సీట్ ఎడ్జ్ హారర్ థ్రిల్లర్ పార్ట్ 3కి రంగం సిద్ధం!
ఇప్పటికే ఈ ఫార్ములాతో లారెన్స్ రూపొందిస్తున్న కాంచన సిరీస్ థ్రిల్లర్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ తమిళ, తెలుగు భాషల్లో కాసుల వర్షం కురిపిస్తున్నాయి.
By: Tupaki Entertainment Desk | 1 Jan 2026 9:00 PM ISTహారర్ థ్రిల్లర్‌లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న విషయం తెలిసిందే. ఈ తరహా సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుండటంతో మేకర్స్ వీటికి సీక్వెల్ చేస్తూ మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ఇప్పటికే ఈ ఫార్ములాతో లారెన్స్ రూపొందిస్తున్న కాంచన సిరీస్ థ్రిల్లర్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ తమిళ, తెలుగు భాషల్లో కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే ఫార్ములాని మరో తమిళ డైరెక్టర్ ఫాలో అవుతూ వరుసగా హారర్ థ్రిల్లర్స్‌ని అందిస్తూ ప్రేక్షకుల్ని థ్రిల్‌కు గురి చేస్తున్నాడు.

తనే అజయ్ ఆర్ జ్ఞానముత్తు. అరుళ్ నిధి హీరోగా తను రూపొందించిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ 'డిమోంటీ కాలనీ'. డిమోంటీ బుక్, అండ్ లాకెట్ చుట్టూ ఆసక్తికర మలుపులతో సాగే కథతో రూపొందిన ఈ సినిమా 2015లో విడుదలై తమిళ, తెలుగు భాషల్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమాకు 2024లో పార్ట్ 2ని చేసి తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేశారు.
భార అంచనాల మధ్య విడుదలైన ఈ హారర్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురి చేసింది. అయితే ఇప్పుడు మూడవ భాగం 2026లో రాబోతోంది. రెండవ భాగానికి తొమ్మిదేళ్లు టైమ్ తీసుకున్న దర్శకుడు మూడవ భాగానికి మాత్రం ఎలాంటి గ్యాప్ తీసుకోవడం లేదు. కారణం 2024లో విడుదలైన `డిమోంటీ కాలనీ పార్ట్ 2` బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో రూ.85 కోట్లు రాబట్టడమే. ప్రేక్షకుల్లో నెలకొన్న అంచనాల్ని, ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలనే ప్లాన్‌లో భాగంగానే మూడవ పార్ట్‌ని 2026లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
అరుళ్ నిధి హీరోగా, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించనున్న ఈ మూవీ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ని నూతన సంవత్సరం సందర్భంగా టీమ్ ప్రకటించింది. డీమోంటీ కాలనీ సిరీస్‌లలో ప్రధాన డెవిల్ కనిపించే సింహాసనంపై హీరో అరుళ్ నిధి కూర్చుని డెవిల్‌గా వికటాట్టహాసం చేస్తుండగా, చుట్టు పక్కల శివాల కుప్పులు, సింహాసనం వెనకాల డెవిల్ పక్షి కనిపిస్తున్న తీరు సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని 2026 సమ్మర్‌కు భారీ స్థాయిలో రిలీజ్‌చేయబోతున్నారు.
సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీని ఈ సారి తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి లభించే ఆదరణని దృష్టిలో పెట్టుకుని దీని నుంచి మరిన్ని పార్ట్‌లని తెరపైకి తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ఇదే విషయాన్ని ఆమధ్య హీరో అరుళ్ నిధి వెల్లడించాడు. 2026లో పార్ట్ 3ని రిలీజ్ చేయబోతున్న వేళ దర్శకుడు అజయ్ ఆర్ జ్ఞానముత్తు పార్ట్ 4 స్టోరీ కోసం ఇప్పటికే అన్వేషణ మొదలు పెట్టాడని, పార్ట్ 3 రెండు భాగాలకు మించి ఉంటుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
