్ డైరెక్టర్లు అయిపోలేదు.
చిన్న సినిమా చేయాలన్నా మంచి కథ ఉంటే సరిపోదు. దాన్ని నమ్మో ప్రొడ్యూసర్ ఉండాలి. అలా ప్రొడ్యూసర్ ఉండాలంటే నీకు ఇండస్ట్రీలో తెలిసిన వాళ్లు ఉండాలి. అలా ఉన్నప్పుడే సినిమా కార్యరూపం దాలుస్తుంది. లేదంటే ఎంత టీలెంట్ ఉన్నా.. నువ్వు రెడీ చేసిన స్టోరీ ఎంత గొప్పది అయినా ఇక్కడ పట్టించుకునే వారే ఉండరు. రీసెంట్‌గా ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో చిన్న సినిమాలకు అవార్డులు దక్కడం తెలిసిందే. అవి తెరపైకి రావడానికి, కార్యరూపం దాల్చడానికి పరిచయాలే ప్రధాన పాత్ర పోషించాయి. టాలెంట్ అన్నది తరువాత పని చేసిందే కానీ ముందు పనికొచ్చింది మాత్రం పరిచయాలే.
రాజమౌళి డైరెక్టర్ కావడానికి చాలా కారణాలున్నాయి. తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్టార్ రైటర్, అన్న కీరవాణి ప్రముఖ సంగీత దర్శకుడు. వీరిద్దరి వళ్లే రాఘవేంద్రరావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసే అవకాశం లభించింది. ఆ తరువాత అదే టీవీ సీరియల్ `శాంతి నివాసం`కు డైరెక్టర్ అయ్యేలా చేసింది. అక్కడ తనలోని టాలెంట్ గమనించిన రాఘవేంద్రరావు `స్టూడెంట్ నెం.1`తో జక్కన్నని డైరెక్టర్‌ని చేయడం ఆ తరువాత తను పాన్ ఇండియా డైరెక్టర్‌లలో టాప్‌లో చేరడం తెలిసిందే.
`పుష్ప2`తో సంచలనం సృష్టించిన సుకుమార్ కూడా అంత ఊజీగా డైరెక్టర్ కాలేదు. లెక్చరర్‌గా పని చేస్తూ సినిమాలపై ఆసక్తితో ఓ ఫేమస్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా దిల్ రాజు క్యాంపస్‌లో చేరి `దిల్` సినిమాకు డైలాగ్‌లు అందించి ఇంప్రెస్ చేయడంతో `ఆర్య` మూవీతో డైరెక్టర్ అయ్యారు. ఆ తరువాత ఆయన ప్రయాణం పాన్ ఇండియా వరకు ఎలా సాగిందో అందరికి తెలిసిందే. సంచలన డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సందీప్‌రెడ్డి వంగది మరో స్టోరీ. మెడిసిన్ పూర్తి చేసి సినిమాలపై ప్యాషన్‌తో ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన కేడీ, మళ్లి మళ్లీ ఇది రాని రోజు సినిమాలకు డైరెక్షన్ డిపార్ట్ మెంట్‌లో వర్క్ చేయడం..డైరెక్టర్ కావాలని `అర్జున్ రెడ్డి` స్టోరీ పట్టుకుని ఎంత మంది చుట్టూ తిరిగినా ఎవరూ తనని నమ్మకపోవడంతో తన ఫాదర్, అన్నల సహాయంతో సాహసం చేసి కల్ట్ డైరెక్టర్ అనిపించుకున్నాడు.
వంశీ పైడిపల్లి డైరెక్ట్ కావడానికి కారణం దిల్‌తో ఉన్న రాజు పరిచయం. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడే బీఎం డబ్ల్యూ కార్‌లో సెట్‌లోకి వచ్చిన రికార్డ్ వంశీ పైడిపల్లిది. అలా దిల్ రాజుతో ఉన్న పరిచయం, స్వతహాగా రిచ్ కావడంతో ఊజీగా డైరెక్టర్ అయ్యాడు. వీళ్లలా ఇండస్ట్రీలోకి ప్రవేశించాలంటే చాలా మంది చెబుతున్నట్టు టాలెంట్ ఉంటే ఇక్కడ సరిపోదు. ఎవరూ పట్టించుకోరు కూడా. డైరెక్టర్ కావాలంటే ముందు ఉండాల్సింది ఇక్కడ టాలెంట్ కాదు.. పది మందితో పరిచయాలు. అవే అవకాశాల్ని తెచ్చి పెడతాయి. అంత వరకు ఎందుకు నానితో `ది ప్యారడైజ్` సినిమా చేస్తున్న శ్రీకాంత్ ఓదెల ఇప్పడు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడంటే కారణం సుకుమార్.
తనని ఒప్పించి తన వద్ద డైరెక్షన్ శాఖలో చేరి తన టాలెంట్ నిరూపించుకోవడం వల్లే పాన్ ఇండియా సినిమాలు చాలా ఈజీగా చేస్తున్నాడు. వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు సెట్ చేసుకుంటున్నాడు. మా దగ్గర టాలెంట్ ఉంది.. అది తెలిస్తే ఈజీగా అవకాశాలు వచ్చేస్తాయి అనుకునే వాకిరి ఇక్కడ ఎన్నేళ్లు తిరిగినా అవకాశాలు దొరకవు. ఓటీటీలు కూడా రిఫరెన్స్ ఉంటే తప్ప ఒరిజినల్స్‌కి అవకాశాలు ఇవ్వడం లేదు అంటే పరిస్థితి ఎలా ఉందన్నది అర్థం చేసుకోవచ్చు. పేరుకు మాత్రమే టాలెంట్ కు అవకాశాలిస్తామని చెబుతారే కానీ పరిచయాలు, బ్యాగ్రౌండ్ కే ఇక్కడ ప్రాధాన్యత. ఈ విషయాన్ని ఇండస్ట్రీలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకుని కెరీర్‌ని ప్లాన్ చేసుకుంటే మంచిది అనే టాక్ వినిపిస్తోంది.
