గ్లింప్స్: 'ఈషా' దెయ్యం.. ఈ కథేంటీ?
హార్రర్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. కథలో విషయం ఉండి, టెక్నికల్ గా భయపెట్టగలిగితే బాక్సాఫీస్ దగ్గర సేఫ్ అవ్వడం పెద్ద కష్టమేమీ కాదు.
By: M Prashanth | 4 Dec 2025 5:04 PM ISTహార్రర్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. కథలో విషయం ఉండి, టెక్నికల్ గా భయపెట్టగలిగితే బాక్సాఫీస్ దగ్గర సేఫ్ అవ్వడం పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పుడు అదే కోవలో 'ఈషా' అనే కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ వీడియో చూస్తుంటే, రొటీన్ హార్రర్ సినిమాల్లా కాకుండా ఏదో ఇంట్రెస్టింగ్ పాయింట్ తోనే వస్తున్నట్లు అనిపిస్తోంది. మేకర్స్ కట్ చేసిన విధానం ఆసక్తిని రేపుతోంది.
గ్లింప్స్ ప్రారంభమే చాలా ఆసక్తికరంగా ఉంది. స్కూల్ పిల్లలు నడుచుకుంటూ వెళ్తుండగా, ఒక అమ్మాయి "మా పక్కింటి గ్రాండ్ మా వాళ్లకు తెలిసిన ఒక అమ్మాయి హ్యాంగ్ చేసుకుని చనిపోయిందట" అని చెప్పడం, దానికి మరో పిల్లాడు "ఆత్మలు, గీత్మలు అంతా ట్రాష్" అని కొట్టిపారేయడంతో వీడియో మొదలవుతుంది. కానీ ఆ వెంటనే చూపించిన విజువల్స్ ఆ పిల్లాడి నమ్మకాన్ని వమ్ము చేసేలా, భయానక వాతావరణాన్ని పరిచయం చేశాయి.
వీడియోలో చూపించిన విజువల్స్ చాలా డార్క్ గా ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి వేళ జరిగే సన్నివేశాలు, క్షుద్ర పూజలను తలపించే గుర్తులు, గద్దలు ఎగరడం వంటి షాట్స్ సినిమాలోని సీరియస్ నెస్ ను చూపిస్తున్నాయి. త్రిగున్, హెబ్బా పటేల్, సిరి హన్మంత్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గ్లింప్స్ లో వారి ముఖాల్లోని భయం, ఆందోళన చూస్తుంటే ఏదో తెలియని శక్తితో వారు పోరాడుతున్నట్లు అర్థమవుతోంది.
శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించారు. హార్రర్ సినిమాలకు ప్రాణమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ గ్లింప్స్ లో బాగానే సెట్ అయ్యింది. సంతోష్ సనమోని సినిమాటోగ్రఫీ వర్క్ విజువల్స్ కు రిచ్ లుక్ ని ఇచ్చింది. పాతబడిన బంగ్లా, అక్కడ జరిగే వింత సంఘటనల చుట్టూ ఈ కథ తిరుగుతుందని స్పష్టంగా తెలుస్తోంది.
ఈ సినిమాకు బన్నీ వాస్, వంశీ నందిపాటి వంటి ప్రముఖ నిర్మాతలు రిలీజ్ ప్లాన్ చేస్తుండటం విశేషం. ఇటీవల 'లిటిల్ హార్ట్స్', 'రాజు వెడ్స్ రాంబాయ్' వంటి సినిమాలతో విజయాలు అందుకున్న వీరు, ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నారంటే కంటెంట్ లో ఏదో విషయం ఉండే ఉంటుంది. హెచ్ వి ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పోతుల హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
డిసెంబర్ 12న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. గ్లింప్స్ చివర్లో "ఈషా" అని టైటిల్ పడుతుండగా వినిపించే సౌండ్ ఎఫెక్ట్ కూడా ఆకట్టుకుంది. మరీ ఓవర్ హైప్ లేకుండా, ఒక డీసెంట్ హార్రర్ థ్రిల్లర్ గా అనిపిస్తున్న ఈ చిత్రం, థియేటర్లో ఏ మేరకు భయపెడుతుందో చూడాలి. హార్రర్ లవర్స్ కు ఇది ఒక మంచి ఆప్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
