Begin typing your search above and press return to search.

బన్నీ మూవీ వల్ల 'అఖండ' లేట్ అయిందా?

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో నటించిన అఖండ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

By:  M Prashanth   |   3 Dec 2025 10:38 AM IST
బన్నీ మూవీ వల్ల అఖండ లేట్ అయిందా?
X

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో నటించిన అఖండ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఆ సినిమా.. ఎవరూ ఊహించని రీతిలో అందరినీ అలరించింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి.. సినీ ప్రియులను, అభిమానులను తెగ మెప్పించింది.

ముఖ్యంగా కోవిడ్ పాండమిక్ టైమ్ లో విడుదల అయిన అఖండ మూవీ.. తెలుగు సినిమాకు తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చిందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఎందుకంటే వైరస్ వల్ల లాక్ డౌన్ విధించడం, థియేటర్స్ మూతపడడం, షూటింగ్స్ ఆగిపోవడంతోపాటు ఎన్నో ఇబ్బందులు.. టాలీవుడ్ ఇండస్ట్రీకి కరోనా వల్ల వచ్చాయి.

అలాంటి టైమ్ లో థియేటర్స్ లోకి వచ్చిన అఖండ.. ఓ ఊపు ఊపేసింది. బాలయ్య కెరీర్ లో కూడా భారీ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అయితే ఆ సినిమా అప్పుడు రావాల్సిన మూవీ కాదట. అంతకుముందే తెరకెక్కించాల్సి ఉందట. కానీ అల్లు అర్జున్ నటించిన ఓ మూవీ వల్ల అఖండ లేట్ అయిందని ఇప్పుడు బోయపాటి శ్రీను తెలిపారు.

ప్రస్తుతం ఆయన బాలయ్యతో అఖండ-2 తెరకెక్కిస్తుండగా.. ఆ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను అఖండ మూవీని.. బాలయ్య కెరీర్ లో ల్యాండ్ మార్క్ 100వ సినిమాగా తీయాలని ముందు నుంచి ప్లాన్ చేశానని బోయపాటి శ్రీను తెలిపారు.

తీరా చూస్తే.. బాలయ్య 99వ సినిమా డిక్టేటర్ పూర్తి అయ్యే సమయంలో తాను సరైనోడు సినిమాతో బిజీగా ఉన్నానని తెలిపారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆ సినిమా 2016లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. దీంతో నటసింహం ల్యాండ్ మార్క్ మూవీగా తీసే ఛాన్స్ ను మిస్ చేసుకున్నానని బోయపాటి వెల్లడించారు.

ఆ తర్వాత తాను.. బాలయ్యను అఘోరగా పెట్టి సినిమా చేయాలనుకుంటున్నట్లు ఆయనకు చెప్పినట్లు పేర్కొన్నారు. వెంటనే ఆయన ఓకే చేయగా.. అప్పుడు అఖండ జర్నీ స్టార్ట్ అయిందని వెల్లడించారు. అలా బన్నీ మూవీతో బోయపాటి బిజీగా ఉండటం వల్ల బాలయ్య 100వ సినిమాగా అఖండ రాలేదు. అయితే నటసింహం ఆ ల్యాండ్ మార్క్ చిత్రంగా గౌతమీ పుత్ర శాతకర్ణి రూపొందిన సంగతి అందరికీ తెలిసిందే.